మాట్లాడితే చాలు, ఇందిరాగాంధీ నియంత అంటారు… పాకిస్థాన్‌ను చీల్చింది అంటారు… కానీ బంగ్లా విముక్తి పోరుకు ఆమె ఫుల్‌స్టాప్ పెట్టి, అమెరికా వంటి అగ్రదేశాన్నే ఎహెఫోవోయ్ అని ధిక్కరించి, నిలిచింది… కాబట్టే మనం ఇలా నిలబడగలిగాం… అది సరే, మరొక్కటి మాత్రం మన పత్రికల్లో ఎప్పుడూ చెప్పుకోం… మన సెక్యులర్ పాతివ్రత్యం చెడిపోతుందని మన మేధోవర్గం కూడా మాట్లాడదు… జలియన్ వాలాబాగ్ దుర్మార్గం గురించే చెప్పుకుంటాం, సేమ్, అలాంటి దుర్మార్గాన్నే పాకిస్థాన్ ఆర్మీ చేసిందని చదువుకోం, ఎవరైనా చెబితే కదా చదవడానికి, వినడానికి..! బాబ్రీ కూల్చివేత అంటుంటాం గానీ ఆనాటి తూర్పు పాకిస్థాన్‌లో అనగా బంగ్లాదేశ్‌లో సాగిన ఊచకోత, గుడి కూల్చివేత గురించి మాట్లాడం, మాటలు రావు… రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ బంగ్లాదేశ్ వెళ్లాడు… ఆ దేశ యాభయ్యవ విముక్తి ఉత్సవాల్లో పాల్గొనడమే కాదు, బంగ్లాదేశ్ రాజధానిలో రమణ కాళి గుడిని సందర్శించనున్నాడు… అదీ ఇంట్రస్టింగుగా కనిపించిన పాయింట్…
ఈమధ్య గత దసరా ఉత్సవాల సందర్భంగా బంగ్లాదేశ్‌లో హిందువుల మీద దాడులు జరిగాయి… ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఈ గుడికి వెళ్లడం రెండురకాల ప్రాధాన్యాన్ని కలిగి ఉంది… అక్కడ మైనారిటీలు, అనగా హిందువులకు భరోసా… ప్లస్ పాత చేదు జ్ఞాపకాలు నెమరేసుకోవడం..! అసలు ఈ రమణ కాళి మందిరం చరిత్ర ఏమిటి..? ఇది అప్పుడెప్పుడో 600 ఏళ్ల క్రితం కట్టింది… అప్పట్లో హిందువులు గణనీయ సంఖ్యలో ఉండేవాళ్లు… అప్పట్లో అది అవిభక్త బెంగాల్ కదా… ఎప్పుడైతే ఇండియా పాకిస్థాన్‌పై విరుచుకుపడిందో, పాకిస్థానీ ఆర్మీ ఆపరేషన్ సెర్చ్‌లైట్ పేరిట ఈ ‘జలియన్ వాలా బాగ్’కు పూనుకుంది…
Ads
బంగ్లా విముక్తి కోసం కొట్లాడుతున్న ముస్లింలు, హిందువులని మాత్రమే కాదు.., పర్టిక్యులర్‌గా హిందువుల్ని అధికంగా టార్గెట్ చేసింది… ఇండియా మీద అక్కసు అన్నమాట… కాల్చేయడమే, ఏ విచారణల్లేవు… 1971, మార్చి 27… పాకిస్థానీ ఆర్మీ ఈ గుడిలోకి ప్రవేశించింది… అడ్డుపడిన ప్రధాన పూజారి శ్రీమద్ స్వామి పర్మానంద్ గిరితో సహా కనబడిన ప్రతి వాడినీ కాల్చేసింది… అక్కడ ముస్లింలు కూడా తలదాచుకున్నారు, వాళ్లూ ప్రాణాలు కోల్పోయారు… కనీసం 250 మందిని అక్కడికక్కడే కాల్చేశారని ఓ వార్త… కాదు, 1000 మంది అని మరో కథనం… పిల్లలు, మహిళలు, వృద్ధులు… ఎవరైతేనేం, ఎటూ తప్పించుకుపోవడానికి కూడా వీల్లేకుండా చుట్టుముట్టి కాల్చేశారు… తరువాత గుడిని పూర్తిగా నేలమట్టం చేశారు… అలా ఆ గుడి శిథిలాల కింద ఎన్ని వందల శవాలు సమాధి అయిపోయాయో ఎవరికీ తెలియదు… ఆ చుట్టుపక్కల ఇళ్లను కూడా కాలబెట్టారు…
(pic of 1967)
బంగ్లాదేశ్ ఏర్పడ్డాక కొత్త ప్రభుత్వం ఏదో న్యాయం చేస్తుందనుకుంటే ఒరిగిందేమీ లేదు… పైగా ప్రభుత్వం ఆ భూమిని హిందూ బోర్డు నుంచి తీసేసుకుని ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రయోగించింది… తరువాత ప్రజాపనుల శాఖకు, అక్కడి నుంచి ఢాకా క్లబ్‌కు అప్పగించింది… అక్కడ మిగిలిన హిందువులు దరఖాస్తులు పెట్టుకోవడం, విజ్ఞాపనలు సమర్పించుకోవడం జరుగుతూనే ఉంది గానీ పట్టించుకున్నవాళ్లు లేరు… చాలామంది ఇండియాకు వలసవెళ్లిపోయారు… ఎప్పుడో 2000లో షేక్ హసీనా ఎట్టకేలకు వాళ్ల కోరికను మన్నించింది… ఇక మంటపాలు వేసి పూజలు స్టార్ట్ చేశారు… 2004లో విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నారు… 2006లో ఖలీదా జియా ప్రభుత్వం గుడి పక్కా నిర్మాణానికి అంగీకరించింది…
కూల్చివేయబడిన పాత గుడి స్థలంలో గాకుండా, కాస్త దూరంలో 2.5 ఎకరాల స్థలమిస్తాం, అక్కడ కట్టుకొండి అన్నారు… ఆ స్థలం ఫైలూ కదల్లేదు చాలారోజులపాటు… చివరకు 2017లో అప్పటి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ బంగ్లాదేశ్ వెళ్లినప్పుడు ఆ ఫైల్ కదిలింది… సుష్మా ఆ గుడి నిర్మాణానికి సహకరిస్తామని బహిరంగంగా, అధికారికంగా ప్రకటించింది… ఇప్పుడు రాష్ట్రపతి వెళ్తున్నది అక్కడికే… గుడిని ప్రారంభిస్తాడు… ఇంకా కొనసాగుతున్న నిర్మాణాలను సమీక్షిస్తాడు… అదండీ బంగ్లాలో జరిగిన జలియన్ వాలాబాగ్ కథ… ఎంతమందికి తెలుసు ఈ కథ… ఈ నరమేధం..?!
Share this Article