నువ్వు నా పార్టీలో మంట పెడితే… నేను నీ ఇంట్లోనే చిచ్చు రాజేస్తా…… అలాగే ఉంది యూపీలో బీజేపీ కౌంటర్ పాలిటిక్స్ తీరు..! యదువంశంలో ముసలం పుట్టినట్టు… ఇప్పుడు ములాయంసింగ్ యాదవ్ ఇంట్లో లుకలుకలు, కైలాట్కాలు ముదిరిపోయాయి… కుతకుతలాడటమే కాదు, చీలిక స్పష్టంగా కనిపించి, అవి పార్టీ రాజకీయాల్నే బజార్న పడేస్తున్నయ్… మొన్న మనం చెప్పుకున్నాం కదా… ములాయంసింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరబోతోంది అని… దానికి కారణాలేమిటో, కుటుంబం మీద కులం ప్రభావం ఏమిటో వివరంగానే ముచ్చటించుకున్నాం కదా… ఇప్పుడామె బీజేపీలో చేరిపోయింది… అంతేకాదు, ఇంకొన్ని డెవలప్‌మెంట్స్ కూడా ఉన్నయ్… అపర్ణా యాదవ్ మండిపడటానికి, బీజేపీలో చేరడానికి కారణాలేమిటో ఓసారి ఈ లింకు ఓపెన్ చేసి చదవండి…
అపర్ణ యాదవ్… ఈమెది ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ… ఆ కుటుంబం మీద కులప్రభావం…
ఇప్పుడు అపర్ణ మాత్రమే కాదు… ములాయం సింగ్ యాదవ్ బావమరిది, అనగా రెండో భార్య సోదరుడు ప్రమోద్ కుమార్ గుప్త అలియాస్ ఎల్ఎస్ కూడా సమాజ్‌వాదీ పార్టీని వదిలేసి బీజేపీలో చేరిపోతున్నాడు… తనతోపాటు మరికొందరు నేతల్నీ తీసుకుపోతున్నాడు… అంటే ములాయం రెండో భార్య సాధన గుప్త పరివారం ములాయం పెద్ద కొడుకు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేషుడి మీద బాహటంగానే తిరుగుబాటు ప్రకటించింది… మొదటి నుంచే సాధన గుప్త, అనగా తన చిన్నమ్మ అంటే మండిపడే అఖిలేషుడు ఇప్పుడిక ఆ పరివారాన్ని పూర్తిగా తన పార్టీ వ్యవహారాల నుంచి దూరం ఉంచేయాలని నిర్ణయించేశాడు… అసలు ఎవరు ఈ సాధన గుప్త..?
Ads
2003కు ముందు ఆమె ఎవరికీ పెద్దగా తెలియదు… అప్పటికే ఆమె తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది… ఓ కొడుకున్నాడు… పేరు ప్రతీక్… అఖిలేష్ తల్లి మాలతి యాదవ్ మరణించాక ఈ సాధన గుప్త ములాయం భార్యగా తెర మీదకు వచ్చింది అదే సంవత్సరం… ములాయం చాలా పెద్ద మనసుతో ప్రతీక్‌ను కొడుకుగా కూడా స్వీకరించాడు… కానీ తన వంశోద్ధారకుడు, కులోద్ధారకుడు అఖిలేషే అనే భావనతో సాధనను, కొడుకు ప్రతీక్‌ను రాజకీయాల నుంచి దూరం ఉంచసాగాడు… సాధనకు పెత్తనాలు, రాజకీయాల మీద ఇంట్రస్టు… కానీ ములాయం పడనిచ్చేవాడు కాదు…
సాధన కోడలు అపర్ణకూ రాజకీయాల్లో ఆసక్తి ఉంది, కానీ అఖిలేష్ ఎక్కడికక్కడ మరదలిని కట్ చేసేవాడు… తప్పనిసరిగా టికెట్టు ఇవ్వాల్సి వచ్చినా, ఓడించాడు… అప్పట్లో ములాయం సోదరుడు శివపాల్ అన్నతో విభేదించి, సొంతంగా వేరే కుంపటి పెట్టుకున్నప్పుడు సాధన వర్గం తనకు సపోర్ట్ చేసింది… సాధన సోదరుడు ప్రమోద్‌కుమార్ ఎన్నికల్లో గెలిచినా అఖిలేష్ పెద్ద ప్రయారిటీ ఇచ్చేవాడు కాదు, ఎక్కడికక్కడ కట్ చేసేవాడు… ఒక దశలో పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్ కూడా చేశాడు… ఇలా మొదటి నుంచీ అఖిలేష్ వర్సెస్ చిన్నమ్మ వివాదాలు మండుతూనే ఉన్నయ్…
ఈ ప్రమోద్ అప్పట్లో, విదున సీటు నుంచి 2012లో బీఎస్పీ లీడర్ దేవేవ్ శాక్య మీద గెలిచాడు… ఇప్పుడు అదే దేవేశ్, తన బీజేపీ ఎమ్మెల్యే బ్రదర్ వినయ్ శాక్యతో కలిసి సమాజ్‌వాదీలో చేరిపోయాడు… అంతకుముందే 2017లో అఖిలేష్ ప్రమోద్‌కు టికెట్టు రాకుండా చేశాడు… సో, ఇప్పుడిక దేవేశ్‌కు టికెట్టు వచ్చే పరిస్థితి… అంటే ప్రమోద్‌కు తనకు కత్తెర తప్పదని అర్థమైపోయింది… పైగా ములాయం ఇప్పుడు కోరల్లేని పులి కాబట్టి, అఖిలేష్ చేతిలో బొమ్మ కాబట్టి, అఖిలేష్‌కు చిన్నమ్మ అంటే పడదు కాబట్టి, తొక్కేస్తాడు కాబట్టి… ప్రమోద్ బీజేపీ వైపు చూశాడు… అప్పటికే అపర్ణ బీజేపీతో టచ్‌లో ఉంది… సో, ములాయం ఇంటిని చీల్చేసిన బీజేపీ ములాయం బావమరిదిని, కోడల్ని, భార్యను, కొడుకును తనవైపు లాగేసింది… మరి రాజకీయాలు అంటే అంతే కదా… ఎప్పుడో శ్రీశ్రీ చెప్పాడు కదా…
పోనీ, పోనీ,పోతే పోనీ!సతుల్, సుతుల్, హితుల్ పోనీ!పోతే పోనీ!
రానీ, రానీ !వస్తే రానీ !కష్టాల్, నష్టాల్,కోపాల్, తాపాల్, శాపాల్ రానీ!వస్తే రానీ !తిట్లూ, రాట్లూ , పాట్లూ, రానీ !రానీ, రానీ !
Share this Article