ఈ వార్త వెలుగు అనే కాషాయ దినపత్రిక ఫస్ట్ పేజీలో కనిపించింది… ఒక్కసారిగా చివుక్కుమన్నది… బీజేపీ ఎజెండా మేరకు రోజూ ఏదో ఒక కారణంతో కేసీయార్ ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచాలనే తపన, తాపత్రయం, ప్రయాస రాజకీయ కోణంలో అర్థం చేసుకుందాం… అన్ని పత్రికలూ అంతేగా… వెలుగు భిన్నమేమీ కాదుగా… బాసుతోపాటు నిలువెల్లా కాషాయం పులుముకుని పింక్‌ను ఎండగట్టాలి… వోకే… కానీ ఆ పరుగులో పడి, ఒక పనిని అవమానిస్తున్నామనే సోయి లేకపోతే ఎలా..?
అవునూ, గ్రాడ్యుయేషన్ చేస్తే సర్కారీ కొలువు చేయాల్సిందేనా..? జాబ్ నోటిఫికేషన్లు పడకపోవడం వల్లే మార్కెట్ యార్డుల్లో హామాలీ పనికి గిరాకీ వచ్చిందా..? అసలు హమాలీ పని అంత చీపుగా కనిపించడం ఏమిటి..? మార్కెట్ యార్డుల్లో, ఎఫ్‌సీఐ-స్టేట్ కార్పొరేషన్ గోదాముల్లో హమాలీ లైసెన్సులకు ఎంత డిమాండ్ ఉందో తెలుసా..? వాళ్ల సంపాదన ఎంతో తెలుసా..? అరె, వాళ్లకు ఎంతొస్తుందో వదిలేద్దాం… డిగ్నిటీ ఆఫ్ లేబర్… వాళ్ల పనిని గౌరవించాలి కదా… అంతెందుకు..? బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో హమాలీ పని గురించి తెలుసా..? సమాజం మీదకు వదిలేసిన గ్రామీణ, పట్టణ జర్నలిస్టులకన్నా నయమే కదా… వాళ్లకు మీడియా సంస్థలు ఏం చెల్లిస్తున్నయ్..? ఎంత..?
Ads
ఎస్, కేసీయార్ ప్రభుత్వం వచ్చాక జాబ్ నోటిఫికేషన్లు లేవు… ఉద్యోగాల భర్తీ మీద అన్నీ కాకిలెక్కలే… అసలు ప్రభుత్వ ఎజెండాలో ఉద్యోగాల భర్తీ అనేది పెద్ద ప్రయారిటీ సబ్జెక్టే కాదు… కేవలం ఉద్యోగాలు ఇవ్వడం కోసం డీఎస్సీ వేయాలా అని గతంలో ఓసారి పాలకుడే సభలో ప్రశ్నించినట్టు గుర్తుంది… పోనీ, పట్టణాలు, పల్లెల నడుమ టీచర్ల రేషనలైజేషన్ చేస్తారా అంటే అదీ చేతకాదు, గ్రూప్ నోటిఫికేషన్లు ఉండవు… కొత్త జిల్లాలు, సర్వీస్ రూల్స్, స్థానికత ఇష్యూస్ వంటి చాలా కారణాలు చెప్పారు, మరిప్పుడు..? ఈమధ్య కొందరు నిరుద్యోగుల ఆత్మహత్యలూ చూస్తున్నాం… తాజాగా ఈరోజు ఖమ్మంలో ఓ నిరుద్యోగి ముత్యాల సాగర్ ఆత్మహత్య కలిచివేసే వార్త… రైలు పట్టాల వద్ద మొండెం లేని ఆ తల ఫోటో భయానకంగా ఉంది, అందుకే ఇక్కడ పోస్ట్ చేయడం లేదు…
అదుగో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు రాబోతున్నయ్, ఇక కొలువుల జాతరే అని లీకులొస్తయ్, పనిలేని జర్నలిస్టులు రెచ్చిపోయి రాస్తారు… అవి నమ్మి, వేలాది మంది నిరుద్యోగులు పోలోమంటూ అప్పోసప్పో చేయించి వేల రూపాయలతో హైదరాబాద్ వచ్చి, ఆ తలకుమాసిన కోచింగ్ సెంటర్లలో తగలేస్తారు… ఇదేకదా జరుగుతున్నది… అసలే కరోనా దెబ్బకు హాస్పిటళ్ల దోపిడీకి వేల కుటుంబాలు అప్పులపాలయ్యాయి… ఇది అదనపు కష్టం, నష్టం… ఐనా ప్రభుత్వ ఉద్యోగాలంటే సర్వీస్ కమిషనే మొత్తం నింపదు కదా… రాసేవాడికి లేదు, అచ్చేసేవాడికి అసలే లేదు…
ఇవన్నీ రాయండి, పర్లేదు, కానీ ఉద్యోగాల్లేక హమాలీ పనిచేస్తున్నారు అనే భావనను వ్యాప్తి చేయడమే అభ్యంతరకరం… పని ఏదయితేనేం, దాన్ని హీనంగా ఎందుకు చూడాలి..? ఒక రైతు, ఒక కూలీ, ఒక హమాలీ, ఒక పారిశుధ్య కార్మికుడు, ఒక కులవృత్తిదారు, ఓ రిక్షా కార్మికుడు, ఓ మిల్లు వర్కర్, మిల్క్ వెండర్స్, చెత్త సేకరించేవాళ్లు, ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, పెయింటర్స్, భవననిర్మాణ కూలీలు… అసలు వీళ్లంతా లేకపోతే సమాజజీవనం ఎక్కడిది..? ఒక కేసీయార్ ఉద్యోగ ఉద్ధారకుడు అనేమీ చెప్పడం లేదు ఇక్కడ… అసలు నువ్వు పెద్ద ఎత్తున టాంటాం చేసుకున్న నిరుద్యోగ భృతి ఏమైంది సారూ అడిగితే జవాబు చెప్పేవాడు లేడు… పైగా ప్రభుత్వ కొలువులు చేసేవాళ్లకు పదవీవిరమణ పరిమితిని పెంచిపారేశాడు… అయితే అవన్నీ పాయింట్ టు పాయింట్ రాస్తే వోకే… కానీ డిగ్రీలు, పీజీలు చదివి చివరకు హమాలీ పని చేస్తున్నారు అనే వ్యక్తీకరణ తప్పు… ఖచ్చితంగా హమాలీ పని మంచిదే… మంచిదే…
Share this Article