Bharadwaja Rangavajhala…………. సినిమాకు కీలకం కెమేరా. సెల్యులాయిడ్ మీద ఒక కథ పండాలంటే ప్రతిభావంతుడైన కెమేరా మెన్ కావాలి. దర్శకుడి ఆలోచనలను ఆకళింపు చేసుకుని వాటిని మరింత ప్రతిభా వంతంగా తెరమీద చూపించడమే కెమేరామెన్ బాధ్యత. ఈ క్రమం సక్రమంగా జరిగినప్పుడే సినిమా ప్రేక్షకులను అలరించగలుగుతుంది. అలాంటి ప్రతిభా వంతుడైన కెమేరామెన్ లోక్ సింగ్. ప్రతిభతో పాటు విపరీతమైన అంకితభావం ఉన్న కెమేరామెన్ లోక్ సింగ్.
లోక్ సింగ్ అనే పేరు వినగానే చాలా మంది ఇతను ఉత్తర భారతదేశం నుంచి వచ్చాడనుకుంటారు. కానీ లోక్ సింగ్ పుట్టిందీ పెరిగిందీ అంతా చెన్నైలోనే. ఇంట్లో సినిమా వాతావరణం ఉంది. లోక్ సింగ్ ఎవరో కాదు…ప్రఖ్యాత దర్శకుడు ఎ.భీమ్ సింగ్ అన్నగారు హుకుం సింగ్ కుమారుడు.
భీం సింగ్ రెండో కొడుకు కన్నన్ కూడా సినిమాటోగ్రాఫరే. భారతీరాజా సినిమాలకు పనిచేసేవాడు. ఎన్.టి.ఆర్ తో ధనమా దైవమా? బంగారు మనిషి లాంటి సక్సస్ ఫుల్ సినిమాలు తీసిన భీంసింగ్ కరుణామయుడు చిత్రం తీస్తూ… మధ్యలో కన్నుమూశారు.
గ్రేట్ డైరక్టర్ భీం సింగ్ మూలంగా లోక్ సింగ్ కు చిన్నతనంలోనే సినిమా అలవడింది. ప్రస్తుత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో కలసి చెన్నై కేసరి హైస్కూల్ లో చదువుకున్నాడు. సినిమా రంగంలో కెమేరా అనేది సుప్రీం అనే విషయం చిన్న వయసులోనే లోక్ సింగ్ కు అర్ధమైపోయింది. తన జీవితం ఆ దిశగా సాగించాలని నిర్ణయించుకున్నాడు. ఆనాటి ప్రముఖ కెమేరామెన్ కె.ఎస్.ప్రసాద్ దగ్గర పనిలో చేరిపోయాడు.
Ads
కె.వి.రెడ్డి స్వంత సినిమా పెళ్లి నాటి ప్రమాణాలు తదితర చిత్రాలకూ కెమేరామెన్ ప్రసాదే. కె.ఎస్.ప్రసాద్ దగ్గర పనిచేస్తూనే నెమ్మదిగా ఇషాన్ ఆర్య టీమ్ తో చేరిపోయాడు లోక్ సింగ్. ఇషాన్ దగ్గర పనిచేసిన బాబా అజ్మీ దగ్గర ఆపరేటివ్ కెమేరామెన్ గాను..స్పెషల్ ఎఫెక్ట్స్ కోసమూ చేరాడు. అలా బాబా అజ్మీ సారధ్యంలో వచ్చిన రాజాధిరాజు కు ఆపరేటివ్ కెమేరామెన్ గా పనిచేశాడు. అలాగే…ఆ సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ చేసిన రవినగాయిచ్ ప్రేరణతో బాపు దగ్గరున్న Fantasy locations పుస్తకాలలోంచి నల్లగా ఉండే చోట్ల మాస్క్ చేసి – నూతన్ ప్రసాదూ, విజయచందరూ అక్కడ నడుస్తూన్నట్టు అద్భుత మాయాజాలం చేశాడు లోక్ సింగ్.
ఆ తర్వాత వచ్చిన బాపుగారి త్యాగయ్యలోనూ స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ లోక్ సింగ్ చేసినవే. ఇలా ఉండగా…అల్లు అరవింద్ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శుభలేఖకు పూర్తి స్థాయిలో కెమేరామెన్ అయ్యాడు లోక్ సింగ్. చిరంజీవిని అంత వరకు ఎవరూ చూపించనంత అందంగా చూపించాడు. ముఖ్యంగా సినిమా ప్రారంభంలో వచ్చే ఎడ్వర్టైజ్మెంట్ సాంగ్ లో అయితే చిరంజీవి చాలా కొత్తగా అనిపిస్తాడు. చెన్నైలో తన ఖాళీ సమయాలన్నీ ఎక్కువగా అల్లు అరవింద్ కార్యాలయంలోనే గడిపేవాడు లోక్ సింగ్. అల్లు అరవింద్ ద్వారా చిరంజీవితోనూ పరిచయం అయ్యింది.
శుభలేఖ తర్వాత చిరంజీవితో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఫిలిం చేశారు అరవింద్. రాజ్ భరత్ డైరక్ట్ చేసిన ఆ మూవీ పేరు యమకింకరుడు.
సినిమాటోగ్రాఫర్ గా లోక్ సింగ్ ప్రేక్షకులకు బాగా రిజిష్టర్ అయ్యింది కూడా ఆ సినిమాతోనే. యమకింకరుడు సినిమా మ్యాడ్ మాక్స్ కు రీమేక్. అయితేనేం లోక్ సింగ్ , రాజ్ భరత్, చిరంజీవి కల్సి టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించగలిగారు. యాక్షన్ హీరోగా చిరంజీవి ఢంకా బజాయించింది ఆ సినిమాతోనే. ఆ సినిమా లో చిరంజీవి ఎంట్రన్స్ సీనే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు రాజ్ భరత్, లోక్ సింగులు.
బాపు డైరక్షన్ లో చిరంజీవి హీరోగా సినిమా అనౌన్స్ చేశారు జయకృష్ణ.
సినిమా పేరు మంత్రిగారి వియ్యంకుడు. బాపు దగ్గర అప్పటికే స్పెషల్ ఎఫెక్ట్స్ చేసి ఉన్న లోక్ సింగ్ రెచ్చిపోయాడు. మంత్రిగారి వియ్యంకుడులో ఫైట్స్ ను కూడా డాన్సులంత సొగసుగా తీర్చిదిద్దారు చిరంజీవి, లోక్ సింగులు. ఈ ఫైట్స్ ను మాంటేజ్ చేస్తూ ఓ సూపర్ సాంగ్ పెట్టారు బాపుగారు. ఏమనినే పాడెదనో అంటూ వచ్చే ఆ పాట లోక్ సింగ్ కెమేరా పనితనం ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్తుంది. యమకింకరుడు, మంత్రిగారి వియ్యంకుడు మధ్యలో చిరంజీవి తోనే మరో సూపర్ సినిమా కు పనిచేశారు లోక్ సింగ్. ఆ తర్వాత ఓ సెన్సేషనల్ కాంబినేషన్ కు దారి తీసిన ఆ సినిమా పేరు అభిలాష.
క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో ఎర్రగులాబీలు, టిక్ టిక్ టిక్ లాంటి సినిమాల తర్వాత వచ్చిన తొలి స్ట్రెయిట్ చిత్రం అభిలాష. ఆ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది అభిలాష. కథకు తగ్గ మూడ్ తీసుకురావడంలో లోక్ సింగ్ చేసిన కృషే సినిమా సక్సస్ కు ప్రధాన కారణం.
పాటల చిత్రీకరణలో కూడా ట్రెండ్ సెట్ చేసిన సినిమా అభిలాష. ఇళయరాజా సంగీతం…లోక్ సింగ్ కెమేరా పనితనం… చిరంజీవి డాన్సు పోటా పోటీగా సాగిన పాటలే అభిలాషలో అన్నీ. ముఖ్యంగా యురేకా సక్కా మిక్కా పాట అయితే అదరగొట్టేశారు. పాట ఇంటర్ లూడ్స్ లో వచ్చే దృశ్యాలైతే చాలా అందంగానే కాదు..ఆహ్లాదకరంగానూ ఉంటాయి.
ఆ తర్వాత చిరంజీవితో క్రియేటివ్ కమర్షియల్స్ తీసిన అన్ని చిత్రాలూ లోక్ సింగ్ సారధ్యంలో వచ్చినవే. చిరంజీవి, కోదండరామిరెడ్డి, లోక్ సింగ్ … ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమాల మీద ప్రేక్షకుల్లో చాలా పెద్ద ఎక్స్ పెక్టేషన్స్ ఉండేవి. పాటల పిక్చరైజేషన్ చాలా గొప్పగా ఉండేది. పసివాడి ప్రాణం సినిమాలో అందం శరణం గచ్చామి పాటలో సుమలత ఎంత అందంగా ఉంటుందో… అది తన గొప్పతనమో…లోక్ సింగ్ ప్రతిభో అర్ధం కానంతగా ఉంటుందా పాట.
చిరంజీవితోనే కాదు…ఇతర హీరోల సినిమాలకూ లోక్ సింగ్ ఫొటోగ్రఫీ చేశారు. ఆఫ్ బీట్ చిత్రాలు తీసే దర్శకుల చిత్రాలకూ పనిచేశారు.
కెమేరామెన్ గా దృశ్యం తను అనుకున్నట్టు రావడానికి ఎంతటి రిస్క్ చేయడానికైనా లోక్ సింగ్ సై అనేవాడు. నిజానికి ఆ తపనే ఆయన ప్రాణం హరించింది. లోక్ సింగ్ సినిమాటోగ్రఫీ చేసిన సినిమాలు కూడా ఇషాన్ ఆర్య చిత్రాల్లా బంగారు వన్నెలో మెరిసిపోతూంటాయి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నవతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన రాజు రాణి జాకి మూవీకి లోక్ సింగే ఫొటోగ్రఫీ. అలాగే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం సినిమాకూ లోక్ సింగే సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఈ రెండు చిత్రాల్లోనూ లోక్ సింగ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.
జంధ్యాల తీసిన రావూగోపాల్రావూకి కూడా లోక్ సింగే కెమేరా. లోక్ సింగ్ లో డెడికేషన్ పాళ్లు ఎక్కువ. తను తీస్తున్న దృశ్యం అనుకున్నట్టు రాకపోతే మాత్రం లోక్ సింగ్ కి చిర్రెత్తుకొస్తుంది. చిరంజీవి, విజయబాపినీడు కాంబినేసన్ లో అల్లు అరవింద్ హీరో తీశారు. ఆ సినిమాలో ఓ సీన్ లో చిరంజీవి మీదకు విలన్స్ లారీతో దాడి చేస్తారు. ఆ డ్రైవర్ తనకు కావాల్సిన రీతిలో డ్రైవ్ చేయడం లేదని చిరాకు పడ్డ లోక్ సింగ్ కెమేరా అసిస్టెంట్ కి ఇచ్చి…తనే వెళ్లి లారీ డ్రైవ్ చేశాడు. అదీ ఆయన అంకితభావం. సరిగ్గా ఆ డెడికేషనే లోక్ సింగ్ ప్రాణాలు బలితీసుకుంది.
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తన కొడుకు భరత్ తో వార్నింగ్ అనే మూవీ తీశారు. దానికి లోక్ సింగ్ కు కెమేరా బాధ్యతలు అప్పగించారు. ఓ పాట చిత్రీకరణలో హీరోయిన్ ఆమని మంటల మధ్య డాన్స్ చేయాలి… ఆ మంటల కోసం ఓ కుర్రాడు పెట్రోలు పోస్తున్నాడు. తను అనుకున్నట్టు మంటలు రావడం లేదని లోక్ సింగ్ అసహనానికి గురై… తనే వెళ్లి మంటల మీద పెట్రోలు పోశాడు. ఆ పెట్రోలు పోయడంలో తను వేసుకున్న ఫుల్ హాండ్స్ షర్ట్ పెట్రోల్ తో తడుస్తోందనీ… మంటలు తనను అంటుకునే ప్రమాదం ఉందనీ ఆయనకి అనిపించలేదు.
జస్ట్ సీన్ బాగా రావాలి అంతే ఆయన బుర్రలో ఉన్నది. కానీ మంటలకి ఇవేం తెలీదు కదా…పెట్రోల్ పోసి వెనక్కొస్తున్న లోక్ సింగ్ ను ఒక్కసారి మంటలు కమ్ముకున్నాయి. అంతటి ప్రతిభావంతుడైన కెమేరామెన్ అందరూ చూస్తుండగా… మంటల్లో ఆహుతైపోయాడు. లోక్ సింగ్ అనగానే గుర్తొచ్చే పాటల్లో.. రాక్షసుడులో మళ్లి మళ్లి ఇది రాని రోజు… అలాగే అలనాటి చిరంజీవి చిత్రాలు చూస్తున్న ప్రతి సందర్భంలోనూ ప్రేక్షకుల మనసుల్లో ముల్లుతో పొడుస్తున్నట్టు సన్నని బాధ. అది లోక్ సింగ్ ను తల్చుకునే. మెగాస్టార్ పరిమనెంట్ సినిమాటోగ్రాఫర్ గా చరిత్ర సృష్టించిన లోక్ సింగ్ అలా అర్ధాంతరంగా కన్నుమూయడం… చలన చిత్ర ప్రేమికుల్ని దు:ఖసాగరంలో ముంచెత్తింది.
Share this Article