మళ్లీ మొదలైంది… అక్కినేని సుమంత్ నటించిన ఈ సినిమా సైలెంటుగా ఓటీటీలోకి వచ్చింది… అది జీ5 యాప్… పెద్దగా ఎవరూ చూడరు… ఐనాసరే, మస్తు చూస్తున్నరు, ఆహో ఓహో, ఈ సినిమా పెట్టాక 2 లక్షల మంది కొత్తగా చేరారు, కోట్ల నిమిషాలపాటు చూశారు అని ఏదో చెప్పుకుంది… సాంతంగా చెప్పుకోవడం, నిజమో కాదో చెప్పే యంత్రాంగం ఏదీ లేదు… సో, దాన్ని వదిలేద్దాం… నిజానికి అశ్లీలం, అడ్డగోలు ఫార్ములా వాసనలు లేకుండా సినిమా నీటుగా ఉంది…
సదరు సుమంతుడు అదే లుక్కు, అదే బాడీ లాంగ్వేజీ, అదే డిక్షన్… ఐనాసరే, తన మార్గమేమిటో కనుక్కున్నాడు… ఇన్నేళ్లూ పెద్ద తెర మీద ఏవేవో సినిమాలు చేశాడు, జనం లైట్ తీసుకున్నారు… ఇంత సుదీర్ఘ పయనంలో ఒక్క గోదావరి తప్ప ఇదీ నా సినిమా అని గొప్పగా చెప్పుకునే సినిమా ఒక్కటి లేదు… ఐనా దండయాత్రలు చేసీ చేసీ, ఇప్పుడిక కొత్త దారిలో పడ్డాడు… సినిమా మరీ అంతగా కనెక్టయ్యేలా లేకపోయినా, క్లీన్‌గా ఉంది… దాన్నలా వదిలేస్తే…
చాలామందిలో ఓ అనుమానం… నిజంగా ఒకసారి విడాకులు తీసుకున్నాక, రెండో పెళ్లికి ఒక మగాడు అంత ఆలోచిస్తాడా..? భయపడతాడా..? వెనుకంజ వేస్తాడా..? ఇక వద్దులే అనుకుంటాడా..? ఇవీ ప్రశ్నలు… నిజానికి మన చుట్టుపక్కల అనుభవాలు వేరు… విడాకుల తరువాత వెంటనే అన్నీ దులిపేసుకుని, మాట్రిమోనీ సైట్లు, గ్రూపుల్లో ఫోటోలు పెట్టేసి, రెడీ అయిపోతుంటారు… అఫ్ కోర్స్, వాళ్లకు కొత్త సంబంధాలు అంత వీజీ కాదు… కానీ కొత్త పెళ్లికి సందేహించడం అనేది ఎందుకో ఆ సినిమాలో కొత్త కొత్తగా అనిపించింది…
Ads
ఇది ఆ సినిమా రివ్యూ కాదు, దానికి పెద్దగా రివ్యూలు కూడా అక్కర్లేదు… అయితే ఒకసారి విడాకులు తీసుకున్నాక లేడీస్‌కు మళ్లీ పెళ్లి అనేది కాస్త కష్టం… జరగడం లేదని కాదు… కానీ ఓ ప్రయాస… పైగా చేదు అనుభవం తరువాత వాళ్లలో ఓరకమైన భయం… మగాడిలోనూ అంతే అనేది కాస్త సత్యదూరంగా అనిపిస్తుంది కదా… కానీ మగాళ్లకూ కష్టాలుంటయ్ అని సినిమా డైరెక్టర్ చెప్పాడు…
ఒక వీడియో చూస్తుంటే మాత్రం ఈ సినిమా గుర్తొచ్చింది… సంపత్‌రాజ్ అనే ఓ కేరక్టర్ ఆర్టిస్టుతో ఏబీఎన్ రాధాకృష్ణ రీసెంటుగా చేసిన ఇంటర్వ్యూ అది… తన పెళ్లి పదేళ్లకు ముగిసిపోయింది… (కమల్‌హాసన్ సరసన నాయకుడు సినిమాలో నటించిన శరణ్య అనే హీరోయిన్ ఆయన మొదటి భార్య అని బోలెడు యూట్యూబ్ చానెళ్లు ఎడాపెడా రాసిపారేశాయి… కానీ అది నిజం కాదు… ఆమె ఒక సినిమాలో ఆయనతో నటించింది… అంతే…) ఆమె సంసారం వేరు, పాపం, ఆమెను వదిలేయండి, సంపత్‌రాజ్ కూడా ఆమె తన భార్య కాదని క్లారిటీ కూడా ఇచ్చాడు… సంపత్ నుంచి విడాకులు తీసుకున్న ఆయన భార్య కూడా వేరే పెళ్లి చేసుకుంది, తరువాత ఇద్దరు పిల్లలు కూడా…
ఈ ఇంటర్వ్యూలో నచ్చింది ఏమిటంటే… సంపత్ ఓపెన్‌గా షేర్ చేసుకోవడం, పెళ్లి తరువాత ద్వేషాన్ని పెంచుకోవకపోవడం, తన బిడ్డను కూడా ఆమె కొత్త పిల్లల్ని ప్రేమించాలని చెప్పడం…! అలాగే దాదాపు ఇరవై ఏళ్లుగా మళ్లీ పెళ్లి అంటే తనకు ఏదో సందేహం, ఏదో భయం… తనను తాను పూర్తిగా తన కెరీర్‌పైకి మళ్లించుకున్నాడు… ‘‘నాకు ఒంటరితనం అలవాటైపోయింది… ఏదో ఓ తోడు కావాలి కాబట్టి వెతుక్కోవడం సరికాదు, ఒకవేళ అలా కనెక్టయ్యే స్థితి వస్తే పెళ్లి చేసుకుంటాను..’’ అంటున్నాడు…
ఏమాటకామాట ఇంటర్వ్యూలో ఒక అంశం భలే అనిపించింది… ‘‘మా అమ్మ తమిళియన్, ఊరు తిరుచ్చి… నాన్నది నెల్లూరు, ఆర్మీ… ఆమె తరువాత 8 భాషలు నేర్చేసుకుంది… మేం మొత్తం ఏడుగురం… ఓ అన్న ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇస్లాంలోకి మారిపోయాడు… మరో అన్న లండన్‌లో క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు… ఓ చెల్లె మహారాష్ట్రియన్‌ను పెళ్లి చేసుకుంది..’’ అని వివరించాడు… పాన్ ఇండియా ఫ్యామిలీ… బాగుంది సంపత్ రాజ్… నచ్చింది…
Share this Article