షమ్నా కాశిం అలియాస్ పూర్ణ తెలుసు కదా మీకు…? కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది, మలయాళీ… మొన్నటిదాకా ఢీ డాన్స్ షో జడ్జిగా కూడా చేసింది… ఆమె జన్మతః ముస్లిం… శాస్త్రీయ నాట్యంలో శిక్షణ పొందింది… మంచి నర్తకి… అవును, కళకు మతం ఏముంటుంది..? ఉంటుందా..?! ఉండదు కదా… కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పూర్ణలాగే బోలెడు మంది నాన్ హిందూస్ కూడా భరతనాట్యం, కథాకళి వంటి నాట్యరీతుల్లో శిక్షణ పొందుతుంటారు… పూర్ణను ఉదహరించడం దేనికంటే, విషయం సులభగ్రాహ్యం కావడానికి… ఇక తాజా వార్తలోకి వెళ్దాం…
కేరళ, త్రిసూర్ జిల్లాలో కూడల్ మాణిక్యం అనే గుడి ఉంది… వచ్చే నెల 21 నుంచి పదిరోజులపాటు నృత్యోత్సవాలు జరుగుతాయి… దాదాపు 800 మంది కళాకారులు భరతనాట్యం సహా పలు శాస్త్రీయ నృత్యరీతుల్లో ప్రదర్శనలిస్తారు… ఈసారి కూడా కళాకారుల ఎంపిక జరిగిపోయింది… కానీ హఠాత్తుగా భరతనాట్యం జాబితా నుంచి మన్సియా అనే ఆర్టిస్టు పేరు కొట్టేశారు… ఆమె ప్రదర్శన రద్దు చేశారు… అదేమంటే… నువ్వు హిందువు కాదు కదా అని బదులిచ్చారు…
ఆమె ముస్లిం, ఐనా తను హేతువాదిని, నాస్తికురాలిని అని చెప్పుకుంది ఆమె… టెంపుల్ బోర్డు ఛైర్పర్సన్ ప్రదీప్ మేనన్ చెప్పేదేమిటీ అంటే… ‘‘మేం ఆర్టిస్టులందరినీ మీ మతమేమిటీ అనడిగాం… మన్సియా తనకు ఏ మతమూ లేదని పేర్కొంది… అందుకని గుడి ప్రాంగణంలో ప్రదర్శన అనుమతించబడదు… గుడి సంప్రదాయాల మేరకే నడుస్తున్నాం’’… దీనిపై మన్సియా స్పందిస్తూ ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టుకుంది… ‘‘ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎండోమెంట్స్ బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటి..? డాన్సర్లకు మెరిట్ ముఖ్యమా..? మతం ముఖ్యమా..? గుడి కమిటీ మతమే ముఖ్యమంటోంది… నేనేం చేయాలి..?’’ అని అడిగింది…
Ads
మన్సియా అల్లాటప్పా డాన్సర్ ఏమీ కాదు… కేరళ కళామందలంలో భరతనాట్యంలో పీహెచ్డీ చేస్తోంది… ఆమె ఆర్టిస్ట్ కమ్ వైణికుడు శ్యామ్ కల్యాణ్‌ను పెళ్లి చేసుకుంది… పెళ్లి సమయంలో హిందూమతంలోకి మారారా అని గుడి కమిటీ మెంబర్ ఒకరు అడిగారట… అలా ఆమె ప్రదర్శనకు క్లియరెన్స్ ఇవ్వడానికి..! కానీ అప్పుడు కూడా నాకు ఏ మతమూ లేదనే చెప్పిందట ఆమె…
Share this Article