ఒక హాస్పిటల్… ఒక రోగి… రోగి ఖర్మకాలి లేదా డాక్టర్ ఖర్మకాలి ఆ రోగి హరీమన్నాడు… వ్యాధి తిరగబెట్టిందో, ఆ టైమ్‌లో అదుపులోకి రాలేదో, లేక అప్పటికే ఆయుష్షు మూడిందో, ఇంకేం కారణమో గానీ బకెట్ తన్నేశాడు… ఆ క్షణంలో బంధువుల ఆవేదన ఆవేశంగా మారుతుంది కొన్నిసార్లు… డాక్టర్ నిర్లక్ష్యమనో, సిబ్బంది పట్టింపులేనితనం అనో ఆరోపిస్తూ విధ్వంసానికి పాల్పడతారు… చాలా చూస్తున్నాం…
కానీ ఇది మరింత విషమించిన కేసు… పోలీసులు ఏకంగా మర్డర్ కేసు పెట్టేశారు ఓ లేడీ డాక్టర్‌పై… దాంతో ఆమె సూసైడ్ చేసుకుంది.,. దారుణం కదా… అవును… వివరాల్లోకి వెళ్తే… ఆమె పేరు అర్చన శర్మ… రాజస్థాన్, డౌసా జిల్లాలో డాక్టర్… భర్తతో కలిసి ఓ హాస్పిటల్ నడుపుతుంది… హాస్పిటల్ పైనే నివాసం… మంగళవారం ఓ గర్భిణి ఆ హాస్పిటల్‌లో మరణించింది… ఆమె కుటుంబసభ్యులు, బంధువులు హాస్పిటల్ బయట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు… డాక్టర్ మీద చర్య కోసం డిమాండ్ చేశారు…
ఇక్కడ విచిత్రం ఏమిటంటే..? పోలీసులు ఆమె మీద మర్డర్ కేసు పెట్టేశారు… ఇక ఎక్కడ ఏ రోగి మరణించినా సరే, తనను ట్రీట్ చేసిన డాక్టర్ మీద మర్డర్ కేసు పెట్టేస్తారా..? జస్ట్, బంధుగణం డిమాండ్ చేస్తే సరిపోతుందా..? ఐనా మర్డర్‌కు ఓ మోటివ్ ఉండాలి కదా… ఉద్దేశపూర్వకంగా హతమార్చి ఉండాలి కదా… ఒకవేళ నిజంగానే డాక్టర్ నిర్లక్ష్యం, తప్పుడు చికిత్స అయినా సరే, ఐపీసీ 302 సెక్షన్ పెట్టేయవచ్చా..? వార్త చదువుతుంటేనే విస్మయం ఆగడం లేదు…
Ads
తరువాత ఏం జరిగింది..? ఈ అవమానాన్ని ఆ డాక్టర్ భరించలేకపోయింది… ఉరివేసుకుని మరణించింది… ఓ సూసైడ్ నోట్ పెట్టింది… ‘‘మేరా మర్నా షాయద్ మేరీ బేగునా సాబిత్ కర్ దే’’ (నా మరణమే నా నిర్దోషిత్వాన్ని నిరూపించుగాక)… రాష్ట్రంలోని డాక్టర్ల కమ్యూనిటీ ఒక్కసారిగా షాక్ తింది… బుధవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రాజస్థాన్ శాఖ 24 గంటలు వైద్యసేవల బంద్ నిర్వహించింది… గురువారం రాత్రి రెసిడెంట్ డాక్టర్ల సంఘాల సమాఖ్య (ఫోర్డా) ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కేండిల్ లైట్ ప్రొటెస్ట్ నిర్వహిస్తోంది…
గతంలో సుప్రీంకోర్టు చెప్పింది… ఇలాంటి కేసుల్లో వైద్యనిర్లక్ష్యాన్ని పోలీసులు నేరంగా పరిగణించకూడదని, నిపుణుల కమిటీ మాత్రమే తేల్చాలని… మరి ఇక్కడ మర్డర్ కేసు ఎలా పెట్టినట్టు..? నిజానికి ఈ గర్భిణి కేసులో మరణానికి కారణం ప్రసవం తరువాత అధిక రక్తస్రావం, హెమరేజ్ అని పోస్ట్‌మార్టంలో తేలిందని ఫోర్డా చెబుతోంది… ఫోర్డా డిమాండ్ కూడా సరిగ్గా లేదు నిజానికి… దర్యాప్తు చేసి, ఆ కేసు వాపస్ తీసుకోవాలట, డాక్టర్ కుటుంబానికి పరిహారం ఇవ్వాలట…
ఆమే మరణించింది, కేసు ఉంటే ఎంత..? పోతే ఎంత..? అది కాదు సమస్య… ఇలాంటి కేసుల్ని ఇక టేకప్ చేసేవాళ్లెవ్వరు..? ఇది వైద్యాన్ని సంక్షోభం వైపు నెడుతుంది… దీని మీద కదా డాక్టర్ల సంఘాలు దృష్టి పెట్టాల్సింది… ఇలాంటి దూకుడు కనబర్చకుండా పోలీసుల్ని కంట్రోల్ చేసే కఠిన ఆదేశాలు, క్లారిటీ కదా డిమాండ్ చేయాల్సింది… రాజస్థాన్ ఆరోగ్యమంత్రి ప్రసాది లాల్ మీనీ ‘‘జరిగింది దురదృష్టకరం, దర్యాప్తు చేస్తాం’’ అంటున్నాడు… ఎన్ని మాటలు వినలేదు ఇలాంటివి..? ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ లాభాపేక్ష, దుర్మార్గాలు అన్నీఇన్నీ కావు… నిజమే, కానీ ఇలా మర్డర్ కేసులు పెడుతూ పోతే, వైద్యసేవ మరింత సంక్షోభం వైపే… అది మరింత నష్టదాయకం… క్లిష్టమైన కేసులు టేకప్ చేసేవాళ్లే దొరకరు… బహుపరాక్…!!
Share this Article