హిందూ మత సంబంధ తంతులపై, అర్చన రీతులపై, ఆచారాలపై, సంప్రదాయిక ధోరణులపై, దేవుళ్లపై, ఆస్తులపై కేసులు పడుతూనే ఉంటయ్… అక్కడికి అవలక్షణాలన్నీ ఈ మతంలోనే కుప్పపోసుకున్నట్టు…! అక్కడికి ధర్మపీఠాల మీద కూర్చున్న సర్వజ్ఞుల్లాగా న్యాయమూర్తులు తీర్పులు చెబుతూనే ఉంటారు…… ఈ విమర్శ ఈమధ్యకాలంలో బాగా వినిపిస్తోంది… ప్రభుత్వాలు, కోర్టులు ఎడాపెడా ఓ మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవచ్చా… అనేది ఓ కీలక ప్రశ్న…
బుధవారం కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ ఓ ఇంట్రస్టింగ్ తీర్పు చెప్పింది… సకల మతాచారాల పరిరక్షణ కూడా ఓ రాజ్యాంగపరమైన బాధ్యతే అంటున్నది… ఏ కాలం నుంచో వస్తున్న ఆనవాయితీల్లో అసలు ప్రభుత్వాలు ఎందుకు జోక్యం చేసుకోవాలని అడిగింది.. ఓసారి కేసు పూర్వాపరాల్లోకి వెళ్దాం… కేరళ కౌముది అనే మలయాళం డెయిలీలో గత నెలలో ఓ వార్త వచ్చింది… శ్రీపూర్ణ త్రయీస గుడిలో భక్తులు తమ పాపాలు పోగొట్టుకోవడానికి పన్నెండు మంది బ్రాహ్మణుల కాళ్లు కడగాలట అనేది ఆ నెగెటివ్ వార్త సారాంశం…
సూమోటోగా కేసు విచారణకు తీసుకున్న డివిజన్ బెంచ్ ‘‘బ్రాహ్మణుల కాళ్లు కడిగేది ఆ గుడి ప్రధాన పూజారే తప్ప, భక్తులు కాదు’’ అని గుర్తుచేసింది… వళిపాడు పేరిట ఉన్న అర్చన పద్ధతి పేరును సమారాధనగా మార్చింది కేరళ దేవాదాయ శాఖ… అసలు ఏ రాష్ట్రంలోనైనా గుళ్లకు ప్రధాన శాపం దేవాదాయ శాఖే కదా…
Ads
‘‘పురాతన పద్దతులు, ఆనవాయితీలను బట్టి కొన్ని మత వ్యవహారాలుంటయ్… అలాంటి వ్యవహారాల్లో కొచ్చిన్ దేవస్వామ్ బోర్డు గానీ, రాజ్యం గానీ జోక్యం చేసుకునే పనేముంది..? వర్తమానంలో ఉన్న పద్ధతులను పరిరక్షించడమే బోర్డు బాధ్యత… పౌరహక్కులకు భంగకరం కానన్నిరోజులూ ఏ మత పద్ధతులనైనా ఎందుకు వ్యతిరేకించాలి..?’’ అనడిగింది కోర్టు… ‘‘ఇప్పటి కేసులో ప్రస్తావించబడిన ‘‘పంతండు నమస్కారం’’ పేరిట శ్రీపూర్ణత్రయీస గుడిలో, త్రిపునితుర నిర్వహించబడే తంతు ఎంతోకాలంగా ఉన్నదే… ‘‘అష్టమంగళ ప్రశ్నం’’లోనూ ఉన్నదే…
ఉత్సవాలు, ఆచారాలు, సంప్రదాయిక అర్చన పద్ధతుల్లో మార్పులను కోర్టులు నిర్దేశించలేవు… అవి చేయాల్సింది మత సంబంధ వ్యవహారాల్లో అనుభవమున్నవాళ్లే…’’ అని స్పష్టీకరించిన కోర్టు పనిలోపనిగా ‘‘ఎలక్ట్రానిక్ లేదా ప్రింట్ మీడియా ధ్రువీకరించబడని సమాచారం, అబద్ధపు సమాచారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి’’ అని కూడా హితవు చెప్పింది…
Share this Article