అమ్మా… తమిళిసై… శుభకృత్ శుభాకాంక్షలు… చూస్తున్నాం, చదువుతున్నాం… ఉగాది వేడుకలకు రమ్మని అన్ని పార్టీల వారిని, ప్రభుత్వ ముఖ్యుల్ని ఆహ్వానించారు… అందరూ వచ్చారు, ప్రభుత్వం ప్లస్ టీఆర్ఎస్ వైపు నుంచి గాకుండా… ఎవరూ రాకుండా… అంటే ఏమిటి..? ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రథమ పౌరురాలిని తేలికగా తీసిపడేస్తున్నారన్నమాట… మర్యాద లేకుండా అవమానిస్తున్నారన్నమాట… డీజీపీ, సీఎస్ కూడా రాలేదంటే మొత్తం యంత్రాంగానికి మిమ్మల్ని పట్టించుకునే పనిలేదు అనే సంకేతాలు ఇస్తున్నారన్నమాట… అమర్యాదకరంగా…
సాంకేతికంగా ఈ రాష్ట్ర పాలన నీదే… ప్రభుత్వం నీదే… పదే పదే కావాలని అవమానించినట్టుగా వ్యవహరిస్తున్నా సరే, ఒక లేడీ గవర్నర్ ఏం చేయగలదు అనే తేలికభావన కనిపిస్తోంది అధికారపక్షం నుంచి..! కావాలనే… కావాలని చేస్తున్నదే… దాపరికం ఏమీ లేదు… ఇక్కడ వ్యక్తిగతంగా తమిళిసై మీద కాదు వాళ్ల నిరసన, తృణీభావన… గవర్నర్‌ను బీజేపీ ప్రతినిధిగా చూస్తూ, మర్యాద మరిచిపోవడం వల్ల వచ్చిన అవస్థ ఇది… మోడీ షా మీద పెరుగుతున్న ఆగ్రహం ఇలా ప్రదర్శించడం అన్నమాట…
బీజేపీ పట్ల వ్యతిరేకతను ప్రదర్శించడానికి ఓ లేడీ గవర్నర్ పట్ల ఇలా ప్రవర్తించాలా..? ఈ ప్రశ్నకు ఇక్కడ జవాబు ఎవరూ ఇవ్వరు… ఇవ్వడానికి జవాబు లేదు వాళ్ల దగ్గర..! ‘‘గ్యాప్ ఎక్కడ వచ్చిందో నాకు తెలియదు, నాకు ఇగో లేదు, ప్రగతిభవన్ రమ్మన్నా వస్తాను, యాదగిరిగుట్టకు రమ్మనలేదు, పోవాలని ఉన్నా ఆహ్వానం లేక వెళ్లలేదు’’… ఇలాంటివి స్థూలంగా పైకి బాగానే ధ్వనించినా సరే, ఒక ఫస్ట్ సిటిజెన్ ఆఫ్ స్టేట్ మరీ అలా ఓ మెట్టు దిగి మాట్లాడటం దేనికి..?
Ads
ఓ పనిచేయొచ్చు కదా… వాళ్లు యాదగిరిగుట్ట పునఃప్రారంభోత్సవాన్ని పార్టీ కార్యక్రమంగా నిర్వహించుకున్నారు… దాన్ని టీఆర్ఎస్ గుడిని చేశారు… అది సరైన వైఖరి కాదు, నిజమే… ఐనా దేవుడి దగ్గరకు ఒకరు రమ్మనేది ఏముంది..? సమ్మక్క-సారలమ్మ దగ్గరకు వెళ్లినట్టుగానే స్ట్రెయిట్‌గా యాదగిరిగుట్టకు వెళ్లండి… మీడియాను రమ్మనండి… ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూద్దాం… ఇంకా అవమానిస్తుందా పరిశీలిద్దాం… గౌరవం పొందే ఓ అత్యున్నత హోదాలో ఉన్న ఓ ఆడపడుచు పట్ల సర్కారీ మార్క్ అమర్యాద ఏమిటో తెలంగాణ సమాజం చూడనివ్వండి…
ప్రజాదర్బార్‌కు ఫిర్యాదులు వస్తయ్, నిజమే… కానీ వాటిని పరిష్కరించే యంత్రాంగం విడిగా గవర్నర్‌కు ఏమీ ఉండదు… మళ్లీ ఈ యంత్రాంగమే కదా పరిష్కరించాల్సింది… రాజ్‌భవన్ పండుగ ఉత్సవాలకే డీజీపీ, సీఎస్ రాలేదంటే… గవర్నర్ నుంచి యంత్రాంగానికి వెళ్లే ఈ ఫిర్యాదులను ఎవరు పరిష్కరించాలి..? ఈ గ్రీవెన్స్‌కు మళ్లీ పారలల్ వ్యవస్థ దేనికి..? తలవంచాల్సిన పనిలేదు, తల ఎత్తుకునే ‘‘అమర్యాద’’ను ఎక్స్‌పోజ్ చేయవచ్చు… అదేసమయంలో ఆత్మగౌరవాన్ని ప్రదర్శించవచ్చు…
టైమ్… అంతా సజావుగా ఉంది కాబట్టి గవర్నర్‌కు పనిలేదు ఇప్పుడు… కానీ ఎప్పుడో ఓసారి… పాలకుడి గ్రహచారం ఎదురుతిరిగితే కదా గవర్నర్ చేతిలోకి విస్తృత అధికారాలొస్తయ్… సో, ఇప్పటికైతే ఎదుటివాళ్ల నుంచి మర్యాదను ఆశించండి, కానీ మర్యాదను అడగకండి… వచ్చే సీతారామ కల్యాణ ఉత్సవానికి భద్రాచలం వెళ్లండి… పట్టుబట్టలు తీసుకెళ్లండి… సీఎం ఎలాగూ రాడు, చాలా ఏళ్లయింది… ఆయనకు భద్రాచలం పట్టదు.. సో, గవర్నర్ వస్తే టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు ఆపేస్తారా..? ఒక లేడీ గవర్నర్‌ను ఓ సగటు భక్తురాలిగా కూడా పరిగణిస్తారా లేదా..? రామభద్రుడు చాలా పవర్‌ఫుల్… తనకే వదిలేయండి…!!
Share this Article