పార్ధసారధి పోట్లూరి……… భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలిసారిగా మన విదేశాంగ విధానం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నది ! గత 15 రోజులలో మొత్తం 11 దేశాల అధిపతులు లేదా విదేశాంగ మంత్రులు కావచ్చు దిల్లీని సందర్శించారు. దాదాపుగా ప్రపంచ మీడియా రష్యా ఉక్రెయిన్ యుద్ధ వార్తల మీద దృష్టి పెట్టి, అంతకంటే తీవ్రమయిన అంశం విస్మరించాయి. మరీ ముఖ్యంగా భారతదేశానికి సంకట పరిస్థిని తెచ్చే సంఘటన ఒకటి జరిగింది. రష్యా మార్చి నెల 15న నార్త్ వెస్ట్రన్ పసిఫిక్ మహా సముద్రంలో కురిల్ దీవులలో 3000 మంది ట్రూపులతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించింది యుద్ధ సన్నద్ధతలో భాగంగా ! దాదాపు 50 డ్రోన్లతో ఆకాశంలో విన్యాసాలు చేసింది.
కురిల్ దీవుల వివాదం ! పసిఫిక్ మహా సముద్రంలో జపాన్ కి చెందిన పలు దీవులలో కురిల్ దీవులు కూడా ఉన్నాయి. 1945 రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ జెర్మనీతో కలిసి ఉన్న జపాన్ మీద సోవియట్ యూనియన్ సైన్యం దాడి చేసింది… జపాన్ కి చెందిన కురిల్ దీవులని స్వాధీనం చేసుకుంది. జెర్మనీ లొంగిపోయాక రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిపోయింది. జెర్మనీ, ఇటలీలు యుద్ధ విరమణ ఒప్పందం మీద సంతకాలు చేసి లొంగిపోతున్నట్లు ఒప్పుకున్నాయి. కానీ జపాన్ మాత్రం సంతకం చేయలేదు.
యుద్ధం ఆగిపోలేదు… హిరోషిమా, నాగసాకిల మీద అమెరికా వేసిన అణు బాంబుల వల్ల తీవ్రంగా నష్టపోవడంతో అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ సోవియట్ యూనియన్ తో జపాన్ యుద్ధ విరమణ ఒప్పందం మీద సంతకం చేయలేదు ఇంతవరకు. అంటే సోవియట్ లేదా రష్యా జపాన్ లు ఇప్పటికీ యుద్ధం చేస్తున్నట్లుగానే పరిగణిస్తున్నారు టెక్నికల్ గా. అప్పటి నుండి రష్యా జపాన్ లు యుద్ధం చేస్తున్నట్లుగా ఉన్నట్లే… అందుకే రష్యా కురిల్ దీవులని తన ఆధీనంలోనే ఉంచుకుంది ఇప్పటి వరకు.
Ads
రష్యా ఉక్రెయిన్ మీద స్పెషల్ మిలటరీ ఆపరేషన్ చేయకముందు వరకు అడపా దడపా రెండు దేశాల మధ్య కురిల్ దీవుల మీద చర్చలు జరుగుతూ వచ్చాయి కానీ ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. రష్యా ఉక్రెయిన్ లో మిలటరీ ఆపరేషన్ ప్రారంభించగానే అమెరికా, EU, ఆస్ట్రేలియాతో పాటు జపాన్ కూడా రష్యా మీద ఆంక్షలు విధించింది.
వ్లాదిమిర్ పుతిన్ జపాన్ తమ మీద ఆంక్షలు విధించడం మీద ఆగ్రహంతో ఉన్నాడు. అందుకే కురిల్ దీవుల దగ్గర సైనిక విన్యాసాలు చేయడం మొదలు పెట్టాడు. ఈ చర్య పరోక్షంగా జపాన్ మీద దాడి చేస్తాను అని హెచ్చరించడం లాంటిదే ! ఇప్పటికే జపాన్ తన హకైడో దీవుల విషయంలో చైనా నుండి బెదరింపులు ఎదుర్కొంటున్నది.
ఈ హకైడో కథేమిటంటే… తరుచూ హక్కైడో దీవుల దగ్గరికి చైనా తన ఫిగ్రేట్ లని పంపి బెదిరింపులు చేస్తున్నది. జపాన్ కి చెందిన హక్కైడో దీవుల గురించి జపాన్ చైనా ల మధ్య చాలా కాలంగా వివాదం ఉంది. చైనా హక్కైడో దీవులు తమవే అని వాదిస్తున్నది కానీ జపాన్ అవి మా ఉత్తర సరిహద్దు ప్రాంతం అని వాదిస్తున్నది. నిజానికి హక్కైడో దీవులు జపాన్ కి చెందినవే కాకపొతే జపాన్ దీవుల అన్నిటిలోనూ దూరంగా విసిరేసినట్లుగా ఉంటుంది పసిఫిక్ మహా సముద్రంలో. సంవత్సరం పొడుగునా మంచుతో కప్పబడి ఉండే హక్కైడో దీవులలో ప్రజలు చాల తక్కువ సంఖ్యలో ఉంటారు.
జపాన్ మీద రష్యా గుర్రు… QUAD అనే కూటమి ఏర్పడింది పసిఫిక్ మహా సముద్రంలో చైనాని ఎదుర్కోవడానికే ! భారత్, అమేరికా, జపాన్, ఆస్ట్రేలియా లు QUAD లో ఉన్న నాలుగు దేశాలు. ఇప్పుడు తాజాగా రష్యా జపాన్ ని బెదిరిస్తున్నది దాంతో దిక్కు తోచని పరిస్థితుల్లో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడో మార్చి నెల 22 న ధిల్లీ వచ్చి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యి పుతిన్ కి నచ్చచెప్పమని అభ్యర్ధించాడు.
ఇది చాలా కీలకమయిన, సంక్లిష్టమయిన పరిస్థితి మోడీ ప్రభుత్వానికి. జపాన్ తో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి అదే సమయంలో రష్యాతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. QUAD ఒప్పందాన్ని దానిలోని అంశాలని ప్రస్తావిస్తూ జపాన్ ప్రధాని కిషిడో భారత్ తమతోనే ఉంటుందని ఆశిస్తున్నాను అంటూ మెలిక పెట్టేసి వెళ్ళిపోయాడు.
నిజమే ! పసిఫిక్ మహా సముద్రంలో ఏ దేశం అయినా QUAD సభ్య దేశమయిన జపాన్ మీద దాడి చేస్తే మిగతా మూడు దేశాలు జపాన్ కి బాసటగా ఉండాలి అనే క్లాజ్ ఉంది. కానీ రష్యా కురిల్ దీవుల మీద జపాన్ కి వ్యతిరేకంగా విన్యాసాలు చేస్తుందని మూడేళ్ళ క్రితం ఎవరూ అనుకోలేదు కానీ అదిప్పుడు జరిగిపోయింది. కానీ జపాన్ ప్రధాని ఫుమియో కిషిడో అమెరికా వెళ్ళకుండా నేరుగా భారత్ రావడం దేనికి ?
అమెరికాను జపాన్ కూడా నమ్మడం లేదు… ఉక్రెయిన్ విషయంలో అమెరికా, EU దేశాల వైఖరిని చూసిన జపాన్ అమెరికాని నమ్ముకోవడం కంటే భారత్ ని విశ్వసించడమే మేలు అన్న భావనకి వచ్చి ఉండవచ్చు. బహుశా ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్ మోదీ మాట తప్పితే వేరే ఎవ్వరి మాటా కూడా వినే స్థితిలో లేడు అన్న నిజం కూడా కావొచ్చు. ఏది ఏమయినా అందరూ అనుకుంటున్నట్లు రష్యా తన దేశాహితం కోరి చేసే ఏ పని విషయంలోనైనా మోదీ కల్పించుకోరు. అడిగితే సలహా ఇస్తారు అంతే!
చైనా సంప్రదింపులు… జపాన్ ప్రధాని వచ్చి వెళ్ళిన వెంటనే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఎలాంటి ఆహ్వానం లేకుండా భారత్ వచ్చాడు. భారత్ రావడానికి ముందు పాకిస్థాన్ లో జరిగిన OIC [Organization of Islamic Countries] సమావేశానికి హాజరయి, అక్కడ కాశ్మీర్ ప్రస్తావన వచ్చినప్పుడు భారత్ పాకిస్థాన్ లు కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలి అంటూ ఒక సలహా ఇచ్చి పాకిస్థాన్ కి వంత పాడాడు. పాకిస్థాన్ నుండి కాబూల్ వెళ్ళి అక్కడ తాలిబాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి అక్కడ నుండి నేరుగా న్యూ ఢిల్లీ వచ్చాడు.
ప్రధానితో పాటు జై శంకర్ , అజిత్ దోవల్ లతో చర్చలు జరిపాడు. బహుశా జపాన్ ప్రధాని వచ్చిన విషయం మీద ఆరా తీయడానికే వచ్చి ఉంటాడు కానీ ఆ ప్రస్తావన ఏమీ లేకుండా నేరుగా లడాక్ దగ్గర సైన్యం మోహరింపు మీద మొహమాటం లేకుండా అడిగేశారు. వాంగ్ యీ మాత్రం మన ఇరు దేశాల సైనిక శక్తిని సరిహద్దుల దగ్గర ఖర్చు పెట్టకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి అంటూ వాక్రుచ్చాడు. పనిలో పనిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారిని బీజింగ్ రావాల్సిందిగా ఆహ్వానించాడు వాంగ్ యీ !
ముందు సరిహద్దు సమస్య పరిష్కారం అయ్యాక చూద్దాం అంటూ బదులు ఇచ్చారు అజిత్ దోవల్ ! కోవిడ్ వల్ల తరుచూ తమ ముఖ్య నగరాలు లాక్ డౌన్ లో ఉండడం వలన చైనా తీవ్రంగా నష్టపోతున్నది. ఇలాంటి తరుణంలో భారత్ తో మళ్ళీ సత్సంబంధాలు పునరుద్ధరించుకోవాలి అనే ఆశ చైనాది. ఎంత పెద్ద ఆర్ధిక వ్యవస్థ అయినా ఖర్చు కూడా అంతే పెద్దగా ఉంటుంది. ఒకసారి పెద్ద అంతరం వస్తే దానిని పూడ్చుకోవడానికి ఏళ్లకేళ్ళు పడుతుంది.
బ్రిటన్ ఉచిత నీతులు… ఎలిజిబెత్ ట్రస్స్ [Elijibeth Truss] బ్రిటన్ విదేశాంగ మంత్రి. భారత్ రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనుగోలు ఒప్పందం చేసుకోబోతున్నది అని తెలుసుకొని, సలహా ఇవ్వడానికి లండన్ నుండి ధిల్లీ వచ్చింది. మన విదేశాంగ మంత్రి జై శంకర్ గారితో దాదాపుగా 45 నిముషాలు పాటు జరిగిన చర్చలలోని ముఖ్యాంశం ఏమిటంటే రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవద్దు అని సలహా ఇవ్వడానికే!
జైశంకర్ గారు నేరుగా ఒక్కో point ని ఎత్తి చూపుతూ మారు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా చేసారు. జై శంకర్ గారి మాటల్లో చెప్పాలంటే… ‘‘యూరోపు ఇప్పటికీ రష్యా నుండి గాస్ మరియు క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటూనే ఉన్నది. రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసి ఇప్పటికి నెల రోజులు అవుతున్నది కానీ మీరు మాత్రం మీ అవసరాల కోసం రష్యా మీద ఆధారపడ్డారు అలాంటిది మేము మా అవసరాల మీద ఎందుకు గట్టిగా నిలబడకూడదు ?
యూరోపుకి కావాల్సిన మొత్తం ఆయిల్ మరియు గాస్ లో 58% రష్యా నుండే వస్తున్నది కానీ మేము రష్యాతో చేసుకోబోయే ఒప్పందం మా మొత్తం అవసరాలలో కేవలం 2% మాత్రమే రష్యా నుండి కొనబోతున్నాము… భారత్ తన అవసరాల కోసం గాలిస్తుంది, ఎక్కడ చవకగా దొరికితే అక్కడ కొంటుంది, ఆ హక్కు మాకు ఉంటుంది. మీ సలహాకి ధన్యవాదములు !’’
జైశంకర్ గారి సమాధానం చాలా డిప్లొమాటిక్ గా ఉంది. ఎలిజిబెత్ ట్రస్స్ లండన్ వెళ్ళగానే బ్రిటన్ ప్రధాని ఒక ప్రకటన చేసాడు: భారత్ తన అవసరాల కోసం తగిన చర్యలు తీసుకునే హక్కుని కలిగి ఉంది అని… ఏదోవిధంగా భారత్ కి నచ్చచెప్పడానికి బ్రిటన్ ఆపసొపాలు పడ్డది కానీ ఫలించలేదు.
అమెరికా ఝలక్కులు… మార్చ్ 31 న అమెరికా నేషనల్ సెక్యూరిటీ డిప్యూటి అడ్వైజర్ దలీప్ సింగ్ ధిల్లీ వచ్చాడు. నేరుగా జై శంకర్ గారితో, అజిత్ దోవల్ గారితో సమావేశం అయ్యాడు. ప్రధానంగా రష్యాతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవద్దు అని చెప్పడానికే వచ్చాడు. భారత్ కనుక రష్యాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తే భవిష్యత్తులో చైనా మీ మీద దాడి చేస్తే మాత్రం రష్యా మీకు సహకరించదు అని దలీప్ సింగ్ ఉవాచ!
వెల్ ! ఆ విషయం భారత ప్రభుత్వానికి బాగా తెలుసు. మరి అమెరికా సైనికపరంగా సహకరిస్తుందా ? రెండేళ్ళ నుండి లడాక్ సరిహద్దుల్లో చైనా తిష్ట వేసుకొని కూర్చున్నా అమెరికా ఎలాంటి ప్రకటన చేయలేదు ఎందుకు ? రష్యా సహకరించదు అంటే సైనిక రంగా అని… కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా చైనాకి వ్యతిరేకంగా ఎలాంటి చర్య తీసుకోదు భారత్ కోసం… యుద్ధం అంటూ వస్తే అటు చైనాతో పాటు ఇటు పాకిస్థాన్ తో two front వార్ చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. లోపాయికారిగా అమెరికా చైనాకి సహకరించకపోతే చాలు…
అసలు అమెరికా భారత్ కి ఎప్పుడు సహకరించింది ? చివరకు కార్గిల్ యుద్ధ సమయంలో మన మిరేజ్ యుద్ధ విమానాలకి GPS లింక్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది… కానీ అమెరికా హెచ్చరికల్ని లెక్క చేయకుండా ఫ్రాన్స్ మన మిరేజ్ యుద్ధ విమానాలకి లేజర్ గైడెడ్ బాంబ్ లని సప్లై చేసింది అప్పట్లో. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రష్యాని వదిలేసి తమ కూటమితో చేతులు కలపమని అడుగుతున్నది అమెరికా ?
వుయ్ ఆర్ ఫ్రెండ్స్… సరిగ్గా అమెరికా NSA డిప్యూటి ధిల్లీ వదిలి వెళ్ళగానే రష్యా విదేశాంగ మంత్రి సేరే లవ్రోవ్ దిల్లీ చేరుకున్నారు. నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి ఉన్నా రష్యా విషయంలో తటస్థంగా ఉన్నందుకు పుతిన్ అభినందలు తెల్పమన్నారు అని చెప్పాడు… ఆయుధాల దగ్గర నుండి ఏవయినా సరే సప్లై చేయడానికి రష్యా సిద్ధంగా ఉంది అంటూ పుతిన్ అభిప్రాయాన్ని వెల్లడించాడు.
పుతిన్ భారత్ కి మంచి ఆఫర్ ఇచ్చాడు… అది బారెల్ బ్రెంట్ క్రూడ్ 38 డాలర్లకే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అంటూ రాయబారం పంపాడు. ప్రస్తుతమ్ అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ ధర బారెల్ కి $ 113 గా ఉంది… అంటే దాదాపుగా 65 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాడు పుతిన్ మనకి. ఉక్రెయిన్ నుండి సరఫరా అయ్యే సన్ ఫ్లవర్ విత్తనాలు యుద్ధం వలన ఆగిపోవడంతో భారత్ లో వంట నూనెల ధరలు రెట్టింపు అయ్యాయి. ఆ లోటుని పూడ్చడానికి పుతిన్ సిద్ధంగా ఉన్నాడు అంటే ఒప్పందం జరిగిన నెల రోజులలోపే మళ్ళీ యధావిధిగా సన్ ఫ్లవర్ విత్తనాల సరఫరా జరుగుతుంది.
రూబుల్ – రూపీ మారకం విలువ లెక్కకట్టి రెండు దేశాల మధ్య ఇంటర్ బాంక్ కనెక్టివిటీ కోసం విధి విధానాలని రూపొందించి దానిని అమలు చేసే దిశగా ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. గత నెల రోజులుగా మన దేశ ఎగుమతిదారులకి రావాల్సిన డబ్బు ఆగిపోయింది రష్యా నుండి. దీని కోసం ఒక విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు.
సౌదీ పాత్ర కూడా కీలకమే… ఇక చివరగా… రష్యాకి మన దేశానికి మధ్య జరగబోయే ఒప్పందాలని నిశితంగా పరిశీలిస్తున్నది సౌదీ అరేబియా. ఒకవేళ సౌదీ కనుక చైనాతో యువాన్- దినార్ ఒప్పందం జరిగితే అది అమెరికాకి పెద్ద దెబ్బ. సౌదీతో పాటు UAE కూడా అదే దారిలో నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యాకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి వోటింగ్ సమయంలో భారత్ తో పాటు UAE కూడా దూరంగా ఉంది. ఇది గల్ఫ్ దేశాల వైఖరిలో వస్తున్నమార్పుకి సంకేతం ! క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లలో డాలర్ ఆధిపత్యానికి చెల్లు చీటీ వ్రాయాలంటే ముందు గల్ఫ్ దేశాల సంతకం కావాలి ! అది త్వరలోనే జరుగుతుంది అని ఆశిద్దాం !
అమెరికా ఏకపక్ష ధోరణికి కాలం చెల్లబోతున్నది! కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ని రద్దు చేసే ముందు భారత్ మమ్మల్ని అడగలేదు అని అన్న అమెరికా ఇప్పుడు రష్యాతో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవద్దు అంటూ రాయబారం పంపిన అమెరికా ఒకటి కాదు ! కాశ్మీర్ లో 3G మొబైల్ నెట్వర్క్ ని తాత్కాలికగా ఆపేసినప్పుడు అది మానవ హక్కుల ఉల్లంఘన అని ఆరోపించిన యూరోపియన్ యూనియన్ అదే సమయంలో చైనా లోని వుయ్ఘర్ ముస్లిం మీద చైనా చేస్తున్న అకృత్యాలని మాత్రం గట్టిగా అడగలేక పోయింది. వాళ్లకి చైనాతో అవసరం ఉంది !
బాటం లైన్ ! ‘’ధనం లేని వాడిని వేశ్య కూడా విసర్జిస్తుంది ‘’! ఆయుధము లేని రాజుని దొంగలు కూడా లెక్క చేయరు!
Share this Article