……. Opinion of Katta Srinivas…….. సెల్యులాయిడ్ చరిత్రకి చెదలు పట్టించగలడా? R-Rusted R- Ruined R- Ruptured… మూడార్లు ఇప్పటికి చూడటం కుదిరింది. రెండు తెలుగు రాష్ట్రాలను, సినిమా ఇండస్ట్రీ రెండు పెద్ద కుటుంబాలను బాలన్స్ చేయడం గురించో, కళ్ళ ముందటి కనికట్టు కలెక్షన్స్ గురించో బ్లా బ్లా బ్లా చెప్పలేను, కానీ కరోనా తర్వాత గుంపులో కలిసే, కరువు తీర్చే మార్గమనో.., సమాజాన్ని బ్రతికిస్తోందో, సమాజం మీద బ్రతుకుతుందో, సినిమా ఇండస్ట్రీకి ఇది కొత్త ఉత్సాహమంటూ ముచ్చటా పడలేను.
చరిత్రకు రంగులద్దటం దాని హుందాతనం పెంచేలా ఉందా? ఊపిరి ఆడకుండా చేసేలా ఉందా? కథని కళ్ళతోనే కాకుండా బుర్రతోనూ చూసే వాళ్ళకి ఈ సింథటిక్ రంగుల ప్రమాదం ఏమాత్రం కనిపిస్తుంది అనే ముచ్చట వరకు చూద్దాం ఓసారి… అసలు ఇందులో వాడుకున్న రెండు రాష్ట్రాల స్వాతంత్ర పోరాటంలో శౌర్యాన్ని త్యాగాన్ని చూపిన యోధుల పేర్లు తప్ప మరే ఇతర సంఘటనకైనా కనీసపు ఆధారం ఉందా?
1) రామరాజు ఎవరికి పుట్టాడు? ఎవరిని కొట్టాడు?
Ads
2) కొమురం భీం పాత్ర తన నోటితోనే చెప్పుకున్నట్లు స్వాతంత్రం సాధించాలన్నంత పెద్ద లక్ష్యం లేదా? అన్నా, నీది పెద్ద లక్ష్యం నేనేదో పిల్లని కాపాడాలనే పిచ్చి ప్రేమతో వచ్చాను అనిపిస్తే… * జల్ జంగిల్ జమీన్” నినాదం ఏమైపోయినట్లు.?
3) కొమురం భీం ముస్లిం వేషంలో దొంగచాటుగా బ్రతకడం, రామరాజు ఉద్యోగం కోసం రొడ్డకొట్టుడు, దొడ్డిదారులు అనుసరించడం వాళ్ల వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలనిపిస్తున్నాయా?
4) అడవి జంతువులను పట్టుకొచ్చి గుంపులో వదిలేసి, గోడదూకేస్తే, వాటి చావు అవి చస్తాయిలే, నా పని గడిస్తే చాలు అనుకునేలా పోరాటం చేసిన వీరుడా భీముడు.?
గురి చూసి వదిలే బాణం కావచ్చు, తూటా కావచ్చు, ఒక్క మిల్లి మీటర్ పక్కకి జరిగితే, తీరా గమ్యం చేరుకోబోయే సమయానికి మీటర్ల కొద్దీ ఎడంగా జరుగుతుంది…
విదేశీ పాలకుల దోపిడీలో మన సంపదను కాపాడుకోలేక పోయాం, వివిధ అలవాట్ల దాడిలో భారతీయ వ్యక్తిత్వాన్ని రక్షించుకోలేక పోతున్నాం, రంగుల కలల ఇండస్ట్రీకి డబ్బులు తినిపించే యావలో జాతీయ ఉద్యమ స్ఫూర్తిని, ఆత్మాభిమానాలను తాకట్టు పెట్టుకోవలసిందేనా? కళ్ళ కనికట్టు హడావిడిలో అసలు నిజాలు మరపులోకి కొట్టుకు పోవలసిందేనా? అసలే బుక్ కల్చర్ మాయమై, లుక్ కల్చర్ వెనక పరిగెత్తే రేపటి తరం బుర్రలపై బలంగా పడుతున్న నల్లటి ముద్రను అలాగే మిగుల్చుకోవలసిందేనా?
ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు… చిన్న వక్రీకరణతో హీరోలని జీరోలుగా, దోపిడీదారులను హీరోలుగా చేసి చరిత్ర మీదకు వదిలిన కధనాలు… మనం అందంగా అద్భుతంగా చెప్పుకోవడం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం కానీ అసలు వక్రీకరణ ఎంత అందంగా జరిగితే ప్రమాదం అంత బలంగా ఉంటుంది… స్వతహాగా చెడ్డతనం చూపే దుష్టుడికన్న అందమైన మంచితనం ముసుగులో వచ్చిన వాళ్ళు చేసే హాని లోతు ఎక్కువ ఎలాగో ఇదీ అంతే… వివిధ కారణాలతో అభిమానించే ఫాన్స్ కి ఇప్పటికి ఈ మాటలు నచ్చినట్లు అనిపించవేమో కానీ కొంచెం అభిమానపు కోణం పక్కన పెట్టి చూస్తే తప్పకుండా అర్ధం అవుతుంది…
ఇదే వరసను ఇంకెవరన్నా భవిష్యత్తులోనూ కొనసాగిస్తే, పెట్టుబడి పెట్టేవారున్నారు, మిర్చి మసాలా సిద్ధంగా ఉంది అని జాతీయ నాయకులు, చారిత్రక అంశాలను ఇలా కొత్తగా వండటం ప్రారంభిస్తే కేవలం కలెక్షన్ల లెక్కలు చూసుకుందామా? కేవలం కళ్ళ పండుగలా భలే నిండుగా ఉందిలే అని సంబరపడదామా? థాంక్ గాడ్, జాతీయ జండాకు అయినా కనీసం కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి బ్రతికి పోయింది… లేకుంటే కొత్త కొత్త రంగులు చెంకీలు అద్ది సూపర్ అనిపించే వాళ్ళు… ఆత్మగౌరవంగా భావించి దాచుకోలేని దాన్ని భవిష్యత్ కోసం భద్రంగా అందించలేము. కరెన్సీ నోటుపై బాగున్నాయి కదా అని పిచ్చి పిచ్చిగా రంగులద్దుతూ పోతే చివరికి అది చెల్లుబాటు కాకుండా మూలన పడుతుంది…
Share this Article