Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కవరింగ్ విశ్లేషణలు వద్దు… శ్రీలంక ఏడుపుకి అసలు కారణాలు ఇవీ…!!

April 4, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి ……… శ్రీలంక దుస్థితి! వారసత్వ రాజకీయాలు!

శ్రీలంకలో నేడు నెలకొన్న దుర్భర పరిస్థితులకి కారణం ఎవరు ? ఖచ్చితంగా వారసత్వ రాజకీయాలు అని చెప్పవచ్చు.ప్రజలు తమ విజ్ఞతని ప్రదర్శించకపోతే అది దేశం కావచ్చు లేదా దేశంలో ఒక భాగంగా ఉండే ప్రానిస్స్ లేదా రాష్ట్రాలు కావచ్చు, ఎలాంటి దుష్ఫలితాలని అనుభవిస్తాయో మన దేశంలో కొన్ని రాష్ట్రాలని ఉదాహరణగా చూపవచ్చు… అలాగే ఒక దేశంగా మన భారతదేశం ఎలాంటి స్థితిలోకి నెట్టబడిందో మనకి అనుభవమే!

తాము అధికారంలో ఉంటే చాలు ప్రజలు ఏమయిపోయినా ఫరవాలేదు అనే మనస్తత్వం సహజంగా వారసత్వ రాజకీయ నాయకులలో ఉండి తీరుతుంది. ఎందుకంటే అధికారం అనే మత్తు మహత్యం అది! వారసత్వ రాజకీయాలు ఆసియా ఖండంలో ఉన్న దేశాలలో సహజ విషయంగా పరిగణిoచడం పరిపాటిగా మారింది. శ్రీలంక, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తో పాటు కంబోడియా, లావోస్, బర్మా, ఇండోనేషియా, మలేషియా దేశాలలో ఉన్నదే మొదటి నుండి. ఈ దేశాలలో ఒక్క బంగ్లాదేశ్ లో ఉన్న వారసత్వం మాత్రం కొంచెం ఫరవాలేదు అనిపించే విధంగా కొనసాగుతున్నది షేక్ హసీనా పాలన!

Ads

శ్రీలంక – నలుగురు సోదరుల గుత్తాధిపత్యం !

2 కోట్ల 20 లక్షల జనాభా కలిగిన ద్వీప దేశం శ్రీలంక మొదటి నుండి సంక్షోభాలకి నిలయంగా ఉంటూ వచ్చింది. సరయిన నిర్ణయాలు తీసుకోగల నాయకత్వ లోపం వలన గత నాలుగు దశాబ్దాలుగా అంతర్జాతీయంగా వార్తలలో ఉంటూ వచ్చింది. నిత్యం ఏదో ఒక సమస్యతో విలవిలలాడుతూ ఒక దాని తర్వాత ఇంకో సమస్యని ఎదుర్కుంటూ వస్తున్నది.

ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే 2019 లో అధికారంలోకి వచ్చాడు. అధ్యక్ష పదవి చేపట్టగానే తన సోదరుడు మహిందని ప్రధానమంత్రిగా నియమించాడు. రాజపక్సే మరో సోదరుడు బసిల్ రాజపక్సేని ఆర్ధిక మంత్రిగా నియమించాడు గొటబయ రాజపక్సే జులై 2021 లో… బసిల్ రాజపక్సేని ఆర్ధిక మంత్రిగా నియమించడం మీద పెద్ద దుమారమే రేగింది శ్రీలంక పార్లమెంట్ లో… ఎందుకంటే బాసిల్ రాజపక్సేకి ద్వంద్వ పౌరసత్వం ఉంది. బసిల్ కి శ్రీలంక పౌరసత్వంతో పాటు అమెరికన్ పౌరసత్వం కూడా ఉంది. మన దేశంలోలాగే శ్రీలంక రాజ్యాంగం కూడా ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారిని చట్ట సభల్లోకి అనుమతి ఇవ్వదు.

అంతా ఆ కుటుంబమే …

గోటబయ రాజపక్సే తన తమ్ముడి కోసం రాజ్యాంగ సవరణ చేసి మరీ ఆర్ధిక మంత్రిగా కూర్చోబెట్టాడు. ఇక మూడవ సోదరుడు అయిన చమల్ కి కూడా కేబినేట్ మంత్రి పదవి కట్టబెట్టాడు గొటబయ… చమల్ కొడుకుకి కూడా మంత్రి పదవి కట్టబెట్టాడు కానీ కేబినేట్ రాంక్ కాదు… ఇక శ్రీలంక ప్రధానమంత్రి మహింద కొడుకుకి కూడా కాబినెట్ మంత్రి పదవిని కట్టబెట్టాడు గొటబయ. మరో కొడుకుకి చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి ఇచ్చాడు గోటబయ.

ఇక్కడితో ఆగలేదు గోటబయ తన మేనల్లుడు పార్లమెంట్ సభ్యుడు.. అంటే ముందు ముందు వీళ్ళు శ్రీలంక ప్రధానులుగా మరియు అధ్యక్షులుగా అవడానికి ఇప్పటి నుండే శిక్షణ ఇస్తున్నాడు గొటబయ రాజపక్సే. ఇదంతా చదువుతుంటే మనకి మన తెలుగు రాష్ట్రాలలో ఎవరయినా గుర్తుకు వస్తే అది నా తప్పుకాదు! కాకపొతే గొటబయ రాజపక్సే మాత్రం ఏదన్నా సమస్య వస్తే తిరుపతి,సింహాచలం వచ్చి మొక్కు తీర్చుకొని వెళుతుంటాడు తప్పితే యజ్ఞాలు, యాగాలు చేయడు… అలా అని అవి చేయడం ఇష్టం లేక కాదు కానీ శ్రీ లంక బౌద్ధ భిక్షువులు అలాంటివాటికి అనుమతి ఇవ్వరు. శ్రీ లంకలో భౌద్ధ భిక్షువుల ప్రాబల్యం ఎక్కువ ప్రభుత్వాల మీద…

మొత్తం శ్రీలంక దేశపు బడ్జెట్ లో 75% రాజపక్సే కుటుంబ సభ్యుల చేతిలో ఉంది ! అందుకే నిన్న శ్రీలంక ప్రజలు దాదాపుగా 10 వేల మంది శ్రీలంక అధ్యక్ష భవనం ముందు తీవ్ర ప్రదర్శనలు చేసారు. నిరసన హింసాత్మకం కావడంతో అధ్యక్షుడు మూడు రోజుల కర్ఫ్యూ విధించాడు. కనిపిస్తే కాల్చివేతకి ఆజ్ఞలు ఇచ్చాడు… అంటే శ్రీలంకలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రోజుకి 10 గంటల విద్యుత్ కోతని విధించాడు లోడ్ షెడ్డింగ్ కోసం. దాదాపుగా అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. ప్రాణ రక్షణ మందుల కొరత తీవ్రంగా ఉండడంతో మోదీ హుటాహుటిన మందులు పంపించారు శ్రీలంకకి. పరిస్తితి ఎంత ఘోరంగా ఉంది అంటే విద్యుత్ కొరత వల్ల రోజువారీ ఆపరేషన్లు చేయడం ఆపేశాయి అక్కడి హాస్పిటల్స్…  పైగా ఆపరేషన్ కి ముందు ఇచ్చే మత్తు మందుల కొరత తీవ్రంగా ఉంది.

కుటుంబ వారసత్వం దాని పరిణామాలు !

2019 లో రాజపక్సే అధికారం చేపట్టే నాటికి శ్రీలంక సెంట్రల్ బాంక్ లో 9 బిలియన్ డాలర్లు నిల్వ ఉన్నాయి! ఇది ప్రమాద సూచిక ! కానీ తీవ్రమయిన అలసత్వం వలన అవి నేడు 1 బిలియన్ కంటే తక్కువ స్థాయిలోకి వచ్చాయి. గత మూడేళ్ళలో రాజపక్సే ముందు జాగ్రత్తలు తీసుకున్నది శూన్యం. కోవిడ్ వలన టూరిజం దెబ్బతిన్నది అయితే ఇది శ్రీలంకకి పరిమితం కాదు, ఇతర ఆసియా దేశాలు అయిన ఇండోనేషియా లాంటి దేశాలు కూడా టూరిజం వల్ల దెబ్బతిన్నాయి కానీ మరీ ఇంతలా కాదు.

రాజపక్సే కుటుంబ పాలన పూర్తిగా అవినీతిమయం!

చైనాకి కావాల్సింది అవినీతి ప్రభుత్వాలు. శ్రీలంక చైనీయులకి ఒక వరం. ప్రతి ప్రాజెక్ట్ లో రాజపక్సేకి ముడుపులు ఇవ్వడం, అవి చైనా చేతిలోకి వెళ్ళిపోవడం ఆనవాయితీగా మారింది. 2021 లో భారత్ మరియు జపాన్ లు కలిసి సంయుక్తంగా నిర్మించ తలపెట్టిన కొలంబో పోర్ట్ ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ప్రాజెక్ట్ [Colombo Port East Container Terminal project ] ని మనసు మార్చుకొని చైనాకి అప్పచెప్పింది శ్రీలంక. ఇది పూర్తిగా చైనా రాజపక్సేకి లంచం ఇచ్చి మరీ తన చేతుల్లోకి తీసుకుంది.

2021 జనవరి నెల 13 ఇదే రాజపక్సే మంత్రివర్గం [కుటుంబం ] జపాన్ మరియు భారత్ లకి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని, అప్పట్లో అక్కడే ఉన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గారికి తెలిపింది… కానీ ఫిబ్రవరి 1 వ తేదీన ఆ ప్రాజెక్ట్ ని చైనాకి అప్పచెప్పింది. అంటే 18 రోజుల్లో చైనా డబ్బు ఆశ చూపి మరీ రాజపక్సే చేత నిర్ణయం మార్పించింది. దీని మీద భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది ఎందుకంటే శ్రీలంకకి భారత్ నుండి చేసే ఎగుమతులు మరియు శ్రీలంక నుండి జరిగే దిగుమతులు మొత్తం కొలంబో పోర్ట్ ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ప్రాజెక్ట్ నుండి జరుగుతాయి… కానీ దానిని నిర్వహించేది చైనా ! అంటే శ్రీలంక భారత్ ల మధ్య జరిగే ఎగుమతులు, దిగుమతుల మీద చైనా నిఘా ఉంటుంది అన్నమాట !

శ్రీలంక హంబన్ తోట అంతర్జాతీయ పోర్ట్ !

2009 లో హంబన్ తోట పోర్ట్ నిర్మాణ పనులు మొదట భారత్ కే ఇచ్చింది శ్రీలంక. తరువాత దానిని చైనాకి అప్పచెప్పింది. కానీ తీరుకున్న ఋణం తీర్చలేక ఒప్పందం ప్రకారం దానిని చైనాకి కట్టపెట్టింది 99 సంవత్సరాల లీజు కింద. అసలు పెద్ద మొత్తంలో ఎగుమతులు దిగుమతులు జరిగే అవకాశమే లేదు హంబన్ తోట పోర్ట్ నుండి… కానీ ముడుపులకి ఆశపడి మరీ చైనాకి అప్పచెప్పింది శ్రీలంక. ఇప్పుడు ఈ పోర్ట్ మీద 99 సంవత్సరాల వరకు హక్కులు చైనాకి ఉంటాయి. తాజాగా చైనాకి చెందిన సబ్ మెరైన్ లు హంబన్ తోట పోర్ట్ దగ్గర తిరుగుతున్నట్లు సమాచారం. అంటే మన మీద నిఘా వేయడానికే ఇదంతా !

ఇప్పటి సంక్షోభానికి ప్రధాన కారణం శ్రీలంక ప్రభుత్వాలు భారత్, జపాన్ లతో సఖ్యతగా లేకపోవడమే కారణం. నిజానికి శ్రీలంకకి ఉన్న అప్పుల్లో సింహ భాగం జపాన్ దేశానిది.. అయితే తరువాతి స్థానంలో చైనా ఉంది. భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ మూడు దేశాల నుండే కాక ఆసియా అభివృద్ధి బాంక్ నుండి కూడా అప్పులు తీసుకుంది శ్రీలంక.

కొలంబో పోర్ట్ ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ప్రాజెక్ట్ నుండి జపాన్ భారత్ లని తప్పించినప్పుడు అప్పటి జపాన్ ప్రధాని షిజో అంబే శ్రీలంకకి తీవ్రంగా నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. ఇప్పటికే అప్పులో ఉన్న మీకు కావలసినప్పుడల్లా అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది జపాన్ ఎల్లప్పుడూ అంటూ ! కానీ ముడుపులకి ఆశపడిన రాజపక్సే కుటుంబం జపాన్ ప్రధాని మాటలని పెడ చెవిన పెట్టింది. ఫలితం ? ఇప్పటి పరిస్తితి . జపాన్ కి 3 బిలియన్ డాలర్లు అప్పుగా ఇవ్వడం పెద్ద విషయం కాదు కానీ ఇప్పుడు జపాన్ ని అడగలేదు. భారత్ ని అడగడానికి మొహం చెల్లదు. చైనా తనకి లాభం లేకుండా ఏ దేశానికి అప్పు ఇవ్వదు.

కుటుంబ పాలన వలన వచ్చే నష్టం!

ఈ నెల చివరికి శ్రీలంక అంతర్జాతీయ బాండ్లకి, కాలపరిమితి తీరిపోయిన వాటికి డబ్బు తిరిగి చెల్లించాలి. కానీ చేతిలో డబ్బు లేదు కాబట్టి దివాలా తీసినట్లుగా ప్రకటిస్తుంది IMF… 2007 నుండి ప్రపంచవ్యాప్తంగా చెల్లే విధంగా ఇంటర్నేషనల్ సావరిన్ బాండ్స్ పేరుతో [sovereign bonds (ISB)] అప్పులు తీసుకుంటూ వచ్చింది శ్రీలంక. వాటిలో సింహ భాగం ఈ నెల చివరికి గడువు ముగిసిపోతాయి. ఈ బాండ్స్ విలువ 11.8 బిలియన్ డాలర్లుగా ఉంది. మొత్తం విదేశీ అప్పుల్లో ఇది 36.4%. పూట గడవడానికే దిక్కు లేదు ఇప్పుడు వీటి చెల్లింపులు ఎలా చేస్తుంది ?

అయితే కేవలం రాజపక్సే కుటుంబం ఒక్కటేనా శ్రీ లంకలో ఉన్న కుటుంబ పాలన ? గతంలోనూ ఉంది. మొదటి ఆసియాలోనే శ్రీలంక మహిళా ప్రధాని సిరిమావో బండారునాయకేది కూడా కుటుంబ పాలనే ! సిరిమావో బండారు నాయకే శ్రీ లంకని ఏలింది. తరువాతి కాలంలో తన కూతురు అయిన చంద్రికా కుమారతుంగ ని కూడా రాజకీయాలలోకి దింపింది. 1994 లో చంద్రిక కుమారతుంగ భారీ మెజారిటీతో అధ్యక్షురాలిగా ఎన్నిక అయింది వెంటనే తన తల్లి అయిన సిరిమావో బండారు నాయకేని ప్రధానిగా నియమించింది.

తమ కుటుంబాలు బాగుంటే చాలు ప్రజలు ఎలా పోయినా ఇబ్బంది లేదు అనే ధోరణిలో కుటుంబ వారసత్వ రాజకీయాలు ఉంటాయి. ఇంతకీ శ్రీలంక ప్రస్తుత సంక్షోభం నుండి బయట పడుతుందా ? కేవలం దిగుమతులు ఎక్కువ ఎగుమతులు తక్కువగా ఉండే శ్రీ లంక లాంటి దేశం ఇప్పట్లో కోలుకునే సూచనలు కనుచూపు మేరలో లేవు. ప్రజల్లో చైతన్యం రానంత వరకు ఇలా కుటుంబాలు ఏళ్ళకి ఏళ్ళు దేశాలని, రాష్ట్రాలని ఏలుతూనే ఉంటాయి…..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions