ధా… రా… ణా… హా…
ఛే… నో… రా… హా…
ధా… రా… య… జ…
చౌ… రౌ… రా… ఏ…
…. ఈ అక్షరాల్ని ఓసారి పాడటానికి ప్రయత్నించండి… పోనీ, మీకిష్టమున్న ట్యూన్‌లో… బీభత్సం, క్రౌర్యం, భీకరం గట్రా వినిపించాలి… అబ్బే, రావడం లేదా..? ఎక్కడో, ఏ ఒడిశా మారుమూల గ్రామంలోనో, అమావాస్య, చీకటిపూట, భీతిగొలిపే స్మశానంలో, ఏ మంత్రగాడు దార్కాయో కాష్మోరాను పిలుస్తున్నట్టుగా… ఏదో క్షుద్రశక్తిని ఆవాహన చేస్తున్నట్టుగా ఉన్నాయా..? ఛ, తప్పు… ఇది ఓ కొత్త తెలుగు క్రియేటివ్ సాంగ్ పల్లవి… హేమిటీ నమ్మడం లేదా..? యూట్యూబ్‌లో దొరుకుతుంది చూడండి… భయపడకండి…
ఇలాంటి పాట, ఇలాంటి కంపోజింగ్ గతంలో ఎప్పుడూ వినలేదు… నిన్ననే కదా, మనం తెలుగులో వచ్చిన అరబిక్ కుత్తు పాట గురించి చెప్పుకున్నాం… అందులో హలామితీ హబీబో, ఇంకొన్ని పదాల అర్థమేమిటో తెలియక చాలా బుర్రలు ఇప్పటికే వాచిపోయాయి… ఇప్పుడు మనం చెప్పుకునే పాట దానికి తాత వంటిది… ఎహె, దీనికి అసలు ఏ పాటతోనూ పోలికే లేదు… అంతే… ధా… రా… ణా… హా… అబ్బే, దారుణహా… కాదు…
ఈ పాట వింటుంటే నిజానికి జాలి వేయలేదు… నవ్వొచ్చింది… రాబోయే దర్జా అనే సినిమాలోనిది ఈ పాట… దీన్ని ఉత్తేజ్, ఆయన కూతురు పాట పాడారు… ఉత్తేజ్ ఉచ్చరణ అస్సలు అర్థమయ్యేలా లేదు… తను రెగ్యులర్ సింగర్ కాదు కాబట్టి వోకే… మరి తనతో ఎందుకు పాడించారో సదరు సంగీత దర్శకుడికే తెలియాలి… బిడ్డ టోన్ మాత్రం బాగుంది… బాగా నవ్వొచ్చిన మరో అంశమూ ఉందండోయ్…
Ads
క్షుద్ర మంత్రాల పల్లవి విన్నారు కదా… చరణాల్లోకి రండి… ఫస్ట్, చరణమే… ‘‘అందాల రూపసి, తరంగాల కర్కసి’’ అట… రూపసి వోకే… ఈ తరంగాల కర్కసి హేమిటో అస్సలు అర్థం కాలేదు… దీనికన్నా ఆ అరబిక్ హలామితీ హబీబో అర్థం చేసుకోవడం వీజీ…
అంతుచూసే రక్కసీ తనేలే
వేల వేల విధ్వంసాల విలయ తాకిడి
క్రూర నేర ప్రకంపాల ప్రళయ ధ్వంసిని
…. క్షమించండి… ఉత్తేజ్ గొంతు విని పదాల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం… ఈ వాక్యాలేవో చదివాడు… తరువాత మళ్లీ క్షుద్ర మంత్రపఠనం…
నే… త్రం… రౌ… ధ్రం… నే… త్రం… క్రో… ధం…
…. తరువాత… పాట చదువుకొండి… ఎందుకంటే… తరువాత చెప్పుకుందాం…
కనకం కనుతెరిచితే వేటాడే సింహమైనా
తోకముడిచి శునకమవునులే
శంఖినీల దుర్గం, కింకరుల మార్గం
కర్కోటక హృదయము తనే
కసిరేపే పరువము, నిలువెత్తు గరళము
ఎదురొచ్చే మృత్యురూపము
అలుపెరుగని యమపాశము
మనసులేని విషసర్పము
తన చూపే అగ్నిజ్వాల, తన నవ్వే విషపు హేల
పాముపడగ ఆమె నీడ, ముళ్ల మడుగు ఆమె జాడ
జాలి గుండె లేని నిప్పుకణం
మనిషి రూపమై చరించే మృగమే కనకం
….. ఇక్కడ మళ్లీ విచిత్ర పదబంధాలు పలకరిస్తాయి ఇలా…
గురగుర శివంగి
బరబరబర శివంగి
కరకరకర శివంగి
నమిలివేయు శివంగి
జ… లా… న… హ… ఛే… నే… లో… హా…
…… మొత్తం చదివాక మీకు ఏం అర్థమైంది..? ఎవరో బీభత్స, భీకర, క్రూర మహిళ గురించిన వర్ణన అని అర్థమైంది కదా… అంటే, ఆ కేరక్టర్ వేస్తున్న నటి మొహంలో, కళ్లల్లో ఆ క్రౌర్యం కనిపించాలి… ఫాఫం, ఈ పాట అనసూయ మీద చిత్రీకరించారు… క్రౌర్యం ప్రదర్శించడం అంత అల్లాటప్పా కాదు… చాలా కష్టమైన నటన అది… ఈమెను చూస్తే ఆ పాటలో వర్ణించిన భీకరత్వంలో పైసామందం కూడా ఫీల్ కలగదు మనకు… పాట స్టార్టింగ్ సంగీతం కూడా నక్కల ఊళల్లాంటి ఏవో ధ్వనులతో మొదలవుతుంది….
పైగా ఆమెను చూస్తుంటే ఎంతసేపూ జబర్దస్త్ నవ్వులు, రంగమ్మత్త హొయలు గుర్తొస్తాయి… ఆ మొహంలో అస్సలు విలనీ పలకదు… ఆ పాట రేంజ్ ఏమిటి..? లలిత, వెటరన్ లావణ్య అనసూయ ఏమిటి..? పుష్పలో విచిత్రమైన మంగళం సీను వేషం వేసిన సునీల్ ఈ దర్జా సినిమాలో అనసూయతోపాటు నటిస్తున్నాడు… ధా… రా… ణా… హా……. ఛే… నో… రా… హా…….. ధా… రా… య… జ…… చౌ… రౌ… రా… ఏ…… బాబోయ్, మళ్లీ అవేవో మంత్రాలు గుర్తొస్తున్నయ్… ఇక ఇక్కడ ఆపేసి, హనుమాన్ చాలీసా పఠించడం బెటరేమో…!!
Share this Article