భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ… భర్తగా మారకు బ్యాచిలరూ… షాదీ మాటే వద్దు గురూ… సోలో లైఫే సో బెటరూ… అంటాడు మనీ చిత్రంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి… నిజానికి సంసారబంధంలో ఇరుక్కోకు భాయ్ అని ఆ సినిమా కథానుసారం ఏదో సరదాగా చెబుతాడు గానీ… ఆ కోరిక బలంగా ఉండాల్సింది ఆడవాళ్లలో… పెళ్లి అనే బంధాన్ని బందిఖానాలా భావించే ఆడవాళ్లు కోకొల్లలు…
అందరూ బయటికి చెప్పరు… సామాజికభయం… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? ఓ వార్త కనిపించింది… అదేమిటయ్యా అంటే..? ఒకావిడ… పేరు నయోమీ హారిస్… దేశం జపాన్… ఓ పెళ్లి చేసుకుంది.,. దాని పేరు సోలో వెడ్డింగ్… అంటే వధువు ఉంటుంది, బంధుగణం, స్నేహితులు ఉంటారు… వేడుకలు, పురోహితులు, వెడ్డింగ్ దుస్తులు, ఫోటోషూట్… వాట్ నాట్..?
ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ పెళ్లిళ్లలో ఎన్ని కావాలో అన్నీ ఉన్నయ్… అన్ని తంతులూ జరుగుతయ్… కానీ వరుడు మాత్రమే లేడు… ఎందుకు లేడు..? సోలో వెడ్డింగ్ అంటేనే అది… తమను తాము పెళ్లిచేసుకోవడం… అంటే ఇక జీవితం మొత్తం పెళ్లీపెటాకులూ లేకుండా ఒంటరిగా ఉంటానని చేసుకునే పెళ్లి… వధువు ఈమేరకు ప్రమాణం చేసి, పెళ్లి ఉంగరాన్ని తనకు తానే తొడుక్కుంటుంది…
Ads
వాస్తవానికి ఇది కొత్తేమీ కాదు… సోలో వెడ్డింగ్ అనేది ఒకింత పాతదే… పదేళ్ల క్రితమే ప్రారంభమైంది… ఎక్కువగా జపాన్‌లో… అక్కడ ఒంటరి జీవితాల మీద మక్కువ ఎక్కువ… తమ క్లోజ్ సర్కిళ్లలోకి ఎవరినీ రానివ్వరు… ఏ ఉద్వేగబంధాల్లోనూ ఇరుక్కోవడానికి ఇష్టపడరు… తమ జీవితాలు, తమ ప్రణాళిక… అంతే…
ఈ ధోరణి జపాన్‌కే పరిమితం కాలేదు… ఇటలీ, ఆస్ట్రేలియా, తైవాన్, అమెరికాల్లో కూడా వ్యాప్తి చెందుతోంది… కొందరు పెళ్లిళ్లు పెటాకులైనవాళ్లు చెంపలు వాయించుకుని ఈ సోలో వెడ్డింగ్స్ చేసుకుని, మళ్లీ జన్మలో ఈ బంధాల్లో ఇరుక్కునే నేరం చేయను అని ప్రమాణాలు చేసేస్తున్నారు… వీళ్ల అనుభవాలు చూస్తూ కొందరు బ్రహ్మచారిణులు సైతం ఈ ‘ఒంటరి వివాహాల’కు మొగ్గుచూపుతున్నారు… అయితే..?
ఇక్కడ అంతుచిక్కని ఓ ప్రశ్న తలెత్తుతుంది… ఒంటరి మహిళగా బతుకు గడపాలంటే వాళ్ల ఇష్టం… వాళ్ల అనుభవాలు, భయాలతో ఆ నిర్ణయాలు తీసుకుంటే ఆశ్చర్యపడాల్సింది ఏమీలేదు… ప్రపంచంలో కోట్ల మంది సింగిల్ వుమెన్ ఉన్నారు… సింగిల్ మదర్స్ ఉన్నారు… ఈ ధోరణి ఇంకా పెరిగీ పెరిగీ పెళ్లి అనే ఓ కట్టుబాటును క్రమేపీ బ్రేక్ చేసినా చేయొచ్చుగాక… అయితే మరి భారీ ఖర్చుతో, ఓ వేడుకలాగా, ఈ సోలో వెడ్డింగ్ అనే తంతు దేనికి..? దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం దేనికి..? ఓ వృథా ప్రదర్శన కాదా అనేది ప్రశ్న…
ఎస్, ప్రదర్శన… నిజమే… నేను పెళ్లిచేసుకోను అని సమాజానికి ప్రదర్శించడమే ఈ తంతు ఉద్దేశమట… పెళ్లి ఎందుకు చేసుకుంటారు…? మేం పెళ్లి చేసుకున్నాం అని సమాజానికి చాటిచెప్పడం కోసమే కదా… సేమ్, అలాగే నేను పెళ్లి చేసుకోను అని సమాజానికి చాటిచెప్పడమే ఈ సోలో వెడ్డింగ్ అట… ఈ పెళ్లిళ్ల సమర్థకుల వాదన అది… మరి పిల్లలు, ఇతరత్రా బంధాల మాటేమిటి అంటారా..? భలేవారే, పెళ్లి చేసుకోవడం లేదు అని మాత్రమే వాళ్లు ప్రకటించేది…!! మిగతా వ్యవహారాలన్నీ వాళ్ల ఇష్టం… కాదనడానికి ఎవరైనా ఎవరు..?!
Share this Article