బంగ్లాదేశ్… తాహెర్ అహ్మద్ ఆయన పేరు… ఓ యూనివర్శిటీలో ప్రొఫెసర్… భార్యాపిల్లలు, సాఫీగా సాగుతున్న జీవితం… 2006, ఫిబ్రవరి ఆయన కిడ్నాపయ్యాడు… రెండు రోజుల తరువాత తాహెర్ శవం ఓ మ్యాన్హోల్లో కనిపించింది… కన్నీరుమున్నీరైన కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది… కేసు నమోదైంది… ఈ హత్య వెనుక ఆరుగురు నిందితులున్నట్టు సందేహించారు… దర్యాప్తు ప్రారంభమైంది…
తాహెర్ హత్యకు కారకులైన వారికి తగిన శిక్ష పడేలా చేయడం కోసం ఆ కుటుంబం కోర్టుల చుట్టూ తిరిగింది… ఎక్కడా ఏమీ ఆశలు కనిపించలేదు… ఇక ఎవరినీ న్యాయం కోసం అడగొద్దని అనుకున్నారు… ఈలోపు ప్రధాన నిందితుడు కూడా బెయిల్పై విడుదలయ్యాడు… దీంతో మనమే న్యాయం కోసం పోరాడదాం అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది… అమ్మ, సోదరుడు కలిసి బిడ్డను న్యాయవిద్య చదవాలని చెప్పారు… ఆమె సరేనంది… ఆమె పేరు షెగుప్తా తబసుమ్…
నిజానికి ఆమెను లాయర్ చేయాలనేదే తండ్రి కోరిక… ఆమెకు పెద్దగా ఆసక్తి లేకపోయేది… నాన్న మాట కాదనలేదు… తాహెర్ తను చనిపోవడానికి కొద్ది రోజుల ముందే స్థానిక లా కాలేజీలో జాయిన్ చేశాడు… కానీ తండ్రి మరణంతో ఆ చదువుకు కొన్నాళ్లు బ్రేక్ పడింది… ఎప్పుడైతే తమకు న్యాయం దొరకడం లేదని ఆ కుటుంబం భావించిందో, ఇక బిడ్డ తన న్యాయవిద్యను కొనసాగించింది… నాన్న చేర్పించిన బీఆర్ఏసీ యూనివర్శిటీలో న్యాయపట్టా తీసుకుంది…
Ads
బార్ అసోసియేషన్ సభ్యత్వం తీసుకుంది… తండ్రి కేసు టేకప్ చేసింది… ఒక ఫైట్… ఒకటే టార్గెట్… తన తండ్రిని చంపిన హంతకులకు సరైన శిక్షపడాలి… పెద్ద పెద్ద సీనియర్ లాయర్లకు దీటుగా నిలబడింది, వాదించింది… ఫలితంగా రాజ్షాహి కోర్టు 2009లో నలుగురు దోషులకు మరణదండన విధించింది… వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు… 2013లో హైకోర్టు వారిలో ఇద్దరికి మరణదండన, ఇంకో ఇద్దరికి జీవితఖైదు ఖరారు చేసింది… ఇక్కడితో అయిపోలేదు…
వాళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు… తొమ్మిదేళ్లుగా విచారణ సాగుతూనే ఉంది… చివరకు ఆమెకు అంతిమ విజయం దక్కింది… మీడియా ముందుకు వచ్చి వివరాలు వెల్లడించారు తల్లి, బిడ్డ… ఈ ఫోటో అదే…
ఈ కేసులో దోషులు ఎవరో తెలుసా..? తాహెర్ ప్రొఫెసర్గా పనిచేసే యూనివర్శిటీ వాళ్లే, ఆయనతో కలిసి పనిచేసినవాళ్లే… డబ్బు, ఉన్నత పదవుల కోసం ఈ ఘాతుకానికి ఒడిగట్టారు… ఏళ్ల తరబడీ విచారణ జరిగినా సరే, చివరకు సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పునే సమర్థించింది… ఇద్దరికి మరణదండన, మరో ఇద్దరికి జీవిత ఖైదు… ఇది ఆమెకు తొలి కేసు… అదీ తండ్రి హత్య కేసు… ఇన్నేళ్లు పోరాడి చివరకు గెలిచింది… దాదాపు 16 ఏళ్ల పోరాటం… ఇప్పుడు తృప్తిగా ఉంది… నాన్న ఆత్మకు శాంతి చేకూర్చినందుకు…’’ అంటోంది ఆ లేడీ లాయర్… ఇదొక స్పిరిట్… గెలుపా ఓటమా జానేదేవ్… కానీ ఓ టార్గెట్ పెట్టుకుని, దానికోసం అలుపు ఎరగకుండా పోరాటం చేయడం అనేది ప్రశంసనీయం…!!
Share this Article