కశ్మీర్‌లో పెచ్చరిల్లిన మతోన్మాదం, హిందువుల ఊచకోతపై ‘ది కశ్మీరీ ఫైల్స్’ సినిమా తీసి సంచలనం సృష్టించిన వివేక్ అగ్నిహోత్రి తన తదుపరి సినిమాను ప్రకటించాడు… దాని పేరు ‘ది ఢిల్లీ ఫైల్స్’… మోడీ అభిమానిగా ప్రకటించుకున్న అగ్నిహోత్రి మొదటి నుంచీ కాషాయవాదే… ప్రస్తుతం ఫిలిమ్ సర్టిఫికేషన్ సెంట్రల్ బోర్డు సభ్యుడు… కశ్మీరీ ఫైల్స్ సినిమాను హిందూ సంస్థలు బాగా ప్రమోట్ చేశాయి… దాంతో దాదాపు 300 కోట్ల దాకా వసూళ్లు సాధించింది సినిమా…
ది ఢిల్లీ ఫైల్స్ సినిమా కథాంశం ఏమిటో ఆయన సూచనప్రాయంగా కూడా వెల్లడించలేదు… తాష్కెంట్ ఫైల్స్ అనగానే తను రాసిన వూ కిల్డ్ శాస్త్రి బుక్ పేరు గుర్తొస్తుంది… తాష్కెంట్ అనగానే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం గుర్తొస్తుంది… ఆ మృతి వెనుక మిస్టరీ గుర్తొస్తుంది… సో, ఈజీగా సినిమా కథాంశం ఏమిటో గుర్తించవచ్చు… అలాగే కశ్మీరీ ఫైల్స్ అనగానే హిందువుల ఊచకోత అనేదే కంటెంట్ అయి ఉంటుందని ఇట్టే గుర్తించొచ్చు…
ఎందుకంటే..? తను హిందూవాది… కశ్మీర్‌లో అమానుషంగా సాగిన మారణకాండకు మించిన ఎమోషనల్ ఇష్యూ హిందువులకు ఏముంటుంది..? సో, ఆ కథాంశం ఏమిటో కూడా ఇట్టే గుర్తించారు… కానీ ఢిల్లీ ఫైల్స్ అంటే..? ఢిల్లీ అల్లర్లే తన కథాంశం అయి ఉంటుందనే చర్చ సాగుతోంది… బీజేపీకి ఉపయోగపడినా, పడకపోయినా కాంగ్రెస్‌ను పెద్ద ఎత్తున డీఫేమ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆ కథాంశం… మరి అగ్నిహోత్రికి కావల్సింది కూడా అదే కదా…
Ads
సిక్కుల పవిత్ర ప్రార్థనస్థలం స్వర్ణదేవాలయంపైకి సైన్యాన్ని పంపించి, దాన్ని ఉగ్రవాదుల నుంచి విముక్తం చేసిన ఇందిరాగాంధీ… యావత్ సిక్కు జాతికి శత్రువుగా మారిపోయింది… సిక్కుమతానికే చెందిన ఇద్దరు వ్యక్తిగత అంగరక్షకుల కాల్పులకు గురై ప్రాణాలు వదిలింది… దేశం షాక్‌లో మునిగింది… అప్పటికప్పుడు దేశవ్యాప్తంగా సిక్కుల మీద దాడులు జరిగాయి… అంతకుముందు నెలల తరబడీ పంజాబ్‌లో ఖలిస్థానీ ఉగ్రవాదులు హిందువులను చంపేస్తున్నా రాని వ్యతిరేకత, ఇందిర మరణం తరువాత ఒక్కసారిగా పెచ్చరిల్లింది…
ఆ అల్లర్లలో 2800 వరకు సిక్కులు మరణించి ఉంటారని, 2100 కేవలం ఢిల్లీలోనే చనిపోయి ఉంటారని ఓ అంచనా… నిజానికి అనధికారిక లెక్కల్లో ఇంకా ఎక్కువే ఉండవచ్చు… కొన్ని వేల కుటుంబాలు అవస్థల పాలయ్యాయి… ఒక పెద్ద చెట్టు కూలినప్పుడు ఇలాంటి కంపనాలు సహజమే కదా అని అప్పట్లో రాజీవ్ గాంధీ స్పందించడం పెద్ద ఎత్తున విమర్శలకు గురైంది… ఈ దాడుల మీద బోలెడు విచారణలు, దర్యాప్తులు గట్రా జరిగాయి… కాంగ్రెస్ నేతలు సజ్జన్‌కుమార్ తదితరుల పాత్ర మీద బహిరంగ రహస్యం…
దాదాపు 34 ఏళ్ల తరువాత హైకోర్టు సజ్జన్‌కుమార్‌ను దోషిగా ప్రకటించింది… తన బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్నట్టు గుర్తు… ఇదంతా సరే, కానీ అగ్నిహోత్రి ఏం చూపించాలని అనుకుంటున్నాడనేదే ప్రధాన ప్రశ్న… చాన్నాళ్లు నిశ్శబ్దంగా ఉండిపోయిన ఖలిస్థానీవాదం మళ్లీ మెల్లిమెల్లిగా బలం పుంజుకుంటోంది… కొంపదీసి, ది ఢిల్లీ ఫైల్స్ దానికి ఆజ్యం పోసినట్టు కాదు కదా… జాగ్రత్త…!! ఆఫ్టరాల్ సినిమాయే కదా అనకండి… అగ్గిపుల్ల చాలా చిన్నగానే ఉంటుంది…!!
Share this Article