నిన్న ఓచోట విమర్శ… ‘‘ఆర్ఆర్ఆర్ అనేసరికి పోటీలుపడి స్తుతిగీతాలు ఆలపించిన మన పెద్ద హీరోలు, పెద్ద దర్శకులు, పెద్ద నిర్మాతలు కేజీఎఫ్-2 భారీ విజయం పట్ల ఎందుకు నోళ్లు మెదపడం లేదు..? ప్రాంతీయవాదమా..? కన్నడ సినిమా కదాని వివక్ష చూపిస్తున్నారా..? యశ్ మనవాడు కాదు కాబట్టి పట్టించుకోకూడదా..? జూనియర్, రాంచరణ్ మనవాళ్లు కాబట్టి భజనలు అందుకోవాలా..? ఓ సౌతిండియన్ సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులు ఈర్ష్య పుట్టిస్తున్నాయా..?’’ ఇలా సాగింది ఆ విమర్శ…
ఇక్కడ కొన్ని ప్రశ్నలు తొలుస్తున్నయ్… మరి ఈ పెద్ద తలకాయలకు నిజంగా తెలుగంటే అంత పక్షపాతం ఉందా..? లేక పెరుగుతున్న కన్నడ సినిమా మార్కెట్‌ను ఓ కొత్త పోటీగా పరిగణించి సహించలేకపోవడమా..? ఐనా ఈరోజుల్లో క్రియేటివిటీ, లక్, వర్క్ ఉన్నవాడిని ఎవరాపగలరు..? కన్నడ సినిమా మునుపటి కన్నడ సినిమా కాదు, ఇప్పుడది తలెత్తుకుని వరల్డ్ మార్కెట్‌లో కొత్త రికార్డుల్ని ఎగరేస్తోంది… ఎందుకు హఠాత్తుగా నెగెటివ్ క్యాంపెయిన్ కూడా స్టార్టయింది..?
అయిపోయింది, కలెక్షన్లు డల్, అసలు కొన్నిచోట్ల బ్రేక్ ఈవెన్ వస్తుందో రాదో డౌటే అని రాస్తున్నారు కొందరు… రియల్ రాఖీ భాయ్ వచ్చేశాడు, కేజీఎఫ్‌కు షాక్ అని కొన్ని వార్తలు… కోలార్ బంగారుగనుల్లో ఓ గ్యాంగ్ క్రియేట్ చేసుకున్న థంగం అనే ఓ రాఖీ భాయ్ తరహా డాన్ కేరక్టర్ 1997లో ఎన్‌కౌంటరయ్యాడు… కేజీఎఫ్ రాఖీ భాయ్ కేరక్టర్ తన కొడుకు పాత్రేనని థంగం తల్లి పాలీ ఆరోపిస్తోంది… ఔనా..? మరి కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ వచ్చింది 2018లో… కేజీఎఫ్-2 కూడా మూడేళ్లుగా నిర్మిస్తున్నారు..? ఐనా అది ఫలానా థంగం బయోపిక్ అని చెప్పారా ఎవరైనా..?
Ads
ఐనా తెలుగు వాళ్లు తీస్తేనే తెలుగు సినిమా అనాలా..? అందులోనూ తెలుగు హీరో అయి ఉండాలా..? తెలుగు దర్శకుడైనా పర్లేదా..? మరి ఇదే వివక్షను హిందీ పెద్దలు ప్రదర్శిస్తే అప్పుడేమందాం..? నిజానికి వాళ్లు మరిచిపోతున్నది కేజీఎఫ్ సక్సెస్‌కు ప్రధాన కారకుడైన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలుగువాడే అని మరిచిపోతే ఎలా..? లేక తనను తెలుగువాడిగా గుర్తించడానికి ఏం అడ్డం వస్తున్నది..? అఫ్‌కోర్స్, ఈ పెద్దలు గుర్తించాలని ఏమీ లేదు… ప్రశాంత్ కుటుంబం యాదవ, బీసీ… తెలుగువాడిగా గుర్తించాలంటే ఫలానా ఫలానా పెద్ద కులాలే అయి ఉండాలా..? బీసీతనం పరిగణనలోకి రాదా..?
ఎస్, ప్రశాంత్ నీల్ తెలుగువాడే… మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఫ్యామిలీయే… రఘువీరా తండ్రి, ప్రశాంత్ తండ్రి సుభాష్ అన్నదమ్ముల పిల్లలు… సుభాష్ బెంగుళూరులో సెటిలయ్యాడు… వాళ్ల స్వగ్రామం నీలకంఠాపురం, అందులోని నీల్ అనే షార్ట్ ఫామ్‌ను తమ ఇంటిపేరుగా మార్చుకున్నారు రూట్స్ మరిచిపోకుండా… ప్రశాంత్ భార్య లిఖిత రెడ్డి కూడా తెలుగమ్మాయే… (మన తెలుగువాళ్లను తప్ప మేమెవరినీ గుర్తించబోం అనే సంకుచిత ఆలోచనలు ఎవరికైనా ఉంటే వాళ్ల కోసం ఈ వివరాలు…) ‘‘అవును, ప్రశాంత్ మావాడే’’ అని స్వయంగా రఘువీరారెడ్డి ‘‘ముచ్చట’’కు తెలిపాడు…
ఈరోజు కేజీఎఫ్ బంపర్ హిట్ కావచ్చుగాక… వసూళ్లు అన్నీఇన్నీ అనే లెక్కలూ అవసరం లేదు… రేప్పొద్దున ఇదే స్థాయిలో మరో సినిమా ఆకట్టుకోలేకపోవచ్చు… మొన్నటి రాధేశ్యామ్ అనుభవం చూశాం కదా… కానీ ఓ అరుదైన హిట్ కళ్లెదుట కనిపిస్తున్నప్పుడు ఓ చిన్న అభినందన ట్వీట్ చేస్తే తప్పేమిటి..? ఐనా పాన్ ఇండియా సినిమాలకు ప్రాంతీయ రంగు ఏమిటి..? కేజీఎఫ్ వంటి గ్యాంగ్‌స్టర్ సినిమాలు ఏ భాషలో వచ్చినా ఫరక్ పడేది ఏముంది..? అది యూనివర్శల్ సబ్జెక్టు… వరల్డ్ లాంగ్వేజీ…!!
Share this Article