గంగూభాయ్ కఠియావాడి… భన్సాలీ రేంజ్ సినిమా కాదు అని చాలామంది పెదవి విరిచారు… సినిమా చెత్త అని ఎవరూ అనలేదు, కానీ ఏదో అసంతృప్తి… నిజానికి మెచ్చదగిన పాయింట్స్ లేవా..? కొన్ని ఉన్నయ్… థియేటర్లకు వెళ్లినప్పుడు ఓ హైప్ మన మెదళ్లను ఆవరించి ఉంటుంది… భన్సాలీ సినిమా కదా, ఏవేవో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి… అందుకని ఆ రీతిలో లేకపోయేసరికి నారాజ్ అయిపోతాం… కానీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో పెట్టేశారు కదా… ఇంకొక్కసారి చూడండి… సినిమా మీద కొంతమేరకు అభిప్రాయం మారుతుంది…
గంగూభాయ్ కథ ఓ వేశ్యావాటిక ఓనర్ కథ… మాఫియా అండతో ఒక్కొక్క బ్రోతల్ హౌజునే హస్తగతం చేసుకుంటూ, చివరకు బాంబే కామాటిపుర అనే రెడ్‌లైట్ ఏరియానే తన గుప్పిట్లోకి తెచ్చుకున్న లేడీ డాన్ కథ… అంటే బోలెడెంత బూతును కథానుసారమే నింపే చాన్సుంది… కానీ ఒక్క సీన్ కూడా, ఒక్క మాట కూడా, ఒక్క పాట కూడా ఆ దిశలో లేదు… అశ్లీలం, బజారు భాష, నేచురాలిటీ పేరిట బూతులు లేవు… మాఫియా లింక్స్ ఉన్న కథే అయినా సరే, ఎక్కడా యాక్షన్, ఫైట్ల జోలికి, ఇతర కమర్షియల్ వాసనలకు పోలేదు… దర్శకుడిదే ఆ క్రెడిట్…
1960 కాలం నాటి కామాటిపురను తెరపై దింపాడు దర్శకుడు… పలుచోట్ల డైలాగ్స్ కూడా పదునుగా ఉన్నయ్… కాకపోతే వాటిని హిందీలోనే వినాలి… తెలుగులో పెద్దగా నప్పలేదు, అనువాదం సరిగ్గా లేక, పంచ్ లోపించింది… కొన్ని సీన్ల విషయంలో మాత్రం అసలు భన్సాలీయేనా ఈ సినిమా తీసింది అనే ఆశ్చర్యం కలుగుతుంది… 12 ఏళ్ల తరువాత గంగూభాయ్ సొంత ఇంటికి ఫోన్ చేస్తుంది, తల్లితో మాట్లాడుతుంది… ఎంత ఎమోషన్ పండాలి..? ప్చ్, ఓ నాసిరకం సినిమాలో సీన్ అన్నట్టుగా కనిపించింది…
Ads
బలంగా కనెక్ట్ కావాల్సిన అలాంటి కొన్నిసీన్లపై భన్సాలీ పెద్దగా దృష్టి పెట్టనట్టుగా అనిపించింది… ఈ సినిమాలో ప్రధానలోపం ఆమె లవ్ ట్రాక్… సినిమాను గాడితప్పించేసింది అది… కథాగమనానికి అడ్డుపడింది… పైగా ప్రియుడి కుటుంబాన్ని డబ్బుతో లోబరుచుకుని, తన తోటి వ్యభిచారి బిడ్డతో ప్రియుడి పెళ్లి చేయడం మరీ తెలుగు టీవీ సీరియల్ చెత్త కథలా… కృతకంగా ఉంది… గంగూభాయ్ వెళ్లి అజయ్ దేవగణ్‌ను ఏదో అడుగుతుంది, తను వెంటనే ఆమెను ఓ సోదరిలా భావించేస్తాడు… అభయహస్తం ఇస్తాడు… అదీ పెద్దగా కనెక్టయ్యేలా చిత్రీకరించలేదు…
ముంబై కామాటిపురలో ప్రచారం ఉన్న కథ ప్రకారం… ఆమె ఆ అండర్ వరల్డ్ డాన్‌కు రాఖీ కడుతుంది… అంతేకాదు, ఆమె డ్రగ్ పెడ్లర్… అండర్ వరల్డ్ వ్యవహారాలతో లింక్ ఉంటుంది… సినిమాలో మాత్రం కేవలం సారా వ్యాపారంలో భాగస్వామి అన్నట్టుగా చిత్రీకరించారు… గంగూభాయ్ పాత్రలోని విలనీని మొత్తం కత్తిరించేస్తే ఎలా..? పోలీసులు, నాయకులు, మాఫియా, క్రిమినల్స్ అందరూ ఒక్కచోట చేరే దందాపాయింట్ కామాటిపుర… దాన్ని గుప్పిట్లోకి తీసుకుని ఆడించడం అంటే మజాక్ కాదు… గంగూభాయ్‌ను మరీ సాత్విక, బాధిత, సమాజసేవిక కోణంలో చిత్రీకరించడం కథాపరంగా జరిగిన తప్పు…
నిజానికి ఆమె ఫైట్ స్కూల్ దగ్గర స్టార్ట్ అవుతుంది… కామాటిపుర ఖాళీ చేయించి అక్కడ బిల్డింగ్స్ కట్టాలని ఒక మాఫియా ప్లాన్… స్కూల్ పక్కనే స్కూల్ ఉందని, పిల్లలు చెడిపోతారని క్యాంపెయిన్… ఆమెకు మద్దతుగా ఉన్న డాన్ ని కూడా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నం చేస్తారు… కానీ తమ under world ఆక్టివిటీ కి వ్యభిచార కొంపలు ఉండటమే కావాలి వాళ్లకు… అందుకే ఆమెకు సపోర్ట్… Builder సంగతి నేను చూసుకుంటాను, అందరినీ ఏకం చేసి నువ్వు ఫైట్ చేయి అంటాడు ఆమెతో… లీడర్స్ hands up… Case supreme లో వేయిస్తారు builders… వీళ్ళు ఎలాగూ కొట్లాడలేరు అని… ఒక జర్నలిస్ట్ గంగూకి సాయం చేస్తాడు… ఆమె ప్రధానిని కలుస్తుంది… “ఇక్కడ వాటిక 170 ఏళ్ల నుంచీ ఉంది, మీ స్కూల్ 70 ఏళ్ల నాటిది… మీరు స్కూల్ పెట్టేటప్పుడు ఇక్కడ వేశ్య వాటిక ఉన్నట్టు తెలియదా… ఎవరిది తప్పు..?” అని అడుగుతుంది గంగూ…. ఈ మొత్తం ఫైట్ ఇంటరెస్టింగ్ గా చిత్రీకరించ బడలేదు… నిజానికి ఆమె లైఫ్ లో కీలకం ఈ పోరాటమే…
ముగింపు కూడా ఫ్లాట్‌గా… ఓ డాక్యుమెంటరీని ముగించినట్టుగా… తర్వాత ఆ రాజు సుఖశాంతులతో పాలించెన్ అన్నట్టుగా ఉంటుంది… కానీ ఏమాటకామాట… ఈ పాత్రలో అలియా గాకుండా ఏ విద్యాబాలనో ఉండి ఉంటే ఇంకాస్త బాగుండేది అనిపిస్తుంది… అలాగని అలియా బాగా చేయలేదని కాదు… నిజానికి ఆమె ఉంది కాబట్టే సినిమా కనీసం చూడబుల్ అన్నట్టుంది… లేకపోతే ఈమాత్రం కూడా చూడబుద్దేయదు… అలియా తన పరిమితుల్లో తను ఇరగేసింది… ఎటొచ్చీ తన పర్సనాలిటీ, ఫిజిక్ ఆ పాత్రకు సరిగ్గా సూట్ కాలేదు…
కానీ చాలా సీన్లలో అలియా తన మ్యాగ్జిమం ఇచ్చేసింది… నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఓ సీన్‌లో ఓ లెంతీ షాట్‌లో ఆమె డాన్స్ బాగుంది… సుదీర్ఘంగా ఉండే ఆ బిట్‌లో మొదట గ్రూప్ డాన్స్, తరువాత సోలో… అలాగే తమ మిత్రురాలు ఓ బిడ్డను కని మరణశయ్యపై ఉన్నప్పుడు ఆమె పక్కనే పడుకుని కనబర్చిన ఉద్వేగాలు కూడా సూపర్… సో, ఓవరాల్‌గా గంగూభాయ్ కథను మరీ ఏ క్రియేటివ్ లిబర్టీ తీసుకోకుండా, జస్ట్, ఓ డాక్యుమెంటరీలాగా జనం మీదకు భన్సాలీ ఎలా వదిలాడు అనేది అంతుబట్టని ప్రశ్న…!!
Share this Article