Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తప్పదు… ఓ లోతైన, వాస్తవిక ఆత్మ సమీక్ష, మథనం అవసరం ఆచార్యా..!!

April 29, 2022 by M S R

చిరంజీవి అంటే ఈరోజుకూ కొన్నికోట్ల మందికి అభిమానం… అగ్రహీరో… ఆయన కొడుకు రాంచరణ్ మొన్నమొన్ననే ట్రిపుల్ ఆర్‌‌తో బంపర్ హిట్ కొట్టి ఉన్నాడు… అగ్రహీరో… కొరటాల శివ కమర్షియల్ సినిమాలు తీసి, అగ్రదర్శకుల జాబితాలో ఉన్నాడు… పూజా హెగ్డే చాలా డిమాండ్ ఉన్న తార… మణిశర్మ చాలా సీనియర్, అగ్ర సంగీతదర్శకుడు… పాటలు ఇప్పటికే బాగా హిట్టయ్యాయి… సోనూసూద్ దేశం మొత్తం చర్చించుకునే పాపులర్ యాక్టర్… స్టార్ విలన్… అగ్రహీరో మహేశ్‌బాబు నెరేషన్… మరి ఇన్ని అగ్ర విశేషాలు ఒక్కచోట కలిసినప్పుడు… ఎంత బజ్ క్రియేట్ కావాలి..? ఎలాంటి సినిమా రావాలి..? కానీ ఏమైంది..? ఎక్కడ తేడా కొట్టింది..?

నిజానికి ఈ సినిమాకు సంబంధించి మొదటి నుంచీ అపస్వరాలే పలుకుతున్నయ్… సినిమా మొదట్లోనే త్రిష తప్పుకుంది… ఆమెకు ముందే అర్థమైపోయింది ఈ ప్రాజెక్టు ఏదో గందరగోళం, తేడా కనిపిస్తోందని…

అసలు దర్శకుడిగా కొరటాలకే ఫస్ట్ నుంచీ ఓ క్లారిటీ లేనట్టుంది… మొదట కథ ఏదో అనుకున్నాడు… తరువాత ఏదో డౌటొచ్చింది… రాంచరణ్ పాత్రను ప్రవేశపెట్టారు… గెస్టు పాత్ర కాస్తా మెయిన్ పాత్రల్లో ఒకటిగా అయిపోయింది… ప్రయారిటీ పెంచుతూ వెళ్లారు… కథ మారుతూ పోయింది… సెకండాఫ్‌లో రాంచరణ్ పాత్రకు ప్రాధాన్యం పెంచే క్రమంలో చిరంజీవి పాత్ర వీక్ అయిపోయింది… ఒక దశలో మెయిన్ పాత్ర చిరంజీవి కథను, సినిమాను పూర్తిగా రాంచరణ్ భుజాలపై పెట్టేశాడు… చివరికి చంపేశాడు…

Ads

acharya

చిరంజీవి సినిమా అంటేనే స్టెప్పులు, పాటలు, ఫైట్లు… కథ ఏదయినా సరే అవి ఉండాలనే ఓ భ్రమ ఆవరించింది… కానీ హీరోయిన్ పాత్రను ముందుగా అనుకుని, కాజల్‌ను తీసుకుని, తరువాత మొత్తానికే లేపేశారు… అదేమంటే నక్సల్ భావజాలమున్న హీరోకు లవ్ ట్రాక్ బాగుండదని అనుకున్నామని కొరటాల విఫల సమర్థన… నక్సల్ హీరో అయితే లవ్ ఉండకూడదా..? ఐటమ్ సాంగ్స్‌లో నర్తిస్తే పర్లేదా..? కొడుక్కి పూజా హెగ్డే ఉంటే తప్పులేదా..? లేక తండ్రికి, కొడుక్కు ఒకే సినిమాలో రెండు వేర్వేరు లవ్ ట్రాకులు ఉంటే ఆ బరువుకు తెర వంగిపోతుందని కొరటాల తనే సందేహంలో పడిపోయాడా..?

బీస్ట్, రాధేశ్యామ్ సినిమాల ఫ్లాపులకు పాపం, పూజా హెగ్డే ఏమాత్రం కారకురాలు కాదు… కానీ ఒక్కసారిగా ఆమె మీద ఐరన్ లెగ్ ముద్రపడిపోయింది… ఆచార్య సినిమాలోనూ ఆమె ఉంది… కాకపోతే పెద్ద ప్రాధాన్యం లేని పాత్ర… ఐనాసరే… యాంటీ సెంటిమెంట్ ఒకటి ఇండస్ట్రీలో ప్రభావం చూపిస్తూ ఉంటుంది కదా…

acharya1

లాహే లాహే, సానా కష్టం, నీలాంబరి పాటలు చిరంజీవి సినిమా రేంజులోనే హిట్టు… కానీ సినిమాలో చూస్తుంటే ఆ పాటల హిట్టుకు తగిన చిత్రీకరణ లేదని అనిపించింది… కానీ చిరంజీవి, రాంచరణ్ కలిసి డాన్స్ చేసిన భలే భలే బంజారా మాత్రం అభిమానులకు పండుగే… అయితే పాటలు మాత్రమే సినిమాను మోస్తాయా..?

ప్చ్, ఈ హంగులు సరిపోవని అనుకుని రెజీనాతో ఓ ఐటమ్ సాంగ్ పెట్టారు… అసలు సినిమాకు సంబంధించి ఏం జరుగుతున్నదో ఎవరికీ అర్థం కాని స్థితి… సినిమాకు అధికారిక నిర్మాతల్లో రాంచరణ్ కూడా ఉన్నాడు… కానీ డబ్బు పెట్టింది నిరంజన్‌రెడ్డేనని, తను కొంత లాభం తీసుకుని కొరటాలకు ఇచ్చేశాడని ఓ టాక్ వచ్చింది… కొరటాల సన్నిహితులే పలు జిల్లాల్లో రిలీజ్ చేశారట… ప్రిరిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది… ఐతేనేం… టికెట్ల ముందస్తు బుకింగుల దగ్గర నుంచి ఓ హైప్, బజ్ క్రియేషన్ వరకూ సానుకూలత కనిపించలేదు…

acharya

పాటల్ని ముగ్గురు రాశారు… పాడినవాళ్లు కూడా ఎనిమిది మంది… మంచి వైవిధ్యం… భిన్న గొంతుకల కలబోత… బాగుంది… కానీ బీజీఎం దగ్గరకొచ్చేసరికి పెద్ద మైనస్… చివరలో మణిశర్మ వదిలేసి, కొడుక్కి అప్పగించేశాడని ఓ టాక్… అదీ హడావుడిగా పూర్తి చేశారనీ, అందుకే నాణ్యతలో ఆ తేడా కనిపిస్తోందని టాక్… ప్రస్తుతం సినిమాల్లో పాటలు ఉన్నా లేకపోయినా బీజీఎం బాగుండాలి… అదిక్కడ తేడా కొట్టినట్టుంది…

140 కోట్ల దాకా ఖర్చుపెట్టినట్టు చెప్పి… టికెట్ల రేట్ల పెంపు, అదనపు షోలకు అనుమతి తెచ్చుకున్నారు… ఆ ఖర్చులో అధికశాతం ఇద్దరు అగ్రహీరోల పారితోషికాలేనా..? టాక్ బాగుంటే టికెట్ రేట్లు పెద్ద ఇష్యూ కాదు, జనం రేట్లు అధికమైనా సరే ట్రిపుల్ ఆర్ ఎగబడి చూశారు కదా… కానీ ఫిలిమ్ సర్కిళ్లలోనే సినిమా గురించిన పాజిటివ్ టాక్ ఆది నుంచీ లేదు… అంటే కొరటాల ఎక్కడో గాడితప్పిపోయాడని లెక్క…

ఒకప్పటి ఫేమస్ నక్సల్ నేత సుబ్బారావు పాణిగ్రాహి కథ అన్నారు అప్పట్లో… ఆ ఉదాత్తత, ఆ పోరాటశీలత, ఆ త్యాగాలకు సోకాల్డ్ సినిమా కమర్షియల్ రంగులు పూసి, భ్రష్టుపట్టించారా..? నిజానికి అదీ పెద్ద ఇష్యూ కాదు… ట్రిపుల్ ఆర్‌లో ఏకంగా ఇద్దరు చారిత్రిక పోరాటవీరుల కథలను ఇష్టారాజ్యంగా వక్రీకరించలేదా..? జనం పట్టించుకోలేదు కదా… సో, ఆచార్యలో అది మైనస్ అనుకోలేం… కానీ త్యాగాలు తెలిసిన నక్సలైట్ల తుపాకులు చివరకు ఇలా చిత్రీకరించబడటం కలుక్కుమనిపిస్తూనే ఉంటుంది… అసలు నక్సల్స్, భక్తి, తెలుగు హీరో ఇమేజ్ ఫార్ములా ఒక్కచోట రంగరించడం ఒక రాంగ్ స్టెప్…

acharya

అన్నింటికీ మించి… ఇండస్ట్రీలో ఏక్‌సేఏక్ ప్రయోగాలు, కొత్త కథలు, కొత్త దర్శకులు, కొత్త ప్రజెంటేషన్ ఉరకలెత్తుతోంది… చివరకు బాలయ్య వంటి సీనియర్లు సైతం అఖండ అంటూ కొత్త పాత్రలు, కొత్త కథల వైపు ప్రయాణిస్తున్నాడు… కానీ ఓ విలన్, ఓ హీరో, నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు, ఓ ఊరికి పెద్దగా హీరో విజృంభణ… ఇదేనా..? చిరంజీవి వయస్సు ఇప్పటికే 66… విస్తృతమైన రాజకీయ వేదికను వదిలేసి, తన పాత కమర్షియల్ సినిమా పంథాలోకి వాపస్ వచ్చాడు… తన ఇమేజ్‌కి ఇంకా ఈ పాత రొటీన్, ఫార్ములా డాన్సులు, ఫైట్ల పాత్రలు నప్పుతాయా..? ఇది పెద్ద ప్రశ్న… కొత్తదనం కోసం ఓ కసరత్తు, ఓ ఆలోచన, ఓ ప్రయత్నం ఏవి..? వయస్సు మీదపడిన సూచనలు, ప్రయాస ఆ డాన్సుల్లో, ఫైట్లలో స్పష్టంగానే కనిపిస్తున్నాయి కూడా…!!

acharya

ఇంకా థియేటర్లలో ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ దున్నేస్తూనే ఉన్నాయి… లోపాలు ఎన్ని ఉన్నా సరే, ఆ రెండు సినిమాల ధోరణి వేరు… వాటి ఫార్ములా వేరు… బలమైన ఇంటెన్స్… అదే ట్రిపుల్ ఆర్‌లో రాంచరణ్ పాత్ర సూపర్ క్లిక్కయింది… ఎదురుగా ఆ సినిమాలు కనిపిస్తుంటే ఈ పాత పచ్చడి రుచించేది ఎలా..? చిరంజీవి ఇంకా పలు సినిమాలకు సైన్ చేసినట్టు చెబుతున్నారు… ఒక్కసారి ఆచార్య పయనం, కథనం, ఫలితంతో కలిపి ఆత్మసమీక్ష చేసుకుంటే మేలు… అవును, సినిమాలు హిట్టవుతుంటయ్, ఫ్లాపవుతుంటయ్… సహజం… కానీ ఓ లోతైన సమీక్ష మాత్రం అవసరమే ఆచార్యా..!!

.

(ఇది ఆచార్య సినిమా సమీక్ష కాదు… యూఎస్ ప్రీమియర్ షో ప్రేక్షకుల అభిప్రాయాల కలబోత మాత్రమే…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions