నో డౌట్… రీసెంటు విజయాలతో థమన్ తెలుగు సినిమా మ్యూజిక్ ఇండస్ట్రీలో టాప్ ప్లేసులోకి వెళ్లిపోయాడు… ఇక్కడ మెరిట్ అప్రస్తుతం… ఎవరు విజయాల బాటలో ఉన్నారో వాళ్లకే గిరాకీ… దేవిశ్రీప్రసాద్ అంటే కొన్నాళ్లు క్రేజ్… కీరవాణి ఎంతోకాలంగా పాపులరే, కానీ ఈమధ్య బాగా డల్ అయిపోయాడు… ఈమధ్య కొన్ని సినిమాలకు సంబంధించిన పాటలతో పాటు బీజీఎం భీకరంగా క్లిక్ అయ్యేసరికి థమన్ గిరాకీ అనూహ్యంగా పెరిగిపోయింది…
ఆ ప్లేసు ఎంజాయ్ చేస్తున్నాడు… ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ షోకు మెయిన్ జడ్జి కదా… తన మాటలు, పాటలు, ఆటలు, చెణుకులు… మాంచి జుబిలెంట్ మూడ్‌లో ఉన్నాడు… అయితే ఎప్పుడోఅప్పుడు బయటపడకుండా ఉండలేకపోతున్నాడు… అసహనం బద్దలు కొట్టుకుని మొహం మీదకు వచ్చేస్తోంది… ప్రత్యేకించి సోషల్ తను ఏ పాట చేసినా సరే, ఇది ఫలానా పాత పాటకు కాపీ అని వెంటనే సోషల్ మీడియా బయటపెడుతోంది…
Ads
దాంతో ఊరుకోరు కదా… రకరకాల కామెంట్స్ నడుస్తూ ఉంటాయి ఆ వీడియోల కింద… కొన్ని హార్ష్ వ్యాఖ్యలు కూడా ఉంటాయి… అంతే, సోషల్ మీడియా అంటేనే అంత… సో, ఎంత వద్దనుకున్నా తను కొన్ని కామెంట్స్ చూస్తూనే ఉంటాడు… రగిలిపోతుంటాడేమో… ఆదివారం ఎపిసోడ్‌కు పృథ్విచంద్ర, హేమచంద్ర, శ్రావణభార్గవి, దామిని, మోహన భోగరాజు తదితర సీనియర్లు వచ్చి, ఈ కంటెస్టెంట్లతో కలిపి పాటలు పాడారు… ప్రయోగం బాగుంది…
ఈ ఎపిసోడ్‌కు క్రికెటర్ హనుమ విహారిని అతిథిగా తీసుకొచ్చారు… గుడ్, భిన్నరంగాలకు చెందిన ప్రముఖుల్ని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేయడం మంచిదే… మరీ ఎంతసేపూ సినిమా ప్రమోషన్లేనా..? హనుమ విహారి ఏదో సందర్భంలో మాట్లాడుతూ క్రికెట్‌కు సంబంధించి ఏదో చెప్పాడు… వెంటనే థమన్ అందుకుని… ‘‘అవునవును, ఈ దేశంలో ఏమీ తెలియకపోయినా అందరూ ఇట్టే జడ్జ్ చేసేది ఒకటి క్రికెట్, రెండు మ్యూజిక్ అన్నాడు…’’ అన్నాడు… రెండుసార్లు…
ఇక్కడ థమన్ ఆలోచనధోరణి బహుముఖంగా తప్పు… 1) క్రికెట్ ఖచ్చితంగా ఈ దేశంలో అత్యంత పాపులర్ ఆట… ఏ ఆటగాడు ఎలా ఆడాడో, ఎందుకు ఆడలేకపోయాడో మాత్రమే కాదు, ఏ బాల్‌కు ఎలా ఆడి ఉంటే బాగుండేదో కూడా చిన్న పిల్లలు కూడా చెబుతుంటారు… అది వినోదం… జడ్జ్ చేయడం కాదు, ఆస్వాదించడమే, అభిప్రాయాన్ని చెప్పడం కూడా, అది తప్పెలా అవుతుంది..?
2) మ్యూజిక్‌ను శృతులు, రాగాలు, సంగతులు, పిచ్చింగ్, హుకప్స్, నోట్స్ తెలిసిన వాళ్లే జడ్జ్ చేయాలని ఏముంది..? ఒక సినిమాలో, ఒక టీవీలో వచ్చే పాటను ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు, బాగా లేకపోతే బాగా లేదని అంటాడు… అందరికీ శాస్త్రీయ సంగీత జ్ఞానం ఉండాల్సిన పనిలేదు… చెవులకు విందుగా ఉందా లేదా, అలరించిందా లేదా చూస్తాడు… అంతే…
3) ఎస్, గతంలో వచ్చిన పాత పాటల్ని ఎవరైనా కాపీ కొట్టి కొత్త పాటలుగా చెప్పుకున్నా, అనుసరించినా, మక్కీకిమక్కీ దింపేసినా… అవి గుర్తొస్తే సోషల్ మీడియాలో కొందరు పెట్టేస్తారు… తప్పేముంది..? కాపీ కొట్టేవాడు, చోరీ చేసేవాడు ఫీల్ కావాలి గానీ, ఫలానావాడు ఇలా చోరీ చేశాడోయ్ అని ఎవరైనా ఓ సగటు ప్రేక్షకుడు గట్టిగా అరిస్తే అందులో తప్పేముంది..?
సో, మై డియర్ థమన్… ఇది మునుపటి కాలం కాదు… బీజీఎం, ప్రతిపాట మీద ప్రేక్షకుడి నిఘా ఉంటుంది… పరిశీలన ఉంటుంది… కాపీ కొడితే పసిగట్టి బజారులో నిలబెట్టేస్తారు… నా కాపీ ట్యూన్స్ చెలామణీ అవుతున్నాయి కదా, నిర్మాతలు అంగీకరిస్తున్నారు కదా, రోజురోజుకూ ఇంకా గిరాకీ పెరుగుతుంది కదాని అనుకుంటే… సోషల్ ట్రోల్స్‌ను పట్టించుకోవడం మానెసెయ్… అంతేతప్ప ఏమీతెలియనివాళ్లు కూడా జడ్జ్ చేస్తున్నారు అని ఉడుక్కోవడం దేనికి…!!
Share this Article