నిజమేనా..? నేను చూస్తున్న వీడియో నిజమేనా..? నిజమేనట… ఈ వీడియో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయిపోయింది… ఏమిటీ అంటే… అశోకవనంలో అర్జునకల్యాణం అనే సినిమా ప్రమోషన్ కోసం బిజీ రోడ్డు మీద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ ఎవడో ఓ ప్రాంక్ వీడియో చేసిన చీదర యవ్వారంపై పొద్దున ‘‘ముచ్చట’’ ఓ కథనం ప్రచురించిన సంగతి తెలుసు కదా… దీని మీద టీవీ9 ఓ డిబేట్ పెట్టింది…
ఇది ప్రాంక్ వికారమా..? ఓ మూవీ ప్రమోషనా..? పబ్లిక్ న్యూసెన్సా..?!
సాధారణంగా దేవి అప్పుడప్పుడు వాడే కొన్నిమాటలు, తను చేసే వ్యాఖ్యానాలు విపరీతమైన విమర్శలకు గురయ్యాయి… కానీ ఈరోజు చర్చలో మాత్రం అగ్గిఫైరయింది… తన వాదన సరైన రీతిలో సాగింది… సాగాల్సిన తీరు కూడా అదే… డిబేట్‌లో పాల్గొన్న వాళ్లు ఈ ప్రాంక్ ప్రమోషన్ తీరును ఎండగట్టారు…
Ads
ఆయనెవరో చిట్టిబాబు అట… ఈ ప్రాంక్ వీడియోను సమర్థించిన తీరు వెగటు పుట్టించింది… అంతకుమించిన పదం ఏమైనా ఉంటే సూచించాలి… తామేం చేసినా చెల్లుబాటు అవుతుందనే బలుపు ప్రతి మాటలోనూ కనిపించింది… ఈ పదం వాడినందుకు సారీ, కానీ ఆప్ట్ పదమే… ఓ దశలో ఈ డిబేట్‌లో పార్టిసిపేట్ చేసిన హీరో (??… ఈ మాట వాడుతున్నందుకు కూడా సారీ…) విశ్వక్ సేన్ (నిజానికి విష్వక్సేన్) మాట్లాడే తీరుతో దేవికి మండిపోయింది…
నా స్టూడియో నుంచి గెటవుట్ అనేసింది… ఏదో అభ్యంతరపెట్టబోయాడు… ఆమె స్థిరంగా తన మాట మీద నిలబడింది… ఆ సేనుడు స్టూడియో వీడి వెళ్లిపోయాడు… అయితే ఇప్పటికీ ఇది నిజమేనా అనే ఆశ్చర్యమే… సినిమా వాళ్ల ముందు మోకరిల్లి, దాస్యం చేసే మీడియా ఓ హీరోను పట్టుకుని, ఎహె పోరా అని స్టూడియో నుంచి గెంటేసిన సీన్ నిజమేనా అనే ఆశ్చర్యమే…
మామూలుగా యాంకర్లో, ప్రజెంటర్లో అడిగే ప్రశ్నలు నచ్చక కొన్నిసార్లు గెస్టులు మైకులు పీకిపారేసి వెళ్లిపోతారు… చాలా చూశాం… కానీ ఓ గెస్టుకు గేటును చూపుడువేలితో చూపించడం మాత్రం సినిమా-మీడియాకు సంబంధించి సంచలనమే… ఇక్కడ దేవిని మెచ్చుకోవచ్చు… అయితే ఇది ప్రసారం అయ్యిందా..? తెలియదు… కానీ దీనికి స్టికాన్ అయి ఉంటే టీవీ9 చానెల్‌ను, ఆ ఎడిటోరియల్ టీంను, దేవి స్పాంటేనియస్ కరెక్ట్ రియాక్షన్‌ను, టెంపర్‌మెంట్‌ను మెచ్చుకోవాలి…
ఈ ఎపిసోడ్‌లో మాత్రమే కాదు… విష్వక్సేన్ ధోరణి ఫస్ట్ నుంచీ అంతే… గతంలో పలుసార్లు వల్గర్ పదాల్ని వాడి విమర్శల పాలయ్యాడు… ఐనా తను మారలేదు… మారడు… నిజమే, టీవీ9 తన కథనంలో చెప్పినట్టు పెద్ద పెద్ద హీరోలు కూడా పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు… అణకువ, మర్యాద నటిస్తుంటారు… ఈ నటుడికి అది కూడా లేదు… అన్నట్టు ఆ డిబేట్‌లో ఉన్న చిట్టిబాబు అనే చిన్నమెదడు వ్యక్తి ఎవరో…!!
దేవి అప్పటికప్పుడు ఓ హీరోను స్టూడియో నుంచి గెటవుట్ అంటే అన్నదేమో… కానీ టీవీ9 చానెల్ ఆమెకు సమర్థనగా నిలబడిన తీరు అభినందనీయం… (ప్రత్యక్ష ప్రసారం)… సినిమావాళ్ల ఒత్తిళ్లకు తలొగ్గి మళ్లీ వాళ్ల పాదాల దగ్గర మోకరిల్లకుండా చానెల్ పాత్రికేయం టెంపర్‌మెంట్‌ను నిలబెట్టుకోవాలని ఆశిద్దాం… (చానెల్ తమ స్మార్ట్ న్యూస్ ప్రోగ్రాంలో సదరు ప్రాంక్ వీడియో మీద ఓ సెటైరిక్ స్కిట్ చేసింది… బాగుంది…) కొంపదీసి టీవీ9 రచ్చ కూడా ఇంకో టైప్ ప్రాంక్ కాదు కదా… ప్రతీది డౌటాల్సి వస్తోంది…
Share this Article