ఎట్టకేలకు విరాటపర్వం సినిమాకు మోక్షం దొరికినట్టు కనిపిస్తోంది… సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తామో ఈరోజు సాయంత్రం వెల్లడిస్తామని దర్శకుడు ఊడుగుల వేణు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు తాజా అప్‌డేట్… అంటే, థియేటర్లలో రిలీజ్ చేస్తారా? ఓటీటీలో రిలీజ్ చేస్తారా తెలియదు… కానీ మొత్తానికి సినిమా ‘‘మిస్టరీ బంధనాల్ని’’ తెంచుకోబోతోంది సంతోషం… ఎందుకు అంటే..? ఊడుగుల వేణు తెలుగు ఇండస్ట్రీలో ఓ డిఫరెంట్ డైరెక్టర్…
రొడ్డకొట్టుడు, దంచికొట్టుడు డైరెక్టర్ కాదు తను… థింకర్… ఈ సినిమా కూడా కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ… అదీ నక్సలైట్ల నేపథ్యంలో… రివల్యూషన్ కూడా ఓ ప్రేమ కార్యమే… Revolution is an act of love… అనే కాన్సెప్టును పరిచయం చేస్తున్నాడు… ఎందరికి అర్థం అవుతుంది, అర్థమయ్యేలా చెప్పగలిగాడా అనేది పెద్ద ప్రశ్న…
Ads
సినిమాలో సాయిపల్లవి ప్రధానపాత్ర… నిజానికి ఆమె చేతిలో ప్రస్తుతం ఏ సినిమాలు లేవు… లవ్‌స్టోరీ, శ్యామసింగరాయ్ తరువాత ఈ సినిమా ఒక్కటే విడుదలకు బాకీ ఉంది… ఇందులో రానా, నందితాదాస్, ప్రియమణి తదితరులు నటించేసరికి… అదీ సురేష్ ప్రొడక్షన్స్ బ్యాకింగ్ అనేసరికి చాలా ఆసక్తి క్రియేటైంది… కానీ..?
అప్పుడెప్పుడో నాలుగేళ్ల క్రితం స్టార్టయిన సినిమా… షూటింగ్ పూర్తి అంటారు… కానీ రిలీజ్ కాదు… అబ్బే, కరోనా కదా, నాలుగు రోజులాగి రిలీజ్ అంటారు… కాదు… ఎక్కడో ఏదో భారీ తేడా కొడుతోంది… పలు సీన్లు రీషూట్ చేశారట… సురేష్ ప్రొడక్షన్స్ అధినేతకు అసంతృప్తి అట… అప్పుడే ఓటీటీ రిలీజ్ అంటారు, నో, నో, థియేటర్లలోనే రిలీజ్ అంటారు… అది తెగదు, ఇది రిలీజ్ కాదు…
తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ల సమస్య భగభగ మండిన కాలం నాటి కథ ఇది… అయితే ఈ సినిమా కథాంశం మీద కూడా చాలా ప్రచారాలు సాగాయి… నయీం చేతుల్లో దారుణంగా పాశవిక హత్యకు గురైన ప్రజాగాయకురాలు బెల్లి లలిత కథ అన్నారు కొన్నాళ్లు… కాదులే, మరెవరో లేడీ నక్సలైట్ భారతక్క అన్నారు కొన్నాళ్లు… చూద్దాం, సస్పెన్స్ చాలారోజులు ఆగదుగా…
అసలు సాయిపల్లవి పాత్ర ఏమిటనేదే ఆసక్తికరం… అప్పట్లో వెన్నెల అనే మహిళ నక్సలైట్లలో చేరడానికి అడవుల్లోకి పయనం కట్టింది… తరువాత ఏమైంది..? ఆ వెన్నెల బతుకు అన్నల ఆధిపత్యంలోని ఆ అడవుల్లో తెల్లారిపోయింది… ఈ కథ విని నక్సలైట్ల ఉద్యమం మీద సానుభూతి ఉన్నవాళ్లు కూడా నివ్వెరబోయారు… అది ఓ గన్… దానికి ఎమోషన్, విచక్షణ గట్రా ఏముంటాయి..? అనేకానేక తప్పుటడుగుల్లో అదీ ఒకటి…
మరి ఈ విభిన్న కథాంశం మీద దగ్గుబాటి సురేష్‌కు నమ్మకం, ప్రేమ ఎలా కుదిరాయి… తను అసలే ప్యూర్ కమర్షియల్ వ్యాపారి… ఈ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు గట్రా పెద్దగా పట్టవు కదా… అదీ దంచికొట్టుడు తరహా కేరక్టరే కదా… ఊడుగుల వేణుకూ సురేష్‌కూ సాపత్యం ఎలా కుదిరిందబ్బా అని ఆశ్చర్యపడ్డారు చాలామంది… దానికి తగినట్టే సీన్ల రీషూట్స్, ఎంతకూ తేలని రిలీజ్… ఎలాగైతేనేం..? ఏదో రిలీజ్ తేదీ చెబుతాం అంటున్నారు కదా… చూడాలి… అసలే భిన్న కథాంశాల కోసం, సెన్సిబుల్ కంటెంట్ కోసం, ప్రయోగాల కోసం మొహం వాచిపోయి ఉంది తెలుగు సినిమా…!!
Share this Article