రౌద్రం, కాఠిన్యం, కసి, కోపం, ప్రతీకారం రగిలే కొన్ని పాత్రలకు చాలామంది హీరోయిన్లు సూట్ కారు… ఆ మొహాల్లో ఆ ఉద్వేగాలు బలంగా ఎక్స్పోజ్ కావు… మరీ ఎక్స్పోజింగ్ పాత్రలు తప్ప ఇంకేమీ చేయని టైంపాస్ పల్లీబఠానీ హీరోయిన్లకు అస్సలు చేతకాదు… కానీ కీర్తి సురేష్ అలా కాదు… ఆమెలో తల్లి వారసత్వం ఉంది… ఏ ఎమోషనైనా సరే ఆ మొహంలో బలంగా ఆవిష్కరించగలదు… ప్రేమ, రొమాన్స్ గానీ… రౌద్రం గానీ… మహానటిలో ఆమెను చూశాం కదా… జాతీయ అవార్డు కూడా అందుకుంది కదా…
ఆ తరువాత ఏమైంది..? ఏవేవో పాత్రలు… అందులో కొన్ని కథానాయిక ప్రాధాన్యం ఉన్నవే… కానీ బలమైన కథ లేకపోవడం, కథను బలంగా ప్రజెంట్ చేయలేకపోవడం, కేరక్టరైజేషన్లోపాలు ఎట్సెట్రా అనేక కారణాలు ఉండవచ్చుగాక… కానీ కీర్తి ఏ పాత్ర ఎంచుకున్నా ఆమె ఆ పాత్రకు బలం… కొన్ని గ్లామర్ పాత్రలు చేసినా పెద్దగా ఆమెకు ఇమేజీపరంగా ఏమీ కలిసిరాలేదు… కానీ మళ్లీ ఓ చాన్స్ దొరికింది ఆమెకు చిన్ని అనే పాత్ర రూపంలో…
సినిమా లైన్ చూస్తే సింపుల్… ఓ మహిళకు జరిగిన అన్యాయం, వ్యవస్థలో న్యాయం జరగకపోతే ఇక తనే ప్రతీకారం తీర్చుకోవడం… చాలా సినిమాల్లో చూసిందే… కానీ దర్శకుడు కొత్తగా ప్రజెంట్ చేశాడు… కథలో అక్కడక్కడా కొన్ని లోపాలు ఉండవచ్చుగాక… కానీ కీర్తి సురేష్ అవన్నీ అధిగమించేసింది… మొత్తం సినిమాను తనే భుజాన మోసింది… కోపం, బాధ, కక్ష, కాఠిన్యం, రౌద్రం ఎక్కడా తగ్గలేదు… ఎమోషన్స్ బలంగా ఎలివేటయ్యాయి…
Ads
కీర్తి సురేష్… హీరోయిన్ కాదు, హీరో… డీగ్లామరైజ్డ్ పాత్ర… నడక, మాట, చూపు అన్నీ ఓ కొత్త కీర్తిని చూపిస్తాయి… డాన్సుల పేరిట గంతుల్లేవ్, గ్లామర్ పేరిట పిచ్చి పిచ్చి డ్రెస్సులు లేవు, పంచ్ డైలాగులు లేవు, వెకిలి చూపుల్లేవు… కానీ చూపు తిప్పనివ్వదు ఆమె… భేష్… ఆమే ఈ సినిమా… ఆమె లేకపోతే ఆ సినిమా లేదు… అంతే… ఇది తమిళంలో తీసిన పాత్ర… ఆమె తప్ప వేరే పాత్రధారులు అంతా మనకు కొత్త కొత్త… సీన్లు కూడా నేచురాలిటీని నమ్ముకున్నాయి… తమిళంలో ఈ సినిమా పేరు సాని కాయిదం… తెలుగులోకి చిన్ని పేరిట డబ్ చేశారు… అమెజాన్ ప్రైమ్‌లో పెట్టారు… ఇప్పుడు మార్కెట్లో ఉన్న సినిమాలకు ఇది టోటల్లీ డిఫరెంట్ అండ్ చూడబుల్… కాకపోతే..?
అసురన్, కాలా, కర్ణన్ తరహాలో ఇందులోనూ కులవివక్ష, అగ్రవర్ణ ఆధిపత్యం… కీర్తి పాత్ర ఓ కానిస్టేబుల్, భర్త మారెప్ప ఓ రైస్ మిల్లులో పనిచేస్తుంటాడు… ఏదో అంశంపై మాటామాటా పెరిగి, తన భార్యను కించపరచడంతో ఓ అగ్రవర్ణ వ్యక్తి మొహంపై ఉమ్మేస్తాడు… ఇంకేముంది..? కసి రగులుతుంది… మారెప్ప, కూతురు ఇంట్లో ఉన్నప్పుడే ఇల్లు కాల్చేస్తారు, చిన్నిపై అత్యాచారం… మొత్తం ఆమె జీవితం ఒక్కసారిగా తల్లకిందులై పోతుంది…
న్యాయం దొరికే అవకాశాలు కనిపించక… ఇక ఆమే తన సవతి సోదరుడు రంగయ్య (సెల్వ రాఘవన్) సాయం తీసుకుని, ప్రతీకారానికి దిగుతుంది… నిజానికి మొదట్లోనే భర్తను చంపేసి, ఇక ఆమె ప్రతీకారం తీసుకోవడం అనే పాయింట్‌ను సినిమా చివరి దాకా చూసేలా చిత్రీకరించడం ఓ పెద్ద టాస్క్… దర్శకుడు తన ప్రజెంటేషన్ వైవిధ్యంతో దాన్ని సాధించగలిగాడు…
బలమైన విలన్లు గనుక ఉండి ఉంటే… కథ, సినిమా, కీర్తి నటన ఇంకో రేంజుకు వెళ్లిపోయేవేమో… ఒకటి చెప్పుకోవాలి విశేషంగా… మౌనం కొన్నిసార్లు ఎక్కువ ఎమోషన్స్ పలికిస్తుంది… ఎక్కువ మాట్లాడుతుంది… ఎక్కువ ఆవిష్కరిస్తుంది… బీజీఎం అనగానే సౌండ్ బాక్సులు బద్ధలయ్యేలా డబడబ వాయించేయడం కాదు… ఈ సినిమాలో పలుచోట్ల సైలెన్స్ కూడా ఎక్కువ ఇంటెన్సిటీని తీసుకొచ్చింది… ప్రిక్లైమాక్సులో కీర్తి ఓ వ్యాన్ నడిపించే సీన్ హైలైట్…
సినిమాలో మైనస్సులు లేవా..? ఉన్నయ్… సీరియస్ సినిమా… విపరీతమైన వయోలెన్స్… ఓటీటీ కదా, అడ్డూఅదుపూ లేదు… పిల్లలు ఈ సినిమాలో హింసను తట్టుకోలేరు… ఈ కథకు అలా చూపించడమే కరెక్టని దర్శకుడు భావించాడేమో కానీ ప్రేక్షకుడే అక్కడక్కడా కళ్లుమూసుకునేంత తీవ్రత అవసరం లేదు… మొత్తానికి ఇది చూడబుల్ సినిమా… కీర్తి సురేష్ కోసమైనా…!!
Share this Article