ఇదేరోజు థియేటర్లలో విడుదలైన జయమ్మ పంచాయితీ, అశోకవనంలో అర్జునకల్యాణం, ఓటీటీలో విడుదలైన చిట్టి సినిమాల విశ్లేషణలు, కథనాల నడుమ ఫాఫం భళా తందనాన అనే సినిమా గురించిన చర్చ కనిపించకుండా పోయింది… నిజానికి తీసిపారేయదగిన సినిమా ఏమీ కాదు ఇది… మరీ నాసిరకం అని ఛీకొట్టాల్సిన పనిలేదు… కాకపోతే దర్శకుడి వైపు నుంచి ఓ సందిగ్ధత సినిమాను దెబ్బతీసినట్టు అనిపిస్తుంది…
దర్శకుడు దంతులూరి చైతన్య… మొదట్లో బాణం… ఎవరబ్బా ఈ కొత్త దర్శకుడు అనిపించేలా కాస్త పర్లేదు… తరువాత బసంతి ఎక్కడో తేడా కొట్టేసి, చెడ్డ పేరు తెచ్చిపెట్టింది… సరిగ్గా ఇక్కడే దర్శకుడిలో ఓ డైలమా… ఏ జానర్ వైపు వెళ్లాలి అని… నిజానికి ఈతరం ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు..? ఒక జానర్లో సినిమా ఎక్స్పెక్ట్ చేస్తే ఆ ఇంటెన్సిటీయే చూస్తారు… అది కామెడీ గానీ, సీరియస్ హారర్ గానీ, క్రైం థ్రిల్లర్ గానీ, ఫ్యామిలీ ఎంటర్టెయినర్ గానీ…
ఉదాహరణ ఏమిటంటే..? జాతిరత్నాలు, డీజీ టిల్లు… లాజిక్కులు, తొక్కతోలు ఏమీ చూడరు ప్రేక్షకులు… పంచ్ ఫన్నీ డైలాగులు, సరదా సరదాగా కథనం… అంతే… రెండూ సూపర్ హిట్… చైతన్య ఓ మాంచి క్రైమ్ కథే రాసుకున్నాడు… 2 వేల కోట్ల హవాలా డబ్బు, దానితో ముడిపడిన హీరో కథ… వరుస హత్యలు… ఓ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో దాన్నలాగే మంచి సీన్లు రాసుకుని తీసేస్తే బాగుండేదేమో… కానీ తెలుగు సినిమా అనేసరికి పాటలు ఉండాలి, ఫైట్లు ఉండాలి, ప్రేమ కథ ఉండాలి, కామెడీ ఉండాలి అనే పాత తరహా భ్రమకు గురయ్యాడు…
Ads
దాంతో అన్నీ కూర్చాడు… కలగూరగంప అయిపోయింది, ఒరిజినల్ టేస్ట్ కనిపించకుండా పోయింది… లెక్కతప్పింది… వంట చెడిపోయింది… అదీ ఈ సినిమా మీద యావరేజ్ ముద్ర పడటానికి కారణం… ఐనా ఇవ్వాళ్రేపు పాటల కోసం ఎవడు ఎదురుచూస్తున్నాడు..? కామెడీ స్కిట్స్ ఎవడికి కావాలి..? మరీ సూపర్ హిట్ అయితే తప్ప, పాటలు సినిమాకు బలం కావు… పైగా మణిశర్మ పెద్దగా క్లిక్ కావడం లేదు… నిజానికి మంచి బీజీఎం సినిమాను బలంగా ఎలివేట్ చేస్తుంది… అఖండలో చూశాం కదా… ప్చ్, ఈ సినిమాలో అదీ వర్కవుట్ కాలేదు…
శ్రీవిష్ణు ఉన్నంతలో కాస్త డిఫరెంట్ కథల్నే ఎంచుకుంటాడు… తనకు చేతనైనకాడికి మ్యాగ్జిమం ఇచ్చే ప్రయత్నం సిన్సియర్‌గానే చేస్తాడు… ఇక్కడా చేశాడు… కానీ కథాకథనాలు పేలవంగా ఉండటం, సినిమా కలగూరగంప కావడంతో తన శ్రమ వృథా అయినట్టుంది… ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా చేసిన హీరోయిన్ కేథరిన్… బొద్దుగా పర్లేదు గానీ ఆమె డబ్బింగ్ సినిమాకు మైనస్… చివరలో చూసుకుని దర్శకుడు వేరే వాయిస్ ఓవర్ పెట్టాల్సింది… ఈ కథకు సీక్వెల్ కూడా ఉంటుందని సినిమా టీం చివరలో చెప్పింది… తప్పులేదు, కాకపోతే ఒకే జానర్‌కు కట్టుబడి ఉంటే బెటర్… అంతే… !!
Share this Article