పార్ధసారధి పోట్లూరి…… రష్యా నౌకా దళానికి మరో ఎదురు దెబ్బ తగిలింది ! అడ్మిరల్ గ్రిగోరోవిచ్ క్లాస్ ఫ్రిగేట్ ‘’ అడ్మిరల్ మాక్రోవ్ ‘’ [Grigorovich-class frigate “Admiral Makarov]అనే పేరు కల ఫ్రిగేట్ ని ఉక్రెయిన్ కి చెందిన యాంటీ షిప్ మిసైళ్లు ‘నెప్ట్యూన్ ‘ లు దాడి చేసి తీవ్ర నష్టంని కలుగచేశాయి ! కడపటి వార్తలు అందే సమయానికి అడ్మిరల్ మాక్రోవ్ నల్ల సముద్రంలో మంటలతో పోరాడుతున్నది కానీ మునిగిపోలేదు.
అడ్మిరల్ మాక్రోవ్ అనే ఫ్రిగేట్ రష్యా నావీకి చెందిన అత్యాధునిక యుద్ధ నౌక. 2017 లో జల ప్రవేశం చేసింది ! రష్యాకి చెందిన అత్యాధునిక రాడార్లు, క్రూయిజ్ మిసైళ్లు కలిగి ఉంది. కానీ ఏప్రిల్ 24 న క్రూయిజర్ మాస్కోవ ని ఎలా అయితే దాడి చేసి ముంచేసిందో అదే తరహాలో అడ్మిరల్ మాక్రోవ్ మీద దాడి చేసింది ఉక్రెయిన్.
ఏప్రిల్ 24 న మాస్కోవా మీద దాడి జరిగిన తరువాత రష్యా తన నౌకాదళాన్ని ఉక్రెయిన్ తీరం నుండి దూరంగా జరిపింది అంటే యాంటీ షిప్ మిసైళ్ళ పరిధి లోకి రాకుండా దూరంగా పెట్టింది కానీ అలా చేసినా కూడా అడ్మిరల్ మాక్రోవ్ మీద దాడి జరిగినది. మాస్కోవా మీద జరిగినట్లుగానే మాక్రోవ్ మీద కూడా టర్కిష్ డ్రోన్లు దాదాపుగా 100 కిలోమీటర్ల దూరం నుండి లేజర్ బీమ్ ని మాక్రోవ్ రాడార్ల మీదకి ఫోకస్ చేసి వాటి దృష్టి మరల్చి మరీ నెప్ట్యూన్ లు దాడి చేశాయి.
Ads
రష్యన్ రాడార్ల లోపాలని ఉక్రెయిన్ తో సహా నాటో దేశాలు గుర్తించాయా ?
సాధారణంగా సముద్రం మీద రాడార్ల పరిధి తక్కువగా ఉంటుంది ఎందుకంటే భూమి వంపు [Horijon] కారణంగా అందుకే యాంటీ షిప్ మిసైళ్లు సముద్ర జలాల మీద 20 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి రాడార్ లు పసిగట్టకుండా ఉండడానికి. ఇది అందరికీ తెలిసిన విషయమే… కానీ ఆధునిక టెక్నాలజీ అమలులోకి వచ్చిన తరువాత సీ స్కీమ్మింగ్ చేసే యాంటీ షిప్ మిసైళ్ళ ని కూడా పసిగట్టే టెక్నాలజీ అభివృద్ధి చేశారు కానీ ఈ విషయంలో రష్యా వెనకపడ్డట్లుగా ఉంది. రష్యన్ క్రూయిజర్ లు కానీ,ఫ్రిగేట్ లు కానీ సముద్ర ఉపరితలం నుండి భూమి మీదకి దాడులు చేయగలుగుతున్నాయి సమర్ధవంతంగా… కానీ తమ మీదకి వచ్చే మిసైళ్ళ నుండి తమని తాము కాపాడుకోవడంలో విఫలం అవుతున్నాయి. సరిగ్గా ఇక్కడే రష్యన్ నావీ రాడార్లలోని లోపాలని పసిగట్టారు నాటో దేశాల వ్యూహకర్తలు.
నిజంగా ఉక్రెయిన్ నెప్ట్యూన్ మిసైల్ ని ఆధునాతనంగా అభివృద్ధి చేసిందా ?
యుద్ధ వాతావరణం ఉన్న స్థితిలో ఉక్రెయిన్ ఆ పని చేయలేదు. కానీ అమెరికా సహరిస్తున్నది ! ఉన్న పాత తరం నెప్ట్యూన్ మిసైళ్లని అమెరికా తన టెక్నాలజీ తో పాటు ఆధునిక నావిగేషన్ పరికరాలు అమర్చి ఆ తరువాత మిసైల్ లో వాడే ఎక్స్‌ప్లోజివ్ మెటీరీయల్ ని కూడా ఇస్తున్నది ఉక్రెయిన్ కి. దానితో పాటు అమెరికన్ ఉపగ్రహాలు రష్యన్ ఫ్రిగేట్ లు నల్ల సముద్రంలో ఎక్కడ ఉన్నదీ ఖచ్ఛితమయిన సమాచారం ఇస్తున్నది అదీ కాక మిసైల్ లో అమెరికన్ నావిగేషన్ సిస్టమ్ ని అమర్చడం వలన శాటిలైట్ ఇచ్చిన ప్రదేశాన్ని ఖచ్చితంగా ఛేదించగలుగుతున్నాయి టార్గెట్ ని.
రష్యన్ కమాండర్లు చేస్తున్న తప్పులు ?
సముద్రం మీద ఉండే యుద్ధ నౌకలు నిత్యం ఒక చోట స్థిరంగా ఉండకుండా ప్రయాణిస్తూ ఉంటాయి కాబట్టి ఒకసారి ఒక యుద్ధ నౌక ఎక్కడ ఉందో గుర్తించి ఆ సమాచారం కమాండ్ సెంటర్ కి ఇవ్వడానికి, ఆపై ఆ ప్రదేశంలో దాడి చేయడానికి మిసైళ్ళని సిద్ధం చేయడానికి పట్టే సమయం ఎంత తొందరగా చేసినా కనీసం 8 నుండి 10 నిముషాలు… మిసైల్ లాంచ్ చేయడానికి కానీ… ఈలోపు ఆ యుద్ధ నౌక ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోతుంది. ఇది యుద్ధ నౌకల కోసం ఇచ్చే శిక్షణలో భాగంగా శత్రు దేశపు యాంటీ షిప్ మిసైల్ దాడి నుండి తప్పించుకోవడానికి నేర్చుకునే ప్రధమ పాఠం ! కానీ మాస్కోవా కావొచ్చు శనివారం రోజున దెబ్బతిన్న మాక్రోవ్ ఫ్రిగేట్ కావొచ్చు రెండూ కూడా ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉన్నట్లుగా ఉంది.
మాస్కోవా మీద ఏప్రిల్ 24 న దాడి చేయడానికి వారం రోజుల పాటు ఉక్రెయిన్ డ్రోన్ లు రెక్కీ నిర్వహించాయి మాస్కోవా కదలికల మీద. ఆ రెక్కీలో తేలిన విషయం ఏమిటంటే మాస్కోవా ఎప్పుడూ ఒకే పాటర్న్ లో తిరుగుతున్నది. ఉదాహరణకి మన మొబైల్ ఫోన్ ని అన్ లాక్ చేయడానికి పాటర్న్ ని ఎలా వాడుతామో సరిగ్గా అలాగే ఒకే తరహాలో ఒకే ప్రాంతంలో ఒకే పాటర్న్ లో గస్తీ కాస్తూ వచ్చింది మాస్కోవా… దాంతో ఉక్రెయిన్ మొదట శాటిలైట్ సమాచారం మరో 10 నిముషాల తరువాత మాస్కోవా ఎక్కడ ఉంటుందో ఖచ్చితంగా అంచనా వేసి దాడి చేసింది. అది విజయవంతం అయ్యింది. శనివారం రోజున కూడా అడ్మిరల్ మాక్రోవ్ కూడా అదే రీతిలో తిరుగుతూ గస్తీ కాస్తున్న సమయంలో దాడి చేసింది ఉక్రెయిన్ ! మరింత ఖచ్ఛితత్వం కోసం దూరం నుండి టర్కిష్ బైరాక్టర్ B 2 B డ్రోన్లు లేజర్ బీమ్ ని ఫోకస్ చేయడంతో మిసైళ్ళ పని సులభం అయ్యింది!
రెండో సారి కూడా CIWS [Close In Weapon System ] విఫలం అయ్యింది !
అధునాతన రష్యన్ ఫ్రిగేట్ అడ్మిరల్ మాక్రోవ్ మీద ఉన్న CIWS మళ్ళీ విఫలం అయ్యింది అంటే దాని పనితీరులో చాలానే లోపాలు ఉన్నట్లు అర్ధం అవుతున్నది ! మాస్కోవా మీద దాడి జరిగినప్పుడు CIWS పనిచేయలేదు అంటే ఏదో ఒకసారి విఫలం అయినట్లు భావించవచ్చు కానీ రెండో సారి కూడా ఎందుకు విఫలం అయ్యింది ? మాస్కోవా అంటే సోవియట్ కాలం నాటిది కానీ దానిని అప్ గ్రేడ్ చేయలేదు కాబట్టి విఫలం అయ్యింది కానీ అడ్మిరల్ మాక్రోవ్ 3వ జెనెరేషన్ కి చెందినది, అత్యాధునికమయినది కూడా… కానీ ఇతర రాడార్లతో పాటు CIWS విఫలం అయ్యింది.
అడ్మిరల్ మాక్రోవ్ మీద ఉన్న ఎయిర్ డిఫెన్స్ ఎందుకు పనిచేయలేదు ?
అడ్మిరల్ మాక్రోవ్ ఫ్రిగేట్ ఇప్పటి వరకు ఉక్రెయిన్ మీద చేసిన యుద్ధంలో ప్రముఖ పాత్ర వహించింది ! ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో మొదలుపెట్టి తీరానికి దగ్గరలో ఉన్న మారిపోల్ రీజియన్ లో ఉన్న టార్గెట్లని నల్ల సముద్రంలో మాక్రోవ్ లో ఉన్న కాలిబర్ [Kalibr cruise missiles] క్రూయిజ్ మిసైళ్ళ తో వందల కొద్దీ టార్గెట్లని నాశనం చేసింది. ఇక మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ మిసైల్ లాంటిదే రష్యా దగ్గర కూడా ఉంది దాని పేరు ఓనిక్స్ [Oniks]. ఓనిక్స్ ని కూడా ఉక్రెయిన్ మీద దాడికి ఉపయోగించింది మకరోవ. 4,000 టన్నుల బరువు కల మాకరోవ ఫ్రిగేట్ ఉక్రెయిన్ తీర ప్రాంతం అయిన ఒడేస్సా [ODESSA] ని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో భాగంగా స్నేక్ అయిలాండ్ దగ్గర అక్కడికి టాంకులు, సైనికులని తరలించే లాండింగ్ షిప్ లకి రక్షణగా ఉన్న సమయంలో దాడి జరిగినది.
ఊహాగానాలు కాదు !
రష్యన్ నావీ దాడి చేయగలదు ! కానీ యాంటీ షిప్ మిసైళ్ళ దాడి నుండి తమని తాము రక్షించుకోలేవు ! ఇది నిజం ! అందుకే ఏప్రిల్ 24న క్రూయిజర్ మాస్కోవా దాడిలో కనీసం 200 మంది మరణించారు అందులో ఉన్న సిబ్బంది ! దాంతో రష్యా నల్ల సముద్రంలో ఉన్న తన నౌకలని అన్నిటినీ ఉక్రెయిన్ తీరం నుండి 200 మైళ్ళ దూరంలో ఉండాల్సిందిగా ఆదేశించింది అంటే అర్ధం ఏమిటి ? ఉక్రెయిన్ యాంటీ షిప్ మిసైళ్ళ రేంజ్ కి అందకుండా ఉండడానికే !
రష్యా ఇప్పటి వరకు తన అసలు అధునాతన ఆయుధాలు బయటికి తీయలేదు !
ఇది ప్రధానంగా రక్షణ రంగ నిపుణులు చేస్తున్న వ్యాఖ్య ! సరే ! ఒప్పుకుందాం ! మరి ఇప్పటివరకు రష్యా కోల్పోయిన రెండు ప్రధాన యుద్ధ నౌకలు వాటిలో పనిచేస్తున్న సిబ్బంది మాటేమిటీ ? ఒక ఫ్రిగేట్ కానీ లేదా క్రూయిజర్ కానీ తయారు చేయాలంటే హీనపక్షం 8 ఏళ్లు పడుతుంది. డిజైన్ చేయడానికే రెండేళ్ళు పడుతుంది ఆపై దానిని నిర్మించడానికి మరో అయిదేళ్లు పడుతుంది ఆపై పరీక్షలు చేసి జలప్రవేశం చేయిస్తారు. అదే సమయంలో సిబ్బందికి ఆ నౌకాల మీద శిక్షణ ఇవ్వాలి దానికి కనీసం రెండేళ్ళు పడుతుంది.
అనుభవం ఉన్న సిబ్బంది చనిపోతే మళ్ళీ వాళ్ళని భర్తీ చేయడం చాలా కష్టం. అందుకే యుద్ధ విమాన పైలట్ ఆ విమానం కూలిపోయినా ఫరవాలేదు కానీ వందల గంటల అనుభవం ఉన్న పైలట్ చనిపోకూడదు అని కోరుకుంటారు అధికార్లు. ఎందుకంటే ఆ అనుభవం ఉన్న వాళ్ళని తయారు చేయాలంటే మళ్ళీ వందల గంటల శిక్షణ అవసరం పడుతుంది ! అనుభవం అనేది చాలా విలువయినది ! డబ్బుతో కొనలేరు ఎవ్వరూ ! వేల కోట్ల డాలర్లు విలువ చేసే ఫ్రిగేట్ ల కన్నా దానిలో పనిచేసి అనుభవం ఉన్న సిబ్బంది చాలా విలువయిన వాళ్ళు ! మరి రష్యా ఎందుకు కోల్పోతున్నది ?
ఇప్పుడు దాడికి గురి అయిన అడ్మిరల్ మకారోవ ఫ్రిగేట్ తరగతి చెందిన ఫ్రిగేట్ లు తల్వార్ క్లాస్ ఫ్రిగేట్ లుగా మన నావీలో ఉన్నాయి ! ఇవి రష్యా నుండి కొన్నవే ! మొత్తం 6 తల్వార్ క్లాస్ ఫ్రిగేట్ లు రష్యా నుండి కొన్నాం మనం. అడ్మిరల్ మకరోవ లాంటివే ఇవన్నీ ! అయితే మన తల్వార్ క్లాస్ ఫ్రిగేట్ లు సురక్షితమా?
Share this Article