ప్రపంచంలో చాలారకాల మనుషులుంటారు… కొందరు ఎక్స్ట్రీమ్… మందకు ఎడంగా నడిచే బాపతు… అయితే పిచ్చోళ్లు లేకపోతే మేధావులు… అరుదుగా వర్మ వంటి కొత్త కేటగిరీ ఉంటుంది… అందరూ రాసీ రాసీ, చూపీ చూపీ, అడిగీ అడిగీ వర్మ మీద ఏదేదో టన్నుల కొద్దీ చెప్పారు కాబట్టి తన తత్వం లోతుల్లోకి వెళ్లే సాహసం మనం ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు… తను కూడా ఎప్పటికప్పుడు తిక్క (?) చేష్టలతో వార్తల్లో ఉంటాడు కాబట్టి తన వ్యవహార ధోరణి మర్మమేమిటో మనం చెప్పుకునే పనేమీ లేదు… తనొక అనార్కీ… అంతే…
తను మారడు, అరవయ్యేళ్లు వచ్చినయ్, ఇంకేం మారతాడు అంటారా..? చెప్పలేం… కొన్నిసార్లు పర్వర్షన్ రివర్స్ గేర్‌లో కూడా పనిచేస్తుందని అంటారు… అంతటి చలం ముసలితనంలో చక్కగా వెళ్లి రమణ మహర్షి ఆశ్రమంలో సాధుజీవనం గడపలేదా..? నిజానికి ఓ డిఫరెంట్ ప్రచారాన్ని ఇష్టపడే వర్మ ఎవరడిగినా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంటాడు… వాళ్లేదో అడుగుతారు, ఈయనేదో చెబుతాడు… కానీ తను తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు…
అడిగిన ప్రశ్నలే అడుగుతారు, ఇప్పటికి అనేకసార్లు చెప్పిన అంశాల మీదే పదే పదే ప్రశ్నలడుగుతారు… చూసేవాడికి బోర్… మరేం చేస్తాం..? మంచి ఇంటర్వ్యూయర్, అనగా వర్మ ఫ్రీక్వెన్సీ దరిదాపుల్లోకి వెళ్లి, నిజంగా తనను జవాబులు చెప్పడానికి తడుముకునేలా, తడబడేలా చేయగల ‘మంచి తాకుడు ఇంటర్వ్యూయర్’ దొరకలేదు తనకు… దొరికితే నిజంగా ఎంజాయ్ చేస్తాడు తను… అలాంటోడు కావాలని కోరుకుంటున్నాడు తను… తను బోర్ ఫీలవుతున్నాడు… అసంతృప్తిగా ఉన్నాడు… అరె, ఏం ప్రశ్నలు అడుగుతార్ర భయ్ అని నేరుగా మొహం మీదే అడిగేస్తున్నాడు…
Ads
ఈటీవీలో ఆలీతో సరదాగా అనే షో వస్తుంది తెలుసు కదా… పాత యాక్టర్లను పట్టుకొచ్చి, కూర్చోబెట్టి, పాత ముచ్చట్లు సొదపెట్టి, వాళ్లను ఏడిపించి, ఆ ప్రోమోలు కట్ చేసి, తన తిప్పలేవో తను పడుతుంటాడు… బేసిక్‌గా ‘సరదాగా’ సాగాల్సిన షో… ఆ షో బేసిక్ కేరక్టర్ అదే… సోమవారం ఆలీతో సరదాగా షోలో వర్మ పార్టిసిపేట్ చేశాడు… తను బాగా ప్రశ్నలడుగుతానని ఆలీలో ఏ మూలో ఏమైనా అహం ఏమైనా ఉంటే, దాన్ని మొత్తం కడిగేశాడు వర్మ…
గంటసేపు వచ్చిన షోలో కనీసం నాలుగైదుసార్లు మొహం మీదే దులిపేశాడు… ప్రశ్నలు బాగా లేవని… చెప్పీ చెప్పీ బోర్ వస్తోందనీ అన్నాడు… చాలాసేపు సీరియస్‌గా మొహం పెట్టుకుని కూర్చున్నాడు… అలా ఉన్నారేమిటి అనడిగితే నీ ప్రశ్నలు అలా ఏడ్చాయి మరి అన్నట్టుగా ఓ పంచ్ వేశాడు కూడా..! నిజంగానే ఇంత పేలవంగా, దరిద్రంగా నడిచిన షో ఇదేనేమో ఆలీ ఇన్నేళ్ల ఆ ప్రోగ్రాంలో… డౌటుంటే ఇదే ఆలీ, ఇదే వర్మతో గతంలో చేసిన ఇంటర్వ్యూ లేదా చాట్ చూసుకోవాలి… ఆ పాత చాటింగ్ చాలా సరదాగా ఉంది…
ఇప్పుడు తను ఏమడుగుతున్నాడో తనకే తెలియలేదు… నిజానికి ఇది వర్మ తీసిన అదేదో స్త్రీ స్వలింగసంపర్కం సినిమా ఉంది కదా, డేంజరస్… దాని ప్రమోషన్ కోసం ఉద్దేశించిన షోలా అనిపించింది… పోనీ, అదైనా సరిగ్గా చేశారా, అదీ లేదు… నిజానికి ఆ సినిమా వచ్చిందా, రిలీజైందా..? రిలీజ్ కానుందా..? సహజంగానే వర్మ సినిమాలాగే తన్నేసిందా..? ఓటీటీలో పెట్టాడా..? ఈ వివరాలు ఎవరికీ తెలియవు… ఇలాంటి సినిమాలకు డబ్బింగ్ డెడ్ ఈజీ కదా, చకచకా ఒకేరోజులో వాయిస్ ఓవర్ పెట్టేసి హిందీలో రిలీజ్ చేస్తున్నట్టున్నాడు… జూలైలో…
ముప్పావుగంట చెత్తచెత్తగానే సాగిన షో చివరలో కాస్త కలర్‌ఫుల్ అనిపించింది… అప్సర ఫ్రం డెహ్రాడూన్… నైనా గంగూలీ ఫ్రమ్ కోల్‌కతా… ఆ వర్మను పక్కన పెట్టేసి… ఓ తొలి స్వలింగ సంపర్కుల సినిమాలో నటించిన ఈ ఇద్దరితోనే షో నడిపిస్తే వెరయిటీగా, కొత్తకొత్తగా ఉండేది… వెరసి అటూఇటూ గాకుండా పోయింది… వర్మ అరాచకం పేరిట వీడియోలు చూపించాడు మూడు… అవన్నీ ఎప్పుడో వైరల్ అయిపోయి, వర్మను ఛీకొట్టినవే… అదీ నాసిరకం ప్రజెంటేషన్… నేను ఓ మహిళ చుట్టూ తాగి పొర్లాను తెలుసా అన్నాడు వర్మ, ఆ వీడియో కూడా ఉంది అన్నాడు ఆలీ… తీరా ప్లే చేసినప్పుడు అది వేరే వీడియో…
వాస్తవానికి ఆలీ వంటి ఇంటర్వ్యూయర్ వర్మ వేవ్లెంత్కు సూట్ కాడు… అంతటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే ఆనలేదు తనకు… వర్మ బుర్రలో ఇప్పటికీ గుజ్జు ఉంది… మెయిన్ స్ట్రీమ్‌లో ఎవరైనా జాఫర్ వంటి డిఫరెంట్ ఇంటర్వ్యూయర్ తగిలితే అదోతరహాలో ఉండేదేమో… కెమెరాలు పగిలి, ఫోకస్ లైట్లు విరిగి, ఇంటర్వ్యూ అయ్యేటప్పటికి యుద్ధరంగం అయ్యేదేమో స్టూడియో… ఎట్లీస్ట్ టీవీ9 దేవితో ముఖాముఖి ఉన్నా బాగుండేది… గెటవుట్ స్థాయి నుంచి పంచాయితీ ఇంకా ఏ రేంజుకు వెళ్లేదో మరి… లేదా ఇంకెవరైనా లోతుగా, మార్మికాంశాల్లో నిజంగా వర్మ వేవ్లెంత్లోకి వెళ్లి గిచ్చితే, రియల్ వర్మను బయటికి లాగగలిగితే ఇంకా బాగుంటుంది… కానీ జరగడం లేదు… అదే వర్మలో నెలకొన్ని అసంతృప్తి ప్రస్తుతం… ఫాఫం…!!
Share this Article