ట్విస్టులే ట్విస్టులు… మొత్తానికి మాజీ మంత్రి, ప్రముఖ విద్యావ్యాపారి నారాయణ అరెస్టు వ్యవహారం రకరకాల ట్విస్టులతో, భిన్న కథనాలతో రాజమౌళి సినిమాలాగా సాగిపోతోంది… నాలుగు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడని ఒక వార్త… ఎట్టకేలకు తనను, తన భార్యతోసహా అదుపులోకి తీసుకున్నాడని మరో వార్త… టెన్త్ క్లాస్ పరీక్షపత్రాల లీకేజీ కేసు పెట్టారని, ఇప్పటికే కేసులు పెట్టారు కాబట్టి ఇప్పుడు అరెస్టు చేసి ఏపీకి తరలిస్తున్నారని ఇంకో వార్త…
సోషల్ మీడియాలో వార్తలు, ఎఫ్ఐఆర్ కాపీలు చూడగానే మొత్తం తెలుగుదేశం ప్రముఖులు ఎడాపెడా ఖండనలు, ఇదంతా రాజకీయ కుట్ర అని విమర్శలు స్టార్ట్ చేశారు… పత్తిపాటి పుల్లారావు అట ఎవరో టీడీపీ నాయకుడు, ఆయనైతే ఏకంగా నారాయణ అరెస్టు విద్యార్థులకు నష్టం, వెంటనే వదిలేయాలని డిమాండ్… ఇంకా నయం, దేశంలోని విద్యావ్యవస్థకే నష్టం అనలేదు… ఈలోపు మరో వార్త… తమకు సమాచారం ఇవ్వలేదంటూ తెలంగాణ పోలీసులు ఏపీసీఐడీ పోలీసులను అడ్డుకున్నారని దాని సారాంశం…
జస్ట్, ఈ వార్త వచ్చిందో లేదో… మరో ట్విస్టు… నో, నో, ఈ అరెస్టు టెన్త్ పేపర్ల లీకేజీ గురించి కాదు… ఇది అమరావతి భూముల అక్రమాలకు సంబంధించిన కేసు, ఇందులోనే నారాయణ అరెస్టు జరిగిందీ అని మరో వార్త… మంగళగిరి ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైందట… ఓ ఎఫ్ఐఆర్ కాపీ కూడా చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో…
Ads
సోషల్ మీడియా అంటేనే ఫేక్ వార్తలకు అడ్డా కాబట్టి వెంటనే నమ్మలేం… ఏపీసీఐడీ పోలీసులూ ఏమీ మీడియాకు వెల్లడించడం లేదు… ఏపీ ప్రభుత్వవర్గాలు మౌనంగా ఉంటున్నాయి… మాకెందుకొచ్చిన తలనొప్పి అనుకుని తెలంగాణ పోలీసులు సైలెంట్ అయిపోయారు… నారాయణ నివసించే హైదరాబాదులో జరిగిన అరెస్టు కాబట్టి తెలంగాణ పోలీసులు స్పందించి అసలు నిజమేమిటో మీడియాకు చెప్పేస్తే సరిపోయేది…
సదరు ఎఫ్ఐఆర్ నిజమే అయితే… అందులో ఏ1 చంద్రబాబు నాయుడు… ఇన్నాళ్లూ టీడీపీ జగన్‌ను ఏ1, ఏ1 అంటూ వెక్కిరించేది కదా… ఇప్పుడు ఆ ప్లేసులోకి చంద్రబాబును తీసుకొచ్చాడా జగన్..? ఇది అమరావతి భూముల అక్రమాల కేసు… అప్పట్లో ఈ నారాయణ మున్సిపల్ మంత్రి ప్లస్ సీఆర్డీఏ వైస్ చైర్మన్… తను ఏ2… అయితే… ఒక్క నారాయణే కాదు కదా ఈ కేసులో ఉన్నది… లింగమనేని, రామకృష్ణ హౌజింగ్, హెరిటేజ్ సహా బోలెడు మందిని చేర్చారు… చంద్రబాబు భార్య, కూతురు కీలక బాధ్యతల్లో ఉన్నారు ఆ సంస్థలో…
అందరినీ వదిలేసి ఒక్క నారాయణనే మొదట ఎందుకు అరెస్టు చేశారనే ప్రశ్నకు ప్రస్తుతానికి సమాధానం లేదు… బహుశా టెన్త్ పేపర్ల లీకేజీ కేసుకు తోడు ఈ సీఆర్డీఏ అక్రమాల కేసు కూడా కలిపి, తను తెలుగుదేశం కీలక ఆర్థికస్థంభం కాబట్టి టార్గెట్ చేసి ఉంటారా..? ఈలెక్కన నారాయణ వియ్యంకుడు, మరో మాజీ మంత్రి గంటాకు కూడా ఏపీసీఐడీ చెర తప్పదా..? వేచి చూడాలి…
Share this Article