వినదగునెవ్వరు చెప్పిన… అంటారు పెద్దలు..! కానీ జగన్ వినడు… జగన్ పత్రిక కూడా వినదు… నెవ్వర్… లాభమో, నష్టమో జానేదేవ్, జాన్తానై… నీ ఫలానా బాట, అడుగులు నీకే నష్టం అని చెప్పినా సరే..!! ఈమధ్య సాక్షి తన నాలుగో పేజీని ఈనాడు వార్తలకు ‘‘ఖండన పేజీ’’గా మార్చేసింది కదా… పత్రికల్లో సినిమా పేజీ, స్పోర్ట్స్ పేజీ, బిజినెస్ పేజీ వంటి రకరకాల పేజీలు ఉంటాయి తెలుసు కదా… సాక్షిలో ‘‘ఖండనల పేజీ’’ ప్రత్యేకం… ఈనాడులో ఏదైనా నెగెటివ్ స్టోరీ వస్తే చాలు… వేంఠనే దానికి అర్జెంటుగా కౌంటర్ రాసేసి, ఆ పేజీలో కుమ్మేయాలన్నమాట… అంతే…
మరి ఆధారరహితంగా, కుట్రపూరితంగా, దురుద్దేశాలతో కథనాలు రాస్తే కోర్టుకు ఈడ్వటానికి వీలుగా అప్పట్లో ఏదో కఠిన జీవో తీసుకొచ్చారు కదా… ఈనాడు మీద ఎన్ని కేసులు పెట్టారు..? సారీ, ఈ ప్రశ్న అడక్కండి… ఆ జీవోలతో పనికాదు కనుకే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సైతం కమాన్, ఏం కేసులు పెడతావో పెట్టు అని సవాళ్లు విసురుతున్నాడు… పోనీ, ప్రభుత్వ వ్యతిరేకతను ఓ పథకం ప్రకారం పెంచుతున్నందున ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడం లేదు అని ఓ నిర్ణయం తీసుకుని, యాడ్స్ ఆపేస్తుందా..? నెవ్వర్… అదీ చేతకాదు… పాత రూల్స్ ప్రకారం సర్క్యులేషన్ ఎక్కువున్న పత్రికకు ఇవ్వకతప్పదట, దానికి ఇస్తే గానీ సాక్షికి ఇవ్వలేదట… ఐనా రూల్సే కదా, బ్రేక్ చేయడం ఎంతసేపు..? కానీ అదీ జగన్ చేయడు…
సరికదా… రోజూ ఈనాడు కథనాలకు ఇలా కౌంటర్లు రాయిస్తాడు… పోనీ, దానివల్ల ఏమైనా లాభమా..? లేదు… కౌంటర్ ప్రొడక్ట్… ఎలాగంటే..? ఓ తాజా ఉదాహరణ తీసుకుందాం…
Ads
రామోజీరావు పత్రికలో ఏపీ కరెంటు కష్టాలపై ఓ కథనం వచ్చింది… ఈమధ్య పనిగట్టుకుని రోజుకొక నెగెటివ్ క్యాంపెయిన్ స్టోరీ ఇస్తున్నారు, ఆ యజ్జంలో భాగంగా ఆ కరెంటు స్టోరీ… తెల్లవారే సాక్షిలో దానికి కౌంటర్ వచ్చేసింది… దీంతో నిన్న ఈనాడు వార్త చదవని వాడు కూడా, ఓహో, ఈనాడు వాడు ఏం రాశాడో చదువుదాం అని ఈపేపర్ ఓపెన్ చేస్తాడు… అంటే సాక్షి కౌంటర్ ఈనాడు వార్తకు రీడర్స్ను పెంచుతుంది… పైగా అప్పటిదాకా సీరియస్గా ఆ వార్త కంటెంటును పట్టించుకోని పాఠకుడు ఇప్పుడు దాన్ని బుర్రలోకి ఎక్కించుకుంటాడు…
పోనీ, ఈనాడు రాసిన దాన్ని సమర్థంగా ఏమైనా కౌంటర్ చేస్తారా అంటే, అదీ ఉండదు… సేమ్, వైసీపీ పొలిటికల్ కౌంటర్స్లాగే… చంద్రబాబు హయాంలో జరగలేదా..? చంద్రబాబు చేయలేదా..? ఇదొక్కటే కోణం… ఓహో, చంద్రబాబు దుర్మార్గుడు, అసమర్థుడు అయితే మేమూ అలాగే ఉంటాం, తప్పేముంది అన్నట్టుగా ఉండే వాదన… సరే, అదీ పెద్ద నష్టం లేదనుకుందాం… ఏపీలో ప్రజలకైతే తెలుసు కదా, ప్రస్తుతం కరెంటు కోతలు, ఛార్జీల స్థితేమిటో, గతేమిటో…
ఏదో ఈనాడు వాడు ఏదో రాశాడు… దాన్ని వదిలేయకుండా, ప్రజల్లో చర్చ జరగడానికి ఒకరకంగా సాక్షే ఈ కౌంటర్ వ్యాసాల ద్వారా ఆస్కారం కల్పిస్తుందన్నమాట… ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మారీచ మీడియా అని పదే పదే చెబుతూ, ఎలాగూ వాటి క్రెడిబులిటీని దెబ్బతీసే ప్రయత్నం సాక్షాత్తూ జగనే చేస్తున్నాడు కదా… వాళ్ల నాయన కూడా అదే చేసేవాడు… తద్వారా వాటిల్లో ఏమొచ్చినా అవి పొలిటికల్లీ మోటివేటెడ్, ఉద్దేశపూరితాలు అని ముద్ర వేయడం… ఇలా ప్రతి కథనానికీ కౌంటర్ ప్రయాస, కౌంటర్ ప్రొడక్ట్ బదులు అదే నయమేమో… (వైసీపీ కోణంలో…)…
ఐనా… మీడియాలో వచ్చే వార్తలను నమ్మేసి, ప్రభావితులైపోయి జనం వోట్లు వేయరు… మీడియా కక్షకడితే ఏదైనా చేయగలదు అనేది హంబగ్… అదే నిజమైతే గతంలో వైఎస్ గెలిచేవాడు కాదు, మొన్న జగన్ గెలిచేవాడు కాదు… కొన్ని వదిలేయాలి… జనమే లైట్ తీసుకుంటారు… ఊరుకున్నంత ఉత్తమం లేదు అనేది అందుకే…!!
Share this Article