దిల్ రాజుకు పరాభవమా..? హెంత మాఠ..? హెంత మాఠ..? అయ్యారే, నమ్మశక్యంగా లేదే..! ఇంతకీ ఏం జరిగినది..? ఇవే కదా మీ ప్రశ్నలు… సరే, వివరముగా చెప్పుకుందాము… దిల్ రాజు అనగానెవ్వరు..? తెలుగు రాష్ట్రాల్లో చలనచిత్ర నిర్మాణం, ఆర్థికసహకారం, పంపిణీ, ప్రదర్శన అనగా ఆంగ్లమున ప్రొడక్షన్, ఫైనాన్స్, ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ రంగాలను తన కంటిచూపుతో, కనుసైగలతో శాసించు ఓ ప్రబలశక్తి…
అకస్మాత్తుగా ఆయనకు ఓ ఆలోచన తట్టినట్టుంది… ”తనలాంటి వ్యక్తే కదా అల్లు అరవింద్, మన సిండికేటే కదా… మరి తన ఇంట్లో ఇద్దరు హీరోలు… బన్నీ అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్… ఎక్కడికో వెళ్లిపోయాడు… మనమేమో ఎవరెవరి సినిమాలో నిర్మిస్తున్నాం, ప్రదర్శిస్తున్నాం, హీరోల్ని చేస్తున్నాం, నిలబెడుతున్నాం, మరి మన ఇంట్లోనే ఓ నటవారస రత్నం ఉంటే తప్పేమిటి..?” ఇలాగే అనుకున్నాడో… లేక తన మీద ఇంకేమైనా ఒత్తిళ్లు, మొహమాటాలు, తప్పనిసరి అవసరాలు ఉన్నాయో తెలియదు…
కంటిచూపుతో ఇండస్ట్రీని శాసించే నేను నా రక్తాన్ని ప్రముఖంగా తెర మీద నిలబెట్టలేనా అనుకున్నాడేమో కూడా తెలియదు… తనకు కొడుకులు లేరు… ఒక్కతే ఆడ బిడ్డ… అందుకని బ్రదర్ కొడుకు ఆశిష్ రెడ్డిని హీరోగా పెట్టి ఓ సినిమా తీశాడు… ఎడమ చేత్తో ఢమఢమ వాయించి పారేసే దేవిశ్రీప్రసాద్ దానికి సంగీత దర్శకుడు… ఆయన ఓ పది పాటలు కచ్చకచ్చగా కొట్టేశాడు… ఎవరెవరో పాడారు… ఈ సినిమాకు కానుగంటి శ్రీహర్ష డైరెక్టర్… పెద్ద ముదుర్లు ఎందుకులే అనుకుని అనుపమ పరమేశ్వరన్‌ను హీరోయిన్‌గా పెట్టాడు… ఆమెను ఎలాగోలా ఒప్పించి, ఓ మాంచి లిప్‌లాక్ కిస్ సీన్ కూడా పెట్టారు అందులో…
Ads
ఈ సోకాల్డ్ హీరోల కథలు గాకుండా… యూత్ ఫుల్ స్టోరీ కావాలనుకుని… ఓ మెడికల్ కాలేజీకీ, ఇంజనీరింగ్ కాలేజీకి నడుమ పోరగాళ్ల పంచాయితీని కథగా మలిచారు… “ఎందరో నటవారసులు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు, మావాడు నిలదొక్కుకోడా ఏం..?” అనుకున్నాడేమో బహుశా… కానీ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సరే, నిలబడలేక, చతికిలపడి, చివరకు తెరకు దూరమైన వారసుల గురించి మరిచిపోయినట్టున్నాడు… నటన అంటే డాన్సులుగా పిలవబడే నాలుగు పిచ్చి గెంతులు, సర్కస్ ఫీట్ల వంటి రెండు ఫైట్లు, హీరోయిన్‌తో రొమాన్స్ మాత్రమే కాదు కదా…
ఫాఫం.., ఆంగికం, ఆహార్యం, వాచికం, సాత్వికం వంటి బేసిక్స్ అవసరం కదా… అన్నింటికీ మించి మొహంలో ఎమోషన్స్ పలకాలి… అన్నీ కలిసిరావాలి… లక్కు సహా…!! ఆశిష్ రెడ్డికి నిజంగానే సినిమా రంగం ఇష్టం లేనట్టుంది… ఈ సినిమా తరువాత కూడా తెరపై గానీ, సినిమా వార్తల్లో గానీ ఎక్కడా కనిపించలేదు… మొహంలో ఏ ఫీలింగ్సూ పలకలేదు… ఈ సినిమా కోసం 25 కిలోలు తగ్గాడన్నారు… అంటే అంతకుముందు ఎంత ఉండేవాడో… అప్పట్లోనే అందరూ ఆసక్తిగా నిరీక్షించారు, ఎవరినైనా అలా అలా తీసిపడేసే దిల్ రాజు అలియాస్ వెంకటరమణారెడ్డి ఆశిష్‌ను ఎలా నిలబెడతాడో చూద్దామని…
చివరకు ఏమైంది..? ప్రేక్షకులు అడ్డంగా తిరస్కరించేశారు… రుద్దితే రుద్దించుకోవడానికి ఇవి పాతరోజులు కావు డియర్ దిల్ రాజు గారూ అని నిక్కచ్చిగా తేల్చిచెప్పేశారు… నిజానికి ఇది కాదు… తాజాగా చెప్పాలనుకున్నది ఏమిటంటే..? ఆ సినిమాను జీతెలుగు చానెల్‌కు ముడిపెట్టారు అప్పట్లోనే… ఆ జీ చానెల్ వాడికి తన మెయిన్ చానెల్‌లో ఆ సినిమా ప్రసారం చేయడం వేస్ట్ అనిపించింది… అంటే మెయిన్ చానెల్ ప్రసారానికి కూడా ఆ సినిమా పనికిరాదు, టైమ్ స్పేస్ వేస్ట్ అనుకున్నారు… కానీ కొన్నాక తప్పుతుందా..?
జీసినిమాలు అని వేరే చానెల్ ఉంది కదా… అందులో పాత సినిమాలు నిరంతరం వేస్తుంటారు… ఆదివారం కాదు, శనివారం, 30 ఏప్రిల్‌న ప్రసారం చేశారు… వచ్చిన రేటింగ్స్ తెలుసా..? హైదరాబాద్ బార్క్ కేటగిరీలో 1.93 మాత్రమే…. చాలా చాలా దయనీయమైన రేటింగ్స్… పాత సినిమాలు, డిజాస్టర్లకు కూడా ఇంకాస్త ఎక్కువ రేటింగ్స్ వస్తుంటయ్… (జెమిని మూవీస్ చానెల్ కూడా పెద్దగా ఎవరూ చూడరు… అయినా సరే, ఎన్నిసార్లో కొట్టీ కొట్టీ, అరిగిపోయిన కిక్ సినిమాను మొన్నామధ్య మళ్లీ ప్రసారం చేస్తే 1.69 టీఆర్పీలు వచ్చినయ్…) సో, వర్తమాన కాలంలో ఎంత పెద్ద ప్రముఖుడైనా సరే, నిర్బంధంగా ప్రేక్షకుల మీద వారసత్వాన్ని రుద్దడం కష్టం… కష్టం… ఇదీ ఈ రౌడీ బాయ్స్- రేటింగ్స్ కథ తేల్చిన నీతి…!!
Share this Article