కమెడియన్ ఆలీ నోటికి కాస్త తీట ఎక్కువే… ఏదో ఒక పిచ్చి కూత కూయనిదే నాలుక చల్లారదేమో… గతంలో కూడా ఆలీ బహిరంగ వేదికల మీద చేసిన చిల్లర వ్యాఖ్యలపై బోలెడు కథనాలు వచ్చాయి… ఐనా ఆలీ మారడు… మారలేదు… ప్రైవేటు సంభాషణల్లో వోకే, కానీ పది మందీ గమనించే ప్రోగ్రాముల్లోనూ అదే ధోరణి ఆశ్చర్యకరం… ఏపీ పొలిటిషియన్ కదా, తోటి నాయకుల బూతులతో తన నాలుకకు కూడా మరింత పదును పెట్టుకున్నట్టు కనిపిస్తోంది…
ఆలీతో సరదాగా షో ప్రోమో ఒకటి కనిపించింది… అది రొటీన్ ఎపిసోడ్ కాదు… అడివి శేషు హీరోగా నటిస్తున్న మేజర్ అనే సినిమా ప్రమోషన్‌కు ఉద్దేశించింది… అందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్… ఇద్దరూ ఈ ఎపిసోడ్‌లో పాల్గొన్నారు… శేషు అమెరికన్ ఇంగ్లిష్ యాసలో తప్ప ఇండియన్ ఇంగ్లిష్ మాట్లాడటానికి ఇబ్బంది పడతాడు అనే సంభాషణ, ప్రస్తావన ఏదో వచ్చినప్పుడు ఆలీ ఏమంటాడంటే..?
‘‘ఓ సీనియర్ మేనేజర్ ఓ అసిస్టెంట్‌ను పిలిచి, ఫలానా హీరోయిన్ వస్తోంది, ఎయిర్ పోర్టుకు వెళ్లి పికప్ చేసుకో అన్నాడు… ఈయనకేమో తెలుగు తప్ప మరో భాష రాదు… హీరోయిన్ ప్లస్ ఆమె తల్లి పోర్టు నుంచి బయటికి రాగానే ఈయన వెళ్లి ‘రండి, రండి’ అన్నాడుట… వాళ్లు వెంటనే వెనుతిరిగి వెళ్లిపోయారు… వీడికెలా తెలిసిపోయింది అనుకుని వాపస్ పోయారు’’….. (రండి అంటే హిందీలో వేశ్య అని అర్థం)… ఆ జోక్ ఏమిటో, దాని స్థాయి ఏమిటో మీరే అర్థం చేసుకొండి ఇక…
Ads
ఈ ఎపిసోడ్‌లో ఆ జోక్ సందర్భరహితం… కంపు… ఆ వాసనకు అడివి శేషు కూడా ఏమనాలో తెలియక నోరు మూసుకున్నాడు… నిజానికి ఈ షోకు హీరోయిన్ సాయి మంజ్రేకర్ కూడా వచ్చింది… ఆమె కూడా ముంబై హీరోయిన్… (ఆమె తండ్రి నిర్మాత, తల్లి నటి, సోదరుడు నటుడు, సోదరి నటి…) ఈ జోక్ సమయంలో ఆమె శేషు పక్కన లేదు… అఫ్‌కోర్స్, ఉన్నాసరే ఆమెకు తెలుగు రాదు కాబట్టి అర్థమయ్యేది కాదు… లేకపోతే తను కూడా ఆలీ జోక్‌కు ఛీకొట్టి వెళ్లిపోయేదేమో… ఇంకేం చేసేదో…!! హిందీతో లింకై ఉన్న జోక్ కాబట్టి ఆలీ జోక్ మన ఇండస్ట్రీకి వచ్చే నార్త్ హీరోయిన్ల మీదే అనుకోవాలి…
నార్త్ హీరోయిన్ల మీద ఇండస్ట్రీలో రకరకాల బూతు జోకులు వ్యాప్తిలో ఉండవచ్చుగాక… కానీ ఇంటిల్లీపాదీ చూసే ఓ షోలో ఇలాంటి అసందర్భ, చెత్తా జోకులు… అదీ హీరోయిన్లందరినీ కించపరిచే జోకులు వేయడం ఓరకమైన వెగటు ధోరణి… చీప్ టేస్ట్… హైదరాబాద్‌కు ఇప్పుడు టీవీ, సినిమాల కోసం దాదాపు ప్రతి రాష్ట్రం నుంచీ హీరోయిన్లు వస్తున్నారు… అందరినీ ‘‘ఆ బాపతు’’ ఖాతాలో వేసేయడం ఆలీ నోటి తీటకు తాజా ఉదాహరణ…
ఇదేకాదు, ఓ ప్రసంగంలో, ఓ ప్రెస్‌మీట్‌లో, ఓ టీవీషోలో, ఓ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుతున్నామో మనకే కాస్త సోయి ఉండాలి… నాలుక మీద అదుపు ఉండాలి… రొటీన్ వాడే బూతు ఊతపదాలు ఉంటే పరిహరించాలి… కాస్త సంస్కారాన్ని ప్రదర్శించాలి… అలాంటిది తనే హోస్ట్ చేస్తున్న షోలో తనే ఇలాంటి జోకులు వేయడాన్ని ఏమనాలి..?! ఏమీ అనలేం… ఈటీవీ వాళ్లు కూడా జబర్దస్త్ స్థాయిలో, ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు కదా…!!
Share this Article