రీతిరివాజు తెలియని పీఆర్ టీం ఉంటే ఇలాగే ఏడుస్తుంది మరి… అరె, జర్నలిస్టులకు డబ్బులు ఇవ్వడం అనేది ఓ కళ… అందులో తెలివిడి, అనుభవం, వ్యవహారజ్ఞానం, లౌక్యం తెలిసినవాళ్లకు పెట్టుకుంటేనే మంచిది… ఈ దిక్కుమాలిన పబ్లిక్ యూనివర్శిటీలకు అదేమో తెలియదు… పిచ్చి ఎదవలు… అరె, సినిమా ఫంక్షన్లకు ఒకరకం… మామూలు రాజకీయ నాయకుల ప్రెస్‌మీట్లకు మరోరకం… ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఇంకోరకం… ఏ కార్యక్రమాలతో సంబంధం లేకుండా మేనేజ్ చేయబడేవి వేరేరకం…
ఒక్కో కార్యక్రమానికి ఒక్కోరకంగా ఉంటుంది జర్నలిస్టుల్ని మేనేజ్ చేసే విధానం… ఉదాహరణకు… సినిమా మామూలు ప్రెస్‌మీట్లు వేరు, ప్రత్యేక ఇంటర్వ్యూలు వేరు, టీవీ షోలు వేరు, పాజిటివ్ రివ్యూలు వేరు… దేని రేటు దానికే, దేని పద్ధతి దానికే… అవన్నీ తెలియనివాళ్లు ఎందుకొస్తారో ఈ పీఆర్ ఫీల్డులోకి… జర్నలిస్టుల ఇజ్జత్ తీయడానికి కాకపోతే… అసలు జర్నలిస్టుల గురించి ఏం అనుకుంటున్నారురా భయ్…?
Ads
ప్రతి దానికీ ఓ రివాజు ఉంటుంది… అది తెలిసినవాళ్లే పీఆర్ టీమ్స్‌లో రాణిస్తారు… జర్నలిస్టులను కూడా అందరినీ ఒకే గాటన కట్టేయకూడదు… పత్రిక సర్క్యులేషన్ బట్టి, టీవీ రేటింగ్స్‌ను బట్టి, సదరు జర్నలిస్టు టెంపర్‌ను బట్టి రకరకాలుగా మేనేజ్ చేసే విధానం ఉంటుంది… తమిళనాడులో భారతీయ యూనివర్శిటీ అని ఓ ప్రభుత్వ యూనివర్శిటీ ఉందిలెండి… మొన్న స్నాతకోత్సవం జరిపారు… నిజానికి స్నాతకోత్సవాల్లో జర్నలిస్టులకు ఏమీ ముట్టచెప్పేది ఉండదు… భోజనం పెడితే మహా గొప్ప…
చాన్సిలర్ హోదాలో గవర్నర్ వస్తాడు, ఎడ్యుకేషన్ మినిష్టర్ వస్తాడు… మీ ఇష్టముంటే రాయండి, లేకపోతే వదిలేయండి అన్నట్టుగా ఉంటుంది యవ్వారం… కానీ ఫాఫం, ఎవరో కొత్తగా పీఆర్వోగా వచ్చినట్టున్నాడు… మీటింగ్ ముఖ్యాంశాల ప్రింటవుట్లతోపాటు కవర్లలో 500 కరెన్సీ నోట్లను పెట్టి పంపిణీ చేయించాడు… ఈ మర్యాదకు అందరూ ఫ్లాట్ అయిపోతారు అనుకున్నాడేమో… కానీ జర్నలిస్టులు దాన్ని తేలికగా తీసుకోలేదు… ఠాట్, ఇదేం పద్థతి అని తీవ్రంగా ఖండించేశారు…
Coimbatore Press Club strongly condemns @BharathiarUniv for distributing bribe to journalists who covered its 37th convocation on May 13, 2022. We demand stern action against those responsible for the incident and an apology to the reporters who covered the event @rajbhavan_tn pic.twitter.com/UPJM6A5Uup
— COIMBATORE PRESS CLUB (@CBE_CPC) May 13, 2022
కోయంబత్తూరు ప్రెస్‌క్లబ్ ఈ పద్థతీపాడూ లేని పంపిణీని తీవ్రంగా ఖండించేసింది… దీనికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలనీ, ఆ ఈవెంట్ కవర్ చేసిన రిపోర్టర్లకు క్షమాపణ చెప్పాలనీ డిమాండ్ చేసింది… అసలు ప్రెస్‌క్లబ్‌కూ ఇలాంటి యవ్వారాలకూ లింక్ ఉండదు… అయితేనేం, అంత బహిరంగంగా నోట్లు పంపిణీ చేస్తే తీసేసుకోవడానికి… ఇదేమైనా బహిరంగసభకు తోలుకొచ్చే జనాలకు డబ్బులు, బీర్ బాటిళ్లు, బిర్యానీ పొట్లాలు ఇచ్చేవాళ్లతో ఈక్వల్ కాదు కదా… ఎంత అవమానం..?
నిజానికి అదే యూనివర్శిటీ వాళ్లు మాస్ కమ్యూనికేషన్స్ కోర్సులతో పాటు… పబ్లిక్ రిలేషన్స్, ప్రెస్ రిలేషన్స్‌లో ఏదైనా అర్జెంటుగా డిప్లొమా కోర్సు ఒకటి ప్రవేశపెట్టడం బెటర్ అనిపిస్తోంది… మార్కెట్ డిమాండ్ అది… నిజమే కదా… ఎవరుపడితే వాళ్లు ఈ పీఆర్ ఫీల్డులోకి వచ్చేసి, బదనాం చేసేలా డబ్బులు ఇవ్వడం ఎంత దుర్మార్గం… పంపిణీకి కూడా ఓ పద్దతుంటుంది కదా… రిలేషన్స్ అనేది చాలా విస్తృతమైన, సంక్లిష్టమైన, లౌక్యపు సబ్జెక్టు… సర్, వీసీ గారూ, ఓ కోర్స్ డిజైన్ చేసేయండి సార్…!!
Share this Article