గ్రహచారం కొద్దీ ఓ పాపులర్ టీవీ వంటల కంపిటీషన్‌కు వెళ్లబడ్డాను… వంద రకాల ఇంగ్రెడియెంట్స్… కంటెస్టెంట్లు చెమటలు కక్కుతున్నారు… ఒక సగటు వంటింట్లో ఉన్నవాటికన్నా నాలుగురెట్లు ఎక్కువగా ఉన్నాయి వంట పరికరాలు, పాత్రలు, యంత్రాలు… జడ్జిల్లో ఇద్దరు ఫైవ్ స్టార్ హోటల్లో చెఫులట… ఒకాయన చాలా ఫేమస్ ఫుడ్ యూట్యూబర్ కమ్ బ్లాగర్… మరొకామె గతంలో అమెరికాలో హోటల్ నడిపించిందట…
ఒక ప్లేటు… ఓ పక్కన చిన్న దోసకాయ ముక్క కోసి పెట్టాడు… మరో పక్కన అడ్డంగా చక్రంలా కోసిన ఓ చిన్న నిమ్మకాయ ముక్క… అటూఇటూ చిలుక ఆకారంలో కేరట్ ముక్కలు… మధ్యలో ఫాఫం అనాథగా ఏదో వంటకం కనిపిస్తోంది… నలుగురు జడ్జిలు ఆహా అన్నారు, ఓహో అన్నారు… సర్, ఆ దోసకాయ ముక్క దేనికి పెట్టారు అనడిగాను… పాతరాతియుగం నాటి అనాగరికుణ్ని చూసినట్టు చూశారు ముగ్గురూ… ఆ వంట దోసకాయకు సంబంధించిందీ అని చెప్పడానికి ప్లస్ చూడగానే తినాలనిపించేలా ఈ డెకొరేషన్, ప్రజెంటేషన్ అన్నారు…
అంటే… ప్లేటులో దోసకాయ ముక్క పెట్టి, సింబాలిక్‌గా చెబితే తప్ప, అది దోసకాయ రెసిపీ అని తెలియకపోతే, ఇక ఆ వంట దేనికి..? అందులో ఏమేం చెత్త వేసినట్టు మరి..? దాంట్లో ఒరిజినాలిటీ ఏమిటి..? నాలుక్కి రుచి ఉండాలి గానీ, అందంగా అలంకరిస్తే రుచి పెరుగుతుందా అనడిగాను… జవాబు చెప్పలేదు ఎవరూ… మొహాలు మ్లానమయ్యాయి… కానీ ఎవడ్రా వీణ్ని ఇక్కడికి రానిచ్చింది అన్నట్టుగా ఇటూఅటూ కోపంగా చూశారు…
Ads
నిజం చెప్పండి… ప్లేటులో మామిడికాయ ముక్క పెట్టి చెబితే తప్ప, అది మామిడి వంట అని తెలియకపోతే ఇక మామిడిని తిన్నట్టు ఎలా అవుతుంది..? సరే, మనం అనాగరికులం, ఏదో పాతకాలం రోటిపచ్చడి బాపతు… కానీ ఒక్కటి నిజం… తక్కువ సరుకులతో, తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో, ఒరిజినాలిటీ చెడిపోకుండా రెసిపీ చేయడం ఓ కళ… స్టార్ హోటళ్లలో చెఫులకు తెలియని విద్య అది… అందుకే అవి రుచీపచీ లేకుండా పథ్యం పచ్చళ్లలాగా ఉంటయ్…
ఒకాయన సైటులో ఉప్పుడుపిండి రెసిపీ చదివాను… కొన్ని యూట్యూబ్ వీడియోలు చూశాను… సేమ్, ఒకరు డ్రై ఉప్మా అంటారు, ఇంకొకరు రవ్వ ఫ్రైడ్ ఉప్మా అంటారు, మరొకరు ఇంకేదో పేరు పెట్టారు… తెలుగులో అత్యంత పాపులర్ యూట్యూబర్ ఒకాయన ఉన్నాడు… తను పెట్టిన వీడియో చూస్తే నిజంగా జాలేసింది… మెంతికూర, పుదీనా, కొత్తిమిర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, ఆవాలు, జిలకర, దాల్చినచెక్క, పల్లీలు, శెనిగెపప్పు, మినపపప్పు, ఇంగువ, పసుపు, నూనె, ఎండుకారం, ఉప్పు, పచ్చిమిర్చి, టమాట ముక్కలు, కసూరి మెంతి, ధనియాల పొడి, చాట్ మసాలా, అంతా అయ్యాక నిమ్మరసం… 24… కొన్ని మరిచిపోయి ఉంటాను… అన్ని వేయాలట… సో, చెప్పదలుచుకున్నది ఏమిటీ అంటే… ట్యూబులో కనిపించినట్టు ప్రయోగాలు చేసి కడుపుల మీదకు తెచ్చుకోవద్దు… రుచి సంగతి తరువాత…
సరే, ఆ ఉప్పుడు పిండి రవ్వతో కాదు, ఎలా చేయాలో తెలుసా..? బియ్యపు పిండితో..! ఇంట్లో కూరగాయలు లేవా..? ఎక్కువ శ్రమకు ఓపిక లేదా..? జస్ట్, సింపుల్… మూకుడులో కాస్త నూనె, చిటికెడు ఆవాలు, సేమ్ జిలకర, కారానికి సరిపడా పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి, అందుబాటులో ఉంటే ఉల్లిపాయముక్కలు, శెనిగెపప్పు, కాస్త పెసరపప్పు… రుచికి సరిపడా ఉప్పు… ఇంకేమీ వద్దు… నిజంగానే ఏమీ వద్దు… కాకపోతే బియ్యపుపిండి ఒక కప్పు అనుకుంటే ఒక కప్పుకు కాస్త తక్కువగా నీళ్లు పోయాలి… అదీ ముఖ్యం…
ఆ నీళ్లు మరుగుతుంటే బియ్యపు పిండి వేసి, కలపండి… స్టవ్వు స్లిమ్‌లో పెట్టండి… మూత పెట్టండి… కాసేపయ్యాక మళ్లీ కలపండి… సన్నటి సెగ మీద… మరీ డ్రైగా వద్దు… మెత్తగా ఉంటేనే ఉప్పుడుపిండి మజా… ఉప్పాలి… ఉప్పితేనే దాన్ని ఉప్పుడు పిండి అంటారు… అంతేతప్ప ఉప్పుడు రవ్వ కాదు… అంటే సన్నటిసెగ మీద పిండి గట్టిగా ఉడకాలి… చేతిలోకి తీసుకుని ముద్దలా చేసుకుని, ఆవకాయతో అంచుకు పెట్టుకుంటే ఆ మజా వేరు, ఆ టేస్ట్ వేరు… ఫాస్ట్ రెసిపీ విత్ నో టైమ్… నో లాట్ ఆఫ్ ఇంగ్రెడియెంట్స్..! ప్లీజ్, డోన్ట్ టేక్ విత్ స్పూన్…!! మీకు ఇంకాస్త టైమ్ ఉంటే మజ్జిగలో కాస్త ఉప్పు వేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, రైతాలాగా తీసుకొండి… ఆహా…!!
Share this Article