కోటి విద్యలూ కూటికొరకే కదా… ఆహారం మన సంస్కృతిలో ఓ భాగం… కానీ పాతవన్నీ కనుమరుగవుతున్నయ్… యాది చేసుకుందాం ఓసారి… Sampathkumar Reddy Matta సారు రాసిన సారెగంపల రచన ఇది… పక్కా తెలంగాణ ఆహార సంస్కృతి… పండుగలు, పబ్బాలు, శుభకార్యాలతో ముడిపడిన తీరు… తినాలి, తినబెట్టాలి… పెట్టిపోతలు తరువాత సంగతి… ఎంత బాగా కడుపు నింపావనేదే మర్యాద… మన్నన…
సారెగంపలు – ఊరేగింపులు
~~~~~~~~~~~~~~~~~~~~
మన మానవ మనుగడ పరిణామక్రమంలో ఆహారసంస్కృతి పాత్ర అమృత తుల్యమైనది ! అందులో ఒక ఘట్టాన్ని తెలిపే ఒకతరం కిందటి యాది ఇది !!
~~~•~~~•~~~
ఒకప్పుడు ఇన్నిరకాల తిండ్లెక్కడిదని..?
తిండిపట్ల ఇంతటి ఎడతెగని తండ్లాట ఎక్కడిదని..?
స్తోమత ఉన్నోళ్లైనా లేనోళ్లైనా పద్ధతి ఒక్క తరీకనే.
చవితి పండుగ నాడే.. శావాలపాశం…
సంక్రాంతి పండుగకే.. సకినప్పాలు.
ఉగాది పండుగ రోజునే.. భక్షాలు.
చుట్టాలు వస్తెనే.. పూరీలు, బజ్జీలు.
Ads
అందుకే పండుగను అప్పాలతోటి ముడిపెట్టి
పెద్ద యాకాశిని చేగోల్ల పండుగని
వినాయక చవితిని శావాల పండుగనీ
సంక్రాంతిని సకినాల పండుగనీ
పురుడును గుడాల పండుగనీ
పుష్పవతిని పలారాల పండుగనీ… పిలుచుకునెటోళ్లు.
తిండి తిని & తినవెట్టి తృప్తిపరుచుడే అతి పెద్ద మర్యాద.
బట్టబాతలు కట్నకానుకలూ అన్నీ ఆ తర్వాతనేనాయే.
పండుగలోని పరమార్థం తర్వాత సంగతి, విందే ముందు..!
ఏదైతేంది, ఏదో ఓ పండుగ వస్తుందంటే చాలు…
గంపల నిండా అప్పాలే పిల్లల కండ్లల్ల మెదులుతయి.
పండుగలను అట్ల పక్కన వెడితే.. పెండ్లి & ప్యారంటం
మల్ల అండ్లదండ్ల ఆడబిడ్డలకు పలారాలు తీసుకపోవుడు
ఇవి ఉన్నయంటే పిల్లగండ్లకు వారం రోజులు పంటవండినట్టే.
సకినాలు, అరిసెలు, గరిజెలు, కారప్పూసలు, బొంది,
వీటిమధ్య రాచకన్నెలలెక్కన వెలిగిపోయే లాడూలు..!
ఇవన్నీ ఇంట్ల కొలువున్నంతకాలం పిల్లలందరికీ
సర్గంల సంచరిస్తున్నట్టే ఉండేది. ఎక్కడ లేని ఉల్లాసం !
అబ్బ, నోటికాడి అప్పగుంజుకున్నట్టు మధ్యల బడి ఒకటి.
వచ్చుడు వచ్చుడే– సక్కగ అర్రల అప్పాల గంపల్నే చెయ్యి.
చీకటి అర్రలకు పోవుడు, వెతుకుడే కష్టమనుకుంటే–
దేవుని అర్రలకు తానంజెయ్యంది పోవద్దని బాపమ్మలొల్లి.
నిజం చెప్పాల్నంటె అమ్మ దగ్గరికన్నా అప్పాలగంప దగ్గరనే
ఈ వారం పదిరోజులు పిల్లలు ఎక్కువసార్లు తచ్చాడేది.
దొంగతిండి, తొండితిండి, చాటుతిండి… భలేగ ఉండేటియి.
సైసుండ్రి.. ఇగ ఈంత అసలు ముచ్చట జెప్త !
మాడిపోగిట్ట,, ఓసారి అట్లపొయి కూరగలిపి రాండ్రి.
మంట తక్కువజేసి వచ్చిండ్రు గద, ఇగ రంధి లేదు.
మా చిన్నతనంల కోమట్ల అప్పాల ఊరేగింపులు అంటే
చూసుటానికి రెండుకండ్లు ఏ మూలకు సరిపోనంత సంబురం !
అబ్బో, ఆ అప్పాలగంపల వైభోగం చూసి మురిసుటానికే
పసిపిలగండ్ల పంచపానాలు నీరునీరై అవిసిపోతుండేటియి.
పెద్దమనిషైన ఆడపిల్లకో, పెండ్లికో, సీమంతానికో…
కోమట్లు పెద్దపెద్దగ, పెద్దమొత్తంల సారె అప్పాలు చేద్దురు.
పెద్ద వడ్లజల్లెడంత సకినాలు, పిండిజల్లెడంత అరిసెలు,
రొట్టె పెంకంతటి కారప్పూసలు, దోసిట్ల పట్టనంత గరిజెలు,
పండు గుమ్మడి కాయలంతగ… పెద్దపెద్ద లాడుముద్దలు.
తీరుతీరు అప్పాలన్నిగలిపి లెక్కకు ఐదువందలో వెయ్యో.
వాటిని పెద్ద తట్టగిన్నెలల్ల, దాలగంపలల్ల, తాంబాలాలల్ల,
కంకపెట్టెలల్ల, వైరుబుట్టలల్ల.. ఇంతెత్తుతోటి పేరుద్దురు.
మోసెటొళ్లకు మెడలువంగిపొయ్యే మోతకోలు బరువు.
ఊరందరికి ఊరిల్లు పుట్టిచ్చుకుంట, మురిపిచ్చుకుంట,
వాడవాడకు అప్పాలను అందరికండ్లల్ల మెరిపిచ్చుకుంట,
పెద్దచప్పుడుతోటి, చుట్టాలబలుగంతోటి గొప్ప ఊరేగింపు !
పోచమ్మ గుడికాడినుంచి, మూడుబజార్ల మీదినుంచి,
రాములవారిగుడినుంచి,పెద్దబడి, ఆఫీసు ముందటికెల్లి..
ఆ ఆప్పాల ఊరేగింపు గొప్ప రాజిర్కంతోటి కదిలిపోయేది.
ముసలొల్లకు ఎంతపానం కొట్టుకునేదో ఏమో తెల్వదిగని,
పిల్లలకైతే… తల్లిపొదుగుల దూడ మూతివెట్టినట్టే ఉండేది.
కాని, మూతికి చిక్కం ఏసిన దూడ తీరు.. ఒకటే తండ్లాట !
చూసేకండ్లూ వాచే మొకమని– ఆ అప్పాలగంపల వెన్క
గంపెడాశపెట్టుకోని, నాలుగుబజార్లూ కలిసి కవాతుచేద్దుము.
ఏం పాయిద ? కడకు అవి ఏయిల్లు చేరాలెనో ఆయిల్లు చేరేవి.
మిఠాయి దుకాండ్ల కప్పిన అద్దాలమీద తిరిగే ఈగలలెక్క
పిల్లలు.. ఆ ఇంటి పెద్ద దర్వాజకాడనే ఆగిపోవుడేనాయే.
కాటగల్సిన పిల్లికూనతీరు ఆటీటు కొద్దిసేపు ఆశకొద్ది తిరిగి
ఆఖరికి, ఆకలి కేకలువేస్తే.. విధిలేక ఇంటితొవ్వ పడుదుము.
అదీయిదీ బొర్లిచ్చిచూసి తినుటానికి ఎక్కడేమీ దొరుకకుంటే
పొయిల అగ్గి ఉంటేగనుక ఇన్ని పల్లికాయలు కాల్చుకునుడు,
అది ఆల్లగాని ఆల్ల అయితే… ఇంత చింతపండో, బియ్యమో
నోట్లేలేసుకునుడు, అప్పటికి బుజ్జి ఆత్మకు తృప్తిగాకపోతే…
మెల్లెగ వంటింట్లకు పొయి.. బుక్కనిండ చెక్కర పోసుకోని
ఇంటెనుకనుంచి, ఒకటే అడుగుల బజార్లకు ఉరుకుడు…
దోస్తులకు అప్పాల ముచ్చట చెప్పుకుంట…మల్ల ఆట మొదలు.
తిన్నపానం తిప్పలవెట్టిందంటరుగని, తినని పానం సంగతేంది,
అప్పాలగంపలు పెట్టిన తిండితిప్పలు మరిచిపోవుటానికి
ఎంతలేదన్నా ఓ వారంపదిరోజులు తప్పకుంట పట్టేదిమరి…!!
Share this Article