నో డౌట్… రాహుల్ గాంధీ పర్యటన, వరంగల్ సభ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఎలాగైతే నింపాయో… సేమ్, అమిత్ షా తుక్కుగూడ సభ, పర్యటన బీజేపీ శ్రేణుల్లోనూ అంతే ఉత్తేజాన్ని నింపాయి… సభ విజయవంతమైంది… గత నంగి వైఖరికి భిన్నంగా బీజేపీ హైకమాండ్ ఇప్పుడు కేసీయార్ మీద పదునైన విమర్శల బాణాల్ని ఎక్కుబెట్టింది… తెలంగాణకు సంబంధించి తమకు కాంగ్రెస్‌తో పోరాటం మీద పెద్ద ఇంట్రస్టు లేదనీ, టీఆర్ఎస్ మాత్రమే ప్రధాన ప్రత్యర్థి అని తేల్చేసింది…
అంతేకాదు, బండి సంజయ్ మీద పార్టీలోనే కొన్ని సెక్షన్లకు వ్యతిరేకత, సహకార రాహిత్యం… ఫిర్యాదులు… బట్, సంజయుడే రథసారథి అని అమిత్ షా పార్టీలోని అసమ్మతివాదులకు పరోక్షంగా స్పష్టం చేశాడు తన ప్రసంగంలో… అన్నీ బాగున్నాయి సరే… అయితే తెలంగాణలో పోరాటానికి సంబంధించి పార్టీ హైకమాండ్‌లోనే పెద్ద అయోమయం తాండవిస్తోంది… ఓ డైరెక్షన్, ఓ క్లియర్ యాక్షన్ ప్లాన్ కనిపించడం లేదు…
తన పర్యటనలో భాగంగా అమిత్ షా పార్టీ ముఖ్యులతో దాదాపు రెండు గంటలు భేటీ వేశాడు… కానీ సరైన కర్తవ్యబోధ కరువైనట్టుంది… ప్రధానికి తక్కువ, పార్టీ అధ్యక్షుడికన్నా ఎక్కువ కదా తను… అంత ఇంపార్టెంట్ వ్యక్తి కదా… మరి ఏం చెప్పాడు..? ఆ భేటీలో టార్గెట్ 61 అని ఫిక్స్ చేశారట… అంటే మెజారిటీ మార్క్‌కు సరిగ్గా ఒక సీటు ఎక్కువ అన్నమాట… సంకల్పానికీ, లక్ష్యానికీ దరిద్రం దేనికి..? అసలు మొత్తం నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులు ఉన్నారా..? పార్టీ నామమాత్రంగా ఉన్న సీట్లపై ప్రత్యేక రాజకీయ ప్రణాళిక ఏది..?
Ads
ప్రసంగంలో కూడా పదే పదే కేసీయార్ అవినీతి, నయా నిజాం అని ప్రస్తావించాడు షా… ఇన్నిరోజులుగా బండి సంజయ్ చేస్తున్న విమర్శలే కదా అవన్నీ… కొత్తగా ఢిల్లీ నాయకత్వంలో ఏం చెప్పించినట్టు మరి..? మేం ఇస్తున్న డబ్బులతోనే కేసీయార్ పథకాలు అని మరో విమర్శ… సగటు తెలంగాణవాసి ఏమనుకుంటాడు..? కేసీయార్ అవినీతిపరుడే అయితే మరి ఢిల్లీ ఏం చేస్తోంది, ఎందుకు చూస్తూ కూర్చుంటోంది, పోనీ, అవినీతికి సంబంధించి ఒక్క ఆధారాన్ని జనంలోకి చర్చకు వదలొచ్చు కదా అని గొణుక్కుంటాడు… మేం ఇస్తున్న డబ్బులు అనేది ఓ అబ్సర్డ్ విమర్శ… ఎవరి డబ్బులూ ఎవరూ ఇవ్వడం లేదు… అవి రాష్ట్రానికి హక్కుగా రావల్సిన డబ్బులే… బీజేపీ ఔదార్యం ఏముంది అందులో… సో, ఇలాంటి విమర్శలు జనానికి ఎక్కవు…
రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ పేరిట రైతులకు ఏమేం చేస్తామో చెప్పించింది… నిజంగానే ఆ డిక్లరేషన్ మీద చర్చను లైవ్‌గా ఉంచడంలో కాంగ్రెస్ నాయకత్వం వైఫల్యం కాస్త కనిపిస్తోంది, కానీ ఆ డిక్లరేషన్‌లో చెప్పినవన్నీ రైతుకు ఉపయోగకరమే… మేం గెలిస్తే ఇదుగో ఈ పనులు చేస్తాం అంటూ కాంగ్రెస్ సాగునీరు, ఉపాధికల్పన వంటి ఇతర కీలకరంగాలపైనా ముందస్తు హామీల మీద కూడా కసరత్తు చేస్తోంది… బీజేపీకి ఈ దిశలో సరైన ఆలోచన, విజన్ కొరవడింది… ఎంతసేపూ కేసీయార్ అవినీతి, అక్రమాలు, నయా నిజాం అనే విమర్శలు చేస్తే ప్రజలపై వాటి ప్రభావం ఎంత..?
ఈటల, రఘునందన్ గెలిచినప్పటి టెంపోను అలాగే కొనసాగించడంలో బీజేపీ రాజకీయ వైఫల్యం కూడా కొంత కనిపిస్తోంది… పార్టీలో ఎవరెవరో చేరతారని ప్రచారాలు, పత్రికల్లో వార్తలే తప్ప నిజంగా ప్రభావశీలురైన కొత్త నాయకులు ఎవరూ ఈమధ్య చేరలేదు… ఏయే స్థానాల్లో ఎవరెవరిని పార్టీలోకి తీసుకువస్తే పార్టీ బలపడుతుందనే అంచనాల్లేవు… అప్రోచ్ లేదు… చేరదామని అనుకున్నవాళ్లకు సరైన హామీలు ఇవ్వగల పరిస్థితి లేదు… సో, గమ్యం స్పష్టమే, కానీ వెళ్తున్న మార్గమే గందరగోళం..!!
Share this Article