‘‘నెహ్రూ తొలి ప్రధానిగా దేశాభివృద్ధికి బాటలు వేశాడు… ఇందిరాగాంధీ దేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ శక్తిగా నిలబెట్టింది… రాజీవ్ గాంధీ టెక్నాలజీ శకంలోకి తీసుకుపోయాడు… మరి ఇప్పుడేమిటి ఆ కుటుంబం దేశాన్ని వెనక్కి తీసుకుపోతాను అంటోంది… స్వాతంత్ర్యపు పూర్వ రోజుల్లోకి నడిపిస్తారా ఏమిటి..? లేకపోతే బ్యాలెట్ బాక్సుల దశ నుంచి ఈవీఎంల దశకు చేరుకున్న స్థితిలో ఇంకా ఆధునికమైన ఎన్నికల సంస్కరణల వైపు ఆలోచించాల్సింది పోయి మళ్లీ బ్యాలెట్లు అంటారేమిటి..? కాంగ్రెస్‌ను ఉద్దరించడానికి ఉద్దేశించిన ఆ నవ చింతన్ శివిర్ భేటీల్లో ఆ తీర్మానం ఏమిటి..?’’
…….. నిన్న సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగిన పోస్టుల సారాంశం ఇది… విచిత్రంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇష్టమొచ్చినట్టు రాసిపారేసింది… కాంగ్రెస్ గనుక అధికారంలోకి వస్తే ఈవీఎంలను బంగాళాఖాతంలోకి విసిరేసి, పాత బ్యాలెట్ల పద్ధతిని తీసుకొస్తుందని హామీ ఇచ్చేసింది అన్నట్టుగా చిత్రీకరించేసింది మీడియా… కానీ అది నిజం కాదు… అఫ్‌కోర్స్, సహజంగానే, ఎప్పటిలాగే కాంగ్రెస్‌కు దాన్ని కౌంటర్ చేయడమూ తెలియలేదు… అంతెందుకు..? ఆ శివిర్ తీర్మానాలను సరిగ్గా బయటికి కమ్యూనికేట్ చేసుకోవడం కూడా తెలియలేదు…
ఈవీఎంల విషయానికి వద్దాం… ఈ భేటీల్లో రకరకాల ఇష్యూస్ చర్చించడానికి సబ్ గ్రూపులు ఏర్పాటు చేశారు… ఓ గ్రూపు ఎదుట మహారాష్ట్ర సీనియర్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ తదితరులు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు… ‘‘మన పార్టీ శ్రేణుల్లో ఈవీఎంల మీద సందేహాలున్నయ్, వాటికి వ్యతిరేకంగా మనం తీర్మానం చేయాలి’’ అని డిమాండ్ చేశారు… ఏదో తాజా ఎన్నికల డేటాను చూపించారు… కానీ దాన్ని నిర్మొహమాటంగా సబ్ గ్రూపు కొట్టిపారేసింది… తీర్మానం ప్రతిపాదనకూ తిరస్కరించింది…
Ads
‘‘2004, 2009లో మనం అధికారంలోకి రాలేదా..? చత్తీస్‌గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్నాటకల్లో విజయఫలితాలు అందుకోలేదా పోయినసారి… బాధ్యత కలిగిన ఓ జాతీయ పార్టీగా ఈవీఎంలపై ఆధారాల్లేని ట్యాంపరింగ్ ముద్రలు వేయలేం… ఈవీఎంలను రిగ్గింగ్ చేయగలరు అని చెప్పడానికి సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు… పైగా ఇది నిజమే అనుకున్నా సరే, ఒక్క కాంగ్రెస్ పార్టీ సమస్య కాబోదు… అన్ని పార్టీలదీ… అఖిలపక్ష సమావేశాల్లో ప్రస్తావించాలి…’’ అని కొట్టిపడేశారు…
నిజానికి నాలుగైదేళ్ల క్రితం ఎన్నికల కమిషన్ ఎవరైనా సరే ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చునని నిరూపించండి అని సవాల్ విసిరింది… ఈవీఎంలను వ్యతిరేకించే పార్టీలేవీ ముందుకు రాలేదు… నిరూపించలేకపోయారు… వోటరు జాబితాలకు ఆధార్ డేటాతో అనుసంధానం, దొంగ వోట్ల ఏరివేత, ఆన్‌లైన్ వోటింగు, వోట్ల శాతాన్ని బట్టి ప్రాతినిధ్యం, ప్రధాని పదవికి ప్రత్యక్ష ఎన్నిక వంటి ఎన్నో కొత్త కొత్త ప్రతిపాదనలు చర్చకు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలకు వ్యతిరేకంగా తీర్మానం చేయలేదు… అందుకే కిమ్మనలేదు… కాకపోతే ఓటరు నిర్ణయాన్ని భద్రపరిచేలా వీవీప్యాట్ పద్ధతిని బలోపేతం చేయాలని మాత్రం సూచించింది..!!
Share this Article