Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫిలిప్పీన్స్‌లో ప్రశాంత్ కిషోర్ గెలుపు… ఔను, తన ఫార్ములాదే విజయం…

May 17, 2022 by M S R

ఎక్కడి ఫిలిప్పీన్స్… ఎక్కడి ప్రశాంత్ కిషోర్… ఇదెక్కడి గెలుపు… ఇదేం లింకు… అని హాశ్చర్యపడకండి… ప్రశాంత్ కిషోర్ ఫార్ములాయే ఫిలిప్పీన్స్‌లో గెలిచింది… ఇండియాలో రాబోయే ఎన్నికల పోరాటానికి సోషల్ మీడియాయే వేదిక అనుకుంటున్నదే కదా… అందుకని ఈ కథ కూడా ఓసారి చదవాలి… చరిత్ర రికార్డ్ చేసిన ఘోరాల్ని, దుర్మార్గాల్ని సైతం సోషల్ మీడియా ఎలా తారుమారు చేసి, జనాన్ని మాయచేసి, భ్రమల్లో పడేసి, తప్పుదోవ పట్టించగలదో తెలుసుకోవాలి… పీకే ఫార్ములా ఎందుకు డేంజరసో అర్థం చేసుకోవాలి…

ఇదంతా సరే… ఎవరో లేడీ బొమ్మ పెట్టావేమిటి అంటారా..? ఉంది, దానికీ రీజన్ ఉంది… ఈమె పేరు ఇమెల్డా మాక్రోస్… వయస్సు 92 ఏళ్లు… ఈమె కథ చెబితే కొన్ని దశాబ్దాల ఫిలిప్పీన్స్ విషాద చరిత్ర కూడా తెలుస్తుంది… ఈమె భర్త పేరు మాక్రోస్… నియంత… ఇద్దరూ కలిసి, అధికారాన్ని వినియోగించుకుని విపరీతంగా దోచుకున్నారు… పదవిలో ఉండి దేశాన్ని దోచుకున్న వాళ్లలో వీళ్లే ప్రపంచ చాంపియన్లు… వీళ్లకు సరిపాటి ఎవరూ రాలేకపోయారు… ప్రత్యేకించి ఈమె చెప్పిందే శాసనం… తన విలాసాలు, విదేశీ పర్యటనలు, రాజరిక వైభవాలకు దేశ సంపద హారతి కర్పూరం అయ్యింది…

వేలాది మంది హత్యలకు గురయ్యారు… జైళ్లపాలయ్యారు… జైళ్లలోనూ అకృత్యాలు, అమానవీయ ఘట్టాలు… 1965 నుంచి 1986 వరకూ సాగింది మార్కోస్ క్రూర పాలన… పరిస్థితులు ఎదురుతిరిగాయి… ప్రజల్లో విప్లవం చెలరేగింది… అర్ధరాత్రి దేశం విడిచిపారిపోయారు మార్కోస్ దంపతులు… హవాయిలో ప్రవాస జీవితం… కానీ అప్పటికే అమెరికా, స్విట్జర్లాండ్ తదితర దేశాల్లోని బ్యాంకుల్లో బోలెడు సంపదను దాచిపెట్టారు… హవాయికి కూడా పెట్టెలకొద్దీ ఆభరణాలను, బంగారు ఇటుకలను తీసుకుపోయారు… 413 రకాల ఆభరణాలు, 79 జతల చెవిదుద్దులు, 24 బంగారు ఇటుకలు, రత్నాలు, 717 మిలియన్ డాలర్ల నగదు… ఓహ్…

Ads

imelda

ఫిలిప్పీన్స్‌లో వదిలేసినవి కూడా బోలెడు… అందులో ఇమెల్డాకు చెందిన 3 వేల జతల చెప్పులు, బూట్లు… (ఏం చేసుకునేదో…) 508 గౌన్లు… అప్పట్లో జయలలిత ఇంట్లో స్వాధీనం చేసుకున్నప్పుడు చెప్పులు, దుస్తులు, చీరెల సంఖ్య చూసి ఇండియా మొత్తం ఆశ్చర్యపోయింది కదా… ఇమెల్డా జయలలితకు వేయి రెట్లు… అప్పట్లో మార్కోస్ అనే పేరు వింటేనే దేశవాసుల్లో కంపరం, కలవరం… ఇక ఇక్కడ సీన్ కట్ చేద్దాం…

1989లో మాక్రోస్ మరణించాడు… (తను మరణించినప్పుడు మరణశయ్య దగ్గర కొడుకు బాంగ్ బాంగ్ మార్కోస్ మాత్రమే ఉన్నాడు…) 1991లో ఇమెల్డా తిరిగి ఫిలిప్పీన్స్ వచ్చేసింది… ప్రపంచవ్యాప్తంగా బోలెడు కేసులు… పలు దశల్లో ఉన్నయ్… రాజకీయాల్లోకి ఎంటరైంది… అధ్యక్ష పదవికి కూడా పోటీపడింది… జనం ఛీత్కరించారు… ఇక కొడుకు బాంగ్ బాంగ్ కూడా రాజకీయాల్లో ఎదిగాడు… ఈలోపు అధ్యక్షుడు డ్యుటెర్టే రాజకీయాల నుంచి తప్పుకున్నాడు… తన హయాంలో కూడా తను వేలాది మందిని డ్రగ్స్ నియంత్రణ పేరిట చంపించాడు… ఆయన కూతురిని ఉపాధ్యక్ష అభ్యర్థిగా తీసుకుని, బాంగ్ బాంగ్ కొత్త పద్ధతిలో క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు… (ఇద్దరు భీకర హంతక పాలకుల వారసుల్లో ఒకరు అధ్యక్ష అభ్యర్థి, మరొకరు ఉపాధ్యక్ష అభ్యర్థి)…

టిక్‌టాక్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్… తదితర సోషల్ మీడియా వేదికలుగా రకరకాల ఫేక్ స్టోరీస్ ప్రచారంలోకి తీసుకొచ్చాడు… తండ్రి, తల్లి సాగించిన క్రూర పాలన, దోపిడీ కథల్ని మరిపించేలా కొత్త కథలు అల్లారు… జనం మెదళ్లలోకి బలంగా ఎక్కించారు… మన ఇండియాలాగే ఆ దేశంలోనూ జనం సోషల్ మీడియా అడిక్ట్స్… చివరకు నాటి మార్కోస్ పాలనను ‘బంగారు యుగం’గా చిత్రీకరించేశారు… ఇప్పుడు ఏం జరిగింది..? నాటి మార్కోస్ వారసుడు బాంగ్ బాంగ్ గెలిచాడు… పరోక్షంగా తల్లి ఇమెల్డా గెలిచింది… మరోవైపు డ్యుటెర్టే బిడ్డ సారా దేశ ఉపాధ్యక్షురాలు కాబోతోంది… మొత్తం చరిత్ర ఎలా మారిపోయిందో చూశారు కదా… సోషల్ మీడియా అనే పైత్యం వల్ల…

ఇక మన పీకే సంగతికొద్దాం… తను నమ్ముకున్నది కూడా అదే… తను డబ్బు తీసుకున్న పార్టీలకు, నాయకులకు సోషల్ మీడియా సాయంతో.., వేలు, లక్షల ఫేక్ ఖాతాలతో బ్రాండింగ్… ఫేక్ స్టోరీలు… ప్రజల్లోకి రెగ్యులర్‌గా క్యాంపెయిన్… అదే పీకే ఫార్ములా… ఫిలిప్పీన్స్‌లో ఓ క్రూర నియంత చరిత్రను కొత్త అబద్ధాలతో కప్పేసి, వారసుడిని కుర్చీ ఎక్కించింది ఈ క్యాంపెయినే… ఇతరత్రా కారణాలు కూడా ఉండవచ్చుగాక… కానీ సోషల్ మీడియా దుర్వినియోగ ప్రభావం కూడా బోలెడు… వెరసి… ఒకప్పుడు ప్రాణభయంతో, చేతికి అందినకాడికి తీసుకుని పారిపోయిన నియంత, అతిపెద్ద దోపిడీదారు ఇమెల్డా కుటుంబం మళ్లీ గద్దెనెక్కుతోంది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions