ప్రపంచంలోని ఏ దేశమైనా సరే… తమ సార్వభౌమత్వాన్ని కించపరిచేలా, తమ చట్టాల్ని తప్పుపట్టేలా, తమ దేశ పరువు ప్రతిష్ఠల్ని అవమానించేలా… అది సాహిత్యం, సినిమా వంటి ఏ క్రియేటివ్ వర్క్ అయినా సరే, కల్పిత ఊహాగానం అని చెప్పినా సరే అంగీకరించదు… అదేమిటో ఇండియాలోనే అన్నీ చెలామణీ అవుతాయి… వేరే దేశస్థులే కాదు, మన దేశస్థులు ఈ విషయంలో ఇష్టానుసారం వ్యవహరించినా మన ప్రభుత్వానికి ఏమీ చేతకాదు…
అంతెందుకు… మన రాజ్యవ్యవస్థ బలాన్ని, టెంపర్‌మెంట్‌ను బ్యాడ్ లైట్‌లో ఫోకస్ చేసేలా కేజీఎఫ్-2 సినిమా అసమంజసమైన స్వేచ్ఛను తీసుకున్నా మన సెన్సార్‌కూ సోయి లేదు… సర్కారుకు తెలివిడి కూడా లేదు… పైగా ఇది ప్రపంచవ్యాప్తంగా వేల థియేటర్లలో విడుదలైన పాన్ ఇండియా సినిమా… సెన్సారింగ్ తప్పించుకునే ఓటీటీ కంటెంట్ కాదు… ఏదో యూట్యూబ్‌లో పెట్టేసే చిల్లర వీడియో కూడా కాదు… దాదాపు 1200 కోట్ల దాకా వసూళ్లు సాధించింది… ఇంకా దండుకుంటూనే ఉంది…
ప్రధాని ఎదురుగా… పార్లమెంటుకు వెళ్లి… ఓ ఎంపీని ఓ క్రిమినల్ కాల్చిపారేస్తే… ప్రధాని చేష్టలుడిగి, మాటలు దక్కి చూస్తూ ఉండిపోతే… అసలు ఆ సీన్‌ను ఎలా అంగీకరించింది సెన్సార్..?! అలాంటి సీన్ల లోతుల్లోకి వెళ్లి, సమీక్షించడం కాసేపు ఆపి… మరో నవ్వొచ్చే, మన మీద మనకే జాలికలిగే మరో విషయం… ప్రజల్లోకి బలంగా వెళ్లే క్రియేటివ్ కంటెంటు మీద ప్రభుత్వ నియంత్రణ లేమికి ఓ ఉదాహరణ…
Ads
ఈ ఫోటో చూశారు కదా… కేజీఎఫ్-2 సినిమాలోని ఓ సీన్… సీబీఐ చీఫ్ రాఘవన్ పాత్ర… పెద్ద ఆఫీస్ ఛాంబర్… నా ఆఫీసులో గోడగడియారం ఆగిపోతేనే కీ ఇచ్చే దిక్కులేదు, దేశంలోకెల్లా అతి పెద్ద క్రిమినల్‌ను ఎవడేం చేయగలడు అని బాధపడిపోతూ ఉంటాడు… తన వెనుకే ఓ పెద్ద భారతీయ రాజకీయ చిత్రపటం వేలాడదీసి ఉంటుంది… మన దేశ అంతర్భాగాలు తెలుపు రంగులో, ఇరుగుపొరుగు దేశాలు గ్రే కలర్‌లో కనిపిస్తుంటాయి…
జమ్ముకశ్మీర్ పార్ట్ చూడండి… ఆక్సాయ్ చిన్ ఏరియా మీద గీతలు గీసి, అస్పష్టంగా మార్చేసి ఉంది… కశ్మీర్‌లో మెజారిటీ భాగాన్ని ఈ దేశంలో అంతర్భాగం కానట్టుగా చూపించారు… కొంత ఏరియాను పాకిస్థాన్ ఆక్రమించుకున్నా… ఇంకొంత చైనాకు ఉచితంగా ఇచ్చేసినా… పనిలోపనిగా చైనా కూడా కొంత భాగాన్ని ఆక్రమించినా… ఆ ప్రాంతాలు దురాక్రమణ జరిగిన భారతీయ భౌగోళిక ప్రాంతాలే అనేది మన వాదన… మన అఫిషియల్ స్టాండ్… ఎప్పటికైనా వాటిని స్వాధీనం చేసుకుంటాం అనేదే మన విదేశాంగ అధికారిక విధానం…
మరి ఒక సీబీఐ చీఫ్ తన అధికారిక ఛాంబర్‌లో దీనికి భిన్నంగా చిత్రించబడిన పటాన్ని ఎలా వేలాడదీసుకున్నాడు… జమ్ముకశ్మీర్ భాగాల్ని మన దేశం నుంచి విడిగా చూపించినా… వేరే దేశాల్లో భాగాలుగా చూపించినా… ఏ అవసరం కోసం చిత్రించినా సరే అది నేరం అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది పలుసార్లు… శిక్షలేమిటో కూడా చెప్పింది… మరి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ అంత నిర్భీతిగా ఎలా చూపించాడు… పాత్ర కోణంలో చూసినా ఫూలిష్‌నెస్…
అవున్లెండి, ఈ దేశ సార్వభౌమత్వ ప్రతీక పార్లమెంటులోకి జొరబడి, ఏకే-47 తూటాలు అయిపోయేదాకా పిచ్చిపట్టినట్టు కాలుస్తూనే ఉంటాడు హీరో… గుస్‌కే మారేంగే అని బీరాలు పలికిన ప్రధాని పాత్ర అలా చూస్తుండిపోతుంది… మరి అక్కడ సెక్యూరిటీ..? పోనీ, ప్రధాని రక్షకదళం..? అక్కడికి అడుగుపెట్టకుండా నిరోధించే సీఆర్పీఎఫ్ బలగాలు..? అంత సీరియస్ సీన్‌నే ఎవడూ పట్టించుకోలేదు… ఆఫ్టరాల్ చిత్రపటానిదేముంది..?
Share this Article