ప్రతి హిందువు తన జీవితంలో ఒకసారైనా చార్ ధామ్ యాత్ర చేయాలని అనుకుంటాడు… అమరనాథ్, మానససరోవర్ అందరికీ చేతకావు… చాలా వ్యయప్రయాస సాహసయాత్రలు అవి… చార్ ధామ్ అంటే గంగోత్రి, యమునోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్… వద్దురా బాబూ, ప్రస్తుతం ఈ యాత్రకు వెళ్లకండి అని చెప్పడం యాంటీ సెంటిమెంట్… కానీ చెప్పకతప్పని దుస్థితి… వద్దు, ప్రస్తుతం చార్ ధామ్ యాత్ర ప్లాన్లలో ఉన్నవాళ్లు పునరాలోచన చేయడం బెటర్… చాలా బెటర్…
మామూలు రోజుల్లోనే చార్ ధామ్ ఓ క్లిష్టమైన ఆధ్యాత్మిక యాత్ర… కానీ ఇప్పుడు..? మరీ ప్రతికూలంగా ఉంది… అనారోగ్యం, ప్రతికూల వాతావరణంతో 39 మంది మృత్యువాత పడ్డట్టుగా ఈనాడు స్టోరీ చెబుతోంది… అది ధ్రువీకృత, అధికారిక సమాచారం కాకపోవచ్చుగాక… కానీ పరిస్థితులు మాత్రం అలాగే తీవ్రంగానే ఉన్నాయి…
Gkram Kumar…. ఫేస్ బుక్ వాల్‌పై కనిపించింది ఓ పోస్టు… ఓసారి చదవండి…
Ads
ప్రస్తుతం ఋషికేశ్ లో రద్దీ చూసారా? ఎవరైనా ఋషికేశ్ వెళ్ళేవారు ఉంటే దయచేసి ఆగిపోండి. ఎవరైనా ట్రావెలర్ తీసుకువెళ్తానని చెప్పినా నమ్మకండి. వాహనం నుండి రూమ్స్, హెలికాప్టర్ వరకు ఊహకి అందనంత కాస్ట్ పెరిగిపోయాయి. కేధార్ నాథ్ వద్ద రూమ్ రెంట్ రూ.50,000 నుండి లక్ష ఉందంటే నమ్ముతారా? కనుక ఎవరూ దయచేసి చార్ ధామ్ యాత్రకు వెళ్లవద్దు. 9 సీటర్ వెహికల్ కూడా 10 రోజులకి రూ.80,000 నుండి 1,50,000 ఉంది. కనుక ఎవరైనా తీసుకెళ్తామని చెప్పినా వెళ్ళకండి. బహుశా వారికి కూడా అవగాహన ఉండదు. భయంకరమైన ట్రాఫిక్ ఉంది. కనుక ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఋషికేష్ నుండి నీల కంఠేశ్వర్ వెళ్లి రావడానికి 5 గంటలు పైన పట్టింది. మాములుగా 2 గంటల్లో మహా అయితే 3 గంటల్లో పూర్తి కావాలి. 5 గంటలు దాటినా ట్రాఫిక్ లోనే ఉన్నారు. వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి ఉన్నాయి. రూమ్ రెంట్స్ అందుబాటులో లేకపోగా ఖాళీ కూడా లేవు. వేలాదిమంది రోడ్ల మీద పడుకున్నారు రాత్రి… పాస్ ఖచ్చితంగా ఉండాలి. ఉన్నా ఋషికేష్ నుండి పైకి వెళ్లాలంటే 3 నుండి 5 రోజుల సమయం పడుతుంది. రూమ్స్ లేవు. ఉన్నా వేలాది రూపాయలు పెట్టినా దొరక్క ఇబ్బంది పడుతున్నారు. జులై 20 వరకు మీ యాత్రని వాయిదా వేసుకోండి…
కరోనా అనంతరం ఈ గుళ్లు తెరిచారు… ఒక్కసారిగా భక్తగణం విరుచుకుపడుతోంది… సౌకర్యాల కోణంలో చూస్తే ఇప్పుడు వస్తున్న రద్దీకి సరిపోవు… అక్కడి ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోవు… అమరనాథ్ యాత్రకు కోట్లకుకోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఎందుకోగానీ చార్ ధామ్‌ను పట్టించుకోదు… నిజం… కరోనా అనంతరం పోస్ట్ కోవిడ్ సమస్యలు అలాగే ఉంటాయి… ఊపిరితిత్తులు బలహీనమైపోయి ఉంటాయి… చార్ ధామ్ యాత్రలో యాత్రికులకు, ప్రత్యేకించి దక్షిణాది భక్తులకు ఎదురయ్యే ప్రధాన సమస్య ఇది… ఆక్సిజన్ సరిపోదు… దీనికితోడు వసతి సౌకర్యాలు లేవు…
రవాణా సౌకర్యాలు సరిపోవు, రూమ్స్ లేవు, విపరీతమైన ధరలు… ఐనా రోజుల తరబడీ ఆగిపోయే ప్రయాణం… ఒక్కసారి ఈ వీడియో చూడండి…
కనీసం సంప్రదించడానికి, సాయం అడగటానికి కూడా ఎవరూ దొరకరు… టాయిలెట్లు, ఆక్సిజన్ కేంద్రాలు, వైద్య శిబిరాలు… వాట్ నాట్..? ప్రతిదీ సమస్యే… ఇక ప్రైవేటు వెహికిల్స్ వాళ్ల నోటికి మొక్కాలి… వాళ్లు చెప్పిందే రేటు… కొన్నిసార్లు హెలికాప్టర్ల ఛార్జీల్ని మించి..! ఏమాటకామాట… మన దక్షిణాది రాష్ట్రాలు చాలానయం… కనీసం ప్రజల నుంచి విమర్శలు వస్తాయనే భయం ప్రభుత్వాల్లో ఉంటుంది… ఎంతోకొంత పట్టించుకుంటారు… కానీ చార్ ధామ్ పరిధి ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలకు ఏమీ పట్టదు… దేవుళ్ల దయ, భక్తుల ప్రాప్తం… అంతే…!!
Share this Article