అసలు సినిమారంగంలో ప్రముఖుల బయోపిక్స్ తీస్తే వాళ్ల కొడుకులే వాటిల్లో నటించాలా..? అది కూడా వారసత్వం సమస్యేనా..? ఈ చర్చ ఎందుకొస్తున్నదీ అంటే… సాధారణంగా సినిమా ప్రెస్‌మీట్లలో కొన్ని రొటీన్, కాజువల్, నాన్-సీరియస్ ప్రశ్నలు వేయబడుతూ ఉంటయ్… ఏదో ఒకటి అడగాలి… ఇంటర్వ్యూలలో కూడా హీరోయిన్లను అడిగే జనరల్ ప్రశ్న ‘‘పెళ్లెప్పుడు చేసుకుంటున్నారు..?’’… ఆమె పెళ్లి చేసుకుంటేనేం, చేసుకోకపోతేనేం అనకండి… సినిమా ప్రశ్నలు అలాగే ఉంటయ్… వాళ్ల పెళ్లిళ్లు కుదిరితే, కడుపులు పండి, కొడుకో బిడ్డో భూమ్మీద పడేదాకా బొచ్చెడు వార్తలు, ఫోటోలు…
ఫాఫం, ప్రభాస్ వంటి ముదురు హీరోలకు కూడా ఈ ప్రశ్న తప్పడం లేదు… ఈమధ్య సేమ్, ఇదే టైపులో మహేష్ బాబుకు, వెంకటేష్‌కు ఒకే తరహా ప్రశ్న ఎదురైంది… ‘‘మీ తండ్రిగారి బయోపిక్‌లో మీరు నటిస్తారా..? ఎప్పుడొస్తుంది..?’’… ఆలూలేదు, చూలూలేదు అన్నట్టుగా అసలు ఆ బయోపిక్స్ వస్తాయో లేదో తెలియదు, మీరు నటిస్తారా అనే ప్రశ్న మాత్రం రెడీ…
అవునూ, సూపర్‌స్టార్ కృష్ణ బయోపిక్ అయితే మహేష్ బాబే నటించాలా..? రామానాయుడు బయోపిక్ తీస్తే వెంకటేషే నటించాలా..? ఎందుకు..? (మహానటి సినిమాలో అక్కినేని పాత్ర నాగచైతన్యే ఎందుకు చేయాలి..?) అక్కినేని నాగార్జునకు కూడా ఈ బయోపిక్ ప్రశ్న అక్కడక్కడా ఎదురైనట్టుంది… తనకు పెద్ద ఇంట్రస్టు లేనట్టుగా బ్లంట్‌గా నెగెటివ్ రియాక్షన్ ఇచ్చేసరికి ఇక ఆ ప్రశ్నలు ఆగిపోయినట్టున్నాయి… అక్కినేని పాత్రను నాగార్జునే ఎందుకు చేయాలి..?
Ads
ఎన్టీయార్ బయోపిక్ కథానాయకుడులో బాలకృష్ణ నటించాడు అంటే దానికి ఓ కారణం ఉంది… ఎన్టీయార్‌తో కలిసి పలు సినిమాలు చేశాడు బాలయ్య, తన తండ్రి నటించిన పాత సినిమాలు అంటే బాలయ్యకు ఓ పిచ్చి… ఆ వేషాలన్నీ తనూ వేసుకుని, అన్నీ ఒకే సినిమాలో చూసుకోవడం, ప్రేక్షకులకు చూపించడం తనకు సంతోషాన్ని కలిగించేది… పైగా ఎన్టీయార్ నటవారసుడిని నేనే అని పరోక్షంగా చేసే ప్రకటన…
సేమ్, మహానాయకుడు సినిమాలో ఎన్టీయార్ పాత్రలో ఎవరైనా నటించవచ్చు… బాలయ్యే నటించాలని ఏమీ లేదు… కాకపోతే కథానాయకుడికి సీక్వెల్‌లాగా కథ నడిపించేశారు కాబట్టి బాలయ్యే ఆ పాత్రలోనూ కొనసాగాడు… ఎన్టీయార్ నటజీవితంలో పెద్ద ఘర్షణ, ఎమోషనల్ ఇష్యూస్ ఉండకపోవడంతో ఆ సినిమా తెలుగు ప్రేక్షకుడికి పెద్దగా ఎక్కలేదు… ఎన్టీయార్ వంటి లెజెండరీ హీరో బయోపిక్ తీస్తే ఎవరికీ చూడాలనే ఇంట్రస్టు కలగకపోవడం నిర్మాతలు-దర్శకుల వైఫల్యం…
సేమ్, రామానాయుడు జీవితంలో పెద్ద ఘర్షణ, జీవితపోరాటం, కన్నీళ్లు, ఇతర ఎమోషన్స్ ఏముంటాయని..? సగటు ప్రేక్షకుడికి పెద్ద ఇంట్రస్టు ఏం కలుగుతుంది..? అప్పుడెప్పుడో ప్రేమ్‌నగర్ సినిమా టైంలో కొన్ని ఆర్థికకష్టాలు గట్రా తప్ప తన జీవితం మొత్తం సాఫీగానే సాగింది… తను ఓ సినిమా వ్యాపారి… సమయానికి పెద్దకొడుకు చేదోడుగా వచ్చి వ్యవహారాలు చూసుకోవడం మొదలుపెట్టాడు… ఇంకోకొడుకును హీరోను చేశాడు… ఓ స్టార్ నిర్మాతగా ఆస్తులు, విలాసాలు, వైభోగాలు, సంపద… వాట్ నాట్..? ఆయన అనుభవించనిది ఏముంది..? తను పుట్టింది కూడా ఓ ధనిక కుటుంబంలోనే…!! పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలు దక్కాయి… ఓ సగటు నిర్మాతకు ఎన్నోరెట్లు అధికానందంగా జీవితం గడిపాడు… ఎఫ్-3 ప్రమోషన్ ప్రెస్‌మీట్‌లో ‘‘నేను డాడీ పాత్ర చేయడానికి రెడీ’’ అన్నాడు వెంకటేష్… నిజంగా రామానాయుడు బయోపిక్ తీస్తారా..? అదీ అసలు ప్రశ్న…
రామానాయుడి కథతో పోలిస్తే కృష్ణ వేరు… కృష్ణ బేసిక్‌గా నటుడు… తను కూడా కొన్ని సినిమాలు నిర్మించి ఉండవచ్చు, దర్శకుడిగా కూడా చేసి ఉండవచ్చు… రామానాయుడిలాగే తనకూ ఓ స్టూడియో ఉండవచ్చు….. తన సమకాలీన హీరోలతో పోలిస్తే పలు విషయాల్లో హీరో నటుడిగా కాస్త తక్కువే కావచ్చుగాక… ఐతేనేం, తను లైఫ్‌లో కూడా రియల్ ఫైటర్… సాహసి… పాతుకుపోయిన ఎన్టీయార్‌తో కూడా పలు విషయాల్లో ఢీకొట్టాడు… సినిమాల్లోనే కాదు, ఎన్టీయార్‌లోని రాజకీయవేత్తను కూడా ఎదుర్కున్నాడు… ఏళ్ల తరబడీ మూడేసి షిఫ్టులు పనిచేసేవాడు… తొలి కౌబాయ్, తొలి గూఢచారి, తొలి ఫ్యూజీ కలర్, తొలి 70 ఎంఎం, తొలి 6 ట్రాక్ సౌండ్, తొలి ఫుల్ సినిమా స్కోప్… తొలి అంటేనే కృష్ణ…
తన లైఫ్‌లో ఇంట్రస్టింగ్ షేడ్స్ ఉన్నయ్… ఐనాసరే, తన బయోపిక్ మీద పెద్దగా కదలికలేమీ లేవు… మహేష్ బాబు కూడా ఇదే ప్రశ్న ఎదురైతే… నేనూ నాన్న ఫ్యాన్‌గా ఆ బయోపిక్‌కు తొలి ప్రేక్షకుడిని అవుతాను, అవసరమైతే నిర్మాణానికి డబ్బులు పెడతాను అన్నాడే తప్ప తను కృష్ణ పాత్రలో నటిస్తానని చెప్పలేదు… ఆ ప్రశ్న పట్ల పెద్దగా ఆసక్తీ చూపలేదు… అవును… కృష్ణ కృష్ణే… తనను ఎవరూ అనుకరించలేరు… కొడుకైనా సరే… వెరసి… అక్కినేని, రామానాయుడు, కృష్ణ… ఈ ముగ్గురి బయోపిక్కులూ ఇప్పట్లో డౌటే..!!
Share this Article