కేజీఎఫ్ సినిమా హీరో యశ్‌కు మస్తు పాపులారిటీని తెచ్చిపెట్టింది… ఆ సినిమాతో తను ఎక్కడికో వెళ్లిపోయాడు… ఆ పాపులారిటీని సొమ్ము చేసుకోవడానికి వెంటనే తన పాత సినిమాల్ని హడావుడిగా డబ్ చేసి, ఇతర భాషల్లో విడుదల చేస్తారని అనుకుంటున్నదే… అలాంటి సినిమా ఒకటి వచ్చేస్తోంది తెలుగులో… దాని పేరు లక్కీ స్టార్… క్రూరంగా, గంభీరంగా, మొరటుగా, విలనీ షేడ్స్‌తో అదరగొట్టే యశ్ కాదు ఈ సినిమాలో… ఓ లవర్… అసలు అదికాదు చెప్పుకోవాల్సింది…
నిజానికి ఈ సినిమా పదేళ్ల క్రితం వచ్చింది… (2012… అదే సంవత్సరం తెలుగులో హీరో శ్రీకాంత్ నటించిన లక్కీ సినిమా కూడా విడుదలైంది… అందుకని ఇప్పుడు లక్కీ స్టార్ పేరిట యశ్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు…) మరి పదేళ్ల నాటి ట్రెండ్‌కూ ఇప్పటికీ తేడా లేదా..? ఆ సినిమాను ఇప్పుడు ఎవరు చూస్తారు అనే ప్రశ్నలు మనం వేయొద్దు… ఎంతొస్తే అంత…! ఆల్‌రెడీ దీన్ని హార్ట్ అటాక్-3 పేరిట హిందీలో అనువదించారు… నాలుగు డబ్బులు వచ్చినయ్… ఇప్పుడు తెలుగులోకి డబ్ చేస్తున్నారు… థియేటర్లలో నడిచినా నడవకపోయినా ఓటీటీ, శాటిలైట్ టీవీ రైట్స్ డబ్బులు వస్తాయిగా… ఆఫ్టరాల్ డబ్బింగ్ ఖర్చే కదా పెట్టుబడి…
అంటే, ఇదోరకం పాన్-ఇండియా సినిమా… వాస్తవానికి పాన్- ఇండియా సినిమా అంటే ఏమిటి..? అదో బ్రహ్మపదార్థం… నాలుగు సౌత్ ఇండియన్ భాషల్లో ప్లస్ హిందీలో రిలీజ్ చేస్తే అది పాన్ ఇండియా అనిపించుకుంటుందట… మరి బెంగాలీ, రాజస్థానీ, గుజరాతీ, మరాఠీ ఎట్సెట్రా భాషల మాటేమిటని అడక్కండి… నార్త్ స్టేట్స్‌లో హిందీ చల్తా…
Ads
ఈ సినిమాలో యశ్ ఫోటో చూశారా..? చిత్రవిచిత్రమైన గడ్డం… ఆ పక్కనే రమ్య… ఆమె గుర్తుంది కదా… అసలు పేరు దివ్యస్పందన… తెర పేరు రమ్య… కొంతకాలం కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం హెడ్డు… పలు వివాదాలు కూడా… కానీ కొంతకాలంగా ఆమె ఆ పోస్టులో లేదు, అసలు కాంగ్రెస్‌లో ఉందో లేదో కూడా తెలియదు… వార్తల తెర మీద మాత్రం కనిపించడం లేదు…
మరో విశేషం ఉంది… ఈ సినిమాను తీసింది ఎవరో తెలుసా..? రాధిక కుమారస్వామి… అదేనండీ… కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఉన్నాడు కదా… ఆయన భార్య ఈమె… తను కూడా ఒకప్పుడు హీరోయిన్… నిర్మాత… అంతకుముందు పెళ్లి ఫెయిలయ్యాక కుమారస్వామిని చేసుకుంది… మరో భార్య అనిత ద్వారా కలిగిన కొడుకు నిఖిల్ గౌడ కూడా హీరోయే… సో, కాంగ్రెస్ హీరోయిన్, జేడీఎస్ నిర్మాత… భలే…!! చివరగా… ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల పాత్రలతోపాటు హీరోయిన్ బాగా ప్రేమించే ఓ కుక్కది కూడా ప్రధానపాత్రే…!!
Share this Article