జాతిరత్నాలు, డీజే టిల్లు సినిమాలు తెలుసు కదా… లాజిక్కులు, కథాగమనం, తొక్కాతోలూ ఏమీ పట్టించుకోరు… వాటిల్లో కొన్ని సీన్లు చూస్తుంటే, అరె, ఏందిర భయ్, వీటికన్నా జబర్దస్త్, కామెడీ స్టార్స్, డ్రామా కంపెనీ, క్యాష్, ఢీ వంటి షోలలో స్కిట్స్ బెటర్ కదా అనిపిస్తయ్… ఆ క్షణానికి నవ్వించాయా లేదానేదే ప్రధానం… చివరివరకూ థియేటర్లో ప్రేక్షకుడిని కూర్చోబెట్టామా లేదానేదే ముఖ్యం… ఏవో తోచిన కొన్ని వింత మేనరిజాలు, నాలుగు పంచ్ డైలాగులతో కథ నడిపించేయాలి, అంతే… ప్రేక్షకుడు కూడా ఇలాంటి వినోదాన్నే కోరుకుంటున్నారు అని ఎఫ్3 నిర్మాత, దర్శకుడు, హీరోల ప్రగాఢ నమ్మకం… ఎఫ్2 విజయం కూడా అదే చెప్పింది… దాంతో ఎఫ్3 విషయంలో కూడా గుడ్డిగా దాన్నే ఫాలో అయిపోయారు…
ఐనా సరే, ఏదో ఓ మూల సందేహం… ఎఫ్2 స్థాయి సరిపోతుందా..? డోస్ పెంచాలా..? చివరకు డోస్ పెంచడానికే నిర్ణయం… ఓ హీరోకు రేచీకట్లను తగిలించారు… మరో హీరోకు నత్తిని అంటగట్టారు… ఐనా డౌటే… తారాగణాన్ని పెంచేశారు… నాసిరకం టీవీ కామెడీ స్కిట్ తరహాలో హిట్ సినిమాల స్పూఫ్ పోకడలు కూడా చేర్చారు… నారప్ప టైపు, వకీల్ సాబ్ టైపు యాక్షన్ అదే… ఆల్రెడీ వెంకటేష్, వరుణ్‌తేజ్ ఉన్నారు కదా… రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, రఘుబాబు ఉండనే ఉన్నారు కదా… ఇక సునీల్ చేరాడు, ఐనా సరిపోదేమో అనుకుని ఆలీని తెచ్చారు… వెన్నెల కిషోర్, మురళీశర్మ సరేసరి…
మహిళా పాత్రలకు సంబంధించి… ఆల్రెడీ ఎఫ్2 బ్యాచ్ నుంచి తమన్నా, మెహ్రీన్ ఉన్నారు… సరిపోరు అనుకున్నారేమో, సోనాల్ చౌహాన్ వచ్చి చేరింది… పైగా పూజా హెగ్డే ఐటం సాంగ్ పెట్టారు… మొత్తానికి భారీ తారాగణం తెర నిండా కనిపిస్తూ… కొన్ని దశలో ఆ బరువు తట్టుకోలేక తెర వంగిపోతుందేమో అనిపించేలా… అంతమందిని డీల్ చేయడం చాలా పెద్ద టాస్క్… వీళ్లకుతోడు తులసి, ప్రగతి, వై.విజయ, అన్నపూర్ణ, ఝాన్సీ తదితరులు తెలుగు టీవీ సీరియళ్లలో పాత్రల్లా కనిపిస్తూ ఉంటారు… (ఇలా 30 మంది దాకా ఉంటారని దిల్ రాజు ఏదో మీట్లో చెప్పాడు…)
Ads
పూజా హెగ్డే… మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వరుసగా అన్నీ డిజాస్టర్లు… ఇప్పుడు ఎఫ్3లో ఐటమ్ సాంగ్… అంతటి పూజా హెగ్డే ఐటం సాంగ్ అంటే కాస్తోకూస్తో హడావుడి, ఆసక్తి క్రియేట్ కావాలి కదా… అదేమీ లేదు… ఎవరూ పట్టించుకోలేదు… దేవిశ్రీప్రసాద్‌లో పస తగ్గిపోయింది… పూజా హెగ్డే మీద ప్రేక్షకుల ఆసక్తీ పడిపోయింది… (ట్యూన్, పర్ఫామర్ బాగా కుదరాలే గానీ ఒక ఐటం సాంగ్ ఎంత హిట్టవుతుందో చెప్పాలంటే పుష్పలోని సమంత పాట ఊ అంటావా అనే పాట మంచి రీసెంట్ ఉదాహరణ…)
ఐనా సరిపోదు… ఫుల్లు ప్రమోషన్ వర్క్ చేశారు… తెలుగు టాప్ స్టార్స్ అందరూ కనిపించేలా ఓ ఎపిసోడ్ కూడా పెట్టారు… ఇలా ఎన్ని వీలయితే అన్ని మసాలాలు వేశాడు దర్శకుడు… చివరకు అదోరకం వంట తయారైంది… అంటే బాగా లేదని అనుకోకండి… తిన్నంతసేపూ బాగానే ఉంటుంది… ఏదో తింటున్నాం గానీ, ఏం తింటున్నామనే సోయి కూడా కలగదు… ఇదోరకం కామెడీ…
నిజానికి ఇలాంటి సినిమాలకు నటీనటుల కామెడీ టైమింగ్ ప్రాణం… ఈ కోణంలో పర్లేదు… వెంకటేష్, వరుణ్, రాజేంద్రప్రసాద్, సునీల్, ఆలీ, రఘుబాబు, వెన్నెలకిషోర్ ఎవరికీ వంకపెట్టలేం… వేరే ఎమోషన్స్ ఏమీ ఉండని సినిమా కాబట్టి… అది గానీ, కథాకాకరకాయ సమీక్ష గానీ ఏమీ ఉండవు ఈ సినిమాకు… కాకపోతే సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ మరోసారి తుస్సు… ఒకప్పటి టాప్ స్టార్ మ్యూజిషియన్… ఇప్పుడు ఎందుకిలా తయారయ్యాడు..? ఏమోలెండి… ఎఫ్4లో మూడో హీరో కూడా వస్తాడని దర్శకుడు అప్పుడే బెదిరిస్తున్నాడు… సార్, సార్… చిన్న ప్రశ్న… ముగ్గురు హీరోలు సరే… కనీసం అయిదారుగురు హీరోయిన్లను, మరో యాభై మంది ఇతర తారాగణాన్ని దింపుతారు కదా సార్…!! రెండు మూడు ఐటం సాంగ్స్ ప్లాన్ చేయండి సార్..!! (యూఎస్ ప్రీమియర్ షోల ఫీడ్ బ్యాక్, ఇన్పుట్స్ ఆధారంగా…)
డబ్బులు, సక్సెస్ ఈ ఇండస్ట్రీలో ముఖ్యమే… నిజమే కానీ… ఏం సినిమాలు చేస్తున్నామనేది కూడా ప్రధానమే… వెంకటేష్ ఈ వయస్సులో నారప్ప, దృశ్యం వంటి సినిమాలు చేస్తే తన పాత ఇమేజీకి తగినట్టుగా గుర్తుండిపోతాడు… ఇలాంటి రేచీకటి బాపతు చిత్రమైన కామెడీ పాత్రలు కాదు… వరుణ్తేజకు ఇలాంటి పాత్రలు అసలు సరైనవి కావు… నిజానికి కంచె దగ్గర్నుంచి కూడా వరుణ్ పాత్రల ఎంపిక బాగుంటుంది అనే పేరుంది… కష్టపడతాడు, ఇంకా లాంగ్ కెరీర్ ఉంది, అప్పుడు ఈ నత్తి పాత్రలు నీకు దేనికి రాజా..?! అసలే గని దెబ్బ నుంచి తేరుకోలేదు కూడా..!!
Share this Article