ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ వంటి సినిమాల్ని థియేటర్లలో చూడటానికి ప్రేక్షకుడు కాస్త ఎక్కువ ఖర్చయినా భరించటానికి సిద్ధపడతాడు… అవసరమైతే తన తరువాత సినిమాల బడ్జెట్లో కొత్త పెట్టేసుకుంటాడు… కానీ ప్రతి దిక్కుమాలిన సినిమాను ప్రస్తుత టికెట్ రేట్లతో చూడటానికి ఇష్టపడడు… కాదు, అంతగా భరించే స్థితిలో లేదు మధ్యతరగతి ప్రజానీకం… ఈరోజుకూ లక్షల కుటుంబాలు కరోనా తాలూకు సంక్షోభం నుంచి తేరుకోలేదు… సిట్యుయేషన్ ఇలా ఉంటే…
జగన్ మీద ఒత్తిళ్లు తెచ్చి, బతిమిలాడి, దేబిరించి, సాగిలబడి… టికెట్ల ధరలు పెంచుకున్నారు హీరోలు… ఎందుకంటే పెద్ద లబ్ధిదారులు వాళ్లే కాబట్టి… వందల కోట్లను జనం నుంచి వసూలు చేస్తే అధికశాతం వాళ్ల బొక్కసాలే నిండుతాయి కాబట్టి…! తెలంగాణ ప్రభుత్వానిది ఏముంది..? ఎవడూ అడక్కపోయినా సరే, రేట్లు పెంచడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది… కానీ ఏం జరిగింది..? ఎదురుతన్నింది… జనం మామూలు సినిమాలు చూడటానికి థియేటర్ల వైపు వెళ్లడమే మానేశారు… అసలుకే మోసం వస్తోంది…
ఇంకా ఇంకా జనాన్ని పిండటానికి ఓటీటీలో చూడటానికి కూడా రేట్లు పెట్టేశారు… అవి ఎలా ఎదురుతంతాయో కూడా చూద్దాం… చూస్తాం… కేజీఎఫ్ ఓటీటీ రేటు ప్రకటించగానే పైరేటెడ్ కాపీలు వచ్చేశాయి… అందరూ షేర్లు చేసుకున్నారు… ఇప్పుడు ఏ మొహమాటాలూ లేవు… మా అభిమాన హీరో కాబట్టి ఖర్చయినా సరే, ఎంత రేటున్నా సరే థియేటర్ వెళ్లి చూస్తామనే పట్టుదలలు లేవు… మెల్లిగా విషయం అర్థమైపోయి ఇప్పుడు నిర్మాతలు, బయ్యర్లు నెత్తిన ఎర్రతువ్వాళ్లు వేసుకుని బోరుమంటున్నారు… ఆచార్య డిజాస్టర్ కాగా, సర్కారు వారి పాట పలు ఏరియాల్లో ఇంకా ఎదురీదుతూ ఉంది…
Ads
దెబ్బకు దెయ్యం దిగివచ్చింది… తత్వం బోధపడింది… ఎఫ్-3 ప్రమోషన్లలో అందరిదీ ప్రధానంగా ఒకటే మాట… పాత టికెట్ రేట్లే ఉంటాయి అంటూ..! అసలు ఆ రేట్లు కూడా ఎక్కువే అనే విషయం కూడా తెలుగు ఇండస్ట్రీకి త్వరలో బోధపడబోతోంది… ఇప్పుడు మేజర్ సినిమా ప్రమోషన్లలో కూడా ప్రధానంగా కనిపిస్తుంది ఇదే… ‘‘పాత సినిమా రేట్లే’’… అంతేకాదు, ఇంత చౌకగా కరోనా అనంతరం మీరు ఏ సినిమానూ చూసి ఉండరు అని చెప్పుకునేదాకా వెళ్లిపోయింది పరిస్థితి…
ఇక్కడ సీన్ కట్ చేయండి… వీళ్లకు అర్థం కానిదేమిటీ అంటే… థియేటర్లలోని ఇతరత్రా దోపిడీ కూడా ప్రేక్షకుడిని కంగారుపెడుతోంది, భయపెడుతోంది… కాఫీ, పాప్‌కార్న్, పార్కింగ్… ప్రతిదీ జేబు కత్తిరింపులే… థియేటర్‌కు వస్తే జేబుకు చిల్లే అనే సోయి ఉన్న వాడెవడూ థియేటర్ వైపు రావడం లేదు… రారు కూడా… ఇది ఇంకాస్త ఎక్కువ అర్థమైనట్టుంది మేజర్ నిర్మాతలకు… ఇదుగో ఇలా చెబుతున్నారు… తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో జస్ట్ 150, మల్టీప్లెక్సుల్లో కేవలం 195 మాత్రమే అంటున్నారు… (ఐనా ఏపీకన్నా ఎక్కువే)…
ఇది మినీ-పాన్-ఇండియా సినిమా… హిందీ, తెలుగు, మలయాళం భాషల్లో రిలీజ్ చేస్తున్నారు… కన్నడ, తమిళ భాషల్ని దయతో వదిలేసినట్టున్నారు… లేదా రీమేక్ రైట్స్ అమ్మేసుకుని ఉంటారు… సో, పరిస్థితి ఇలాగే ఉంటే… రాబోయే రోజుల్లో డిస్కౌంట్ స్కీమ్స్, వన్ ప్లస్ వన్ ఆఫర్స్, క్లియరెన్స్ సేల్స్ వంటివి ప్రచారంలో కనిపించినా ఆశ్చర్యపోవద్దు… మరి టికెట్ రేట్ల దెబ్బ అలా ఉంది… పగిలిపోతోంది…!! RRR సినిమాకు ఇంత భారీ వసూళ్లు కదా… బాహుబలితో పోలిస్తే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది… అది ఎందుకో… ఎప్పుడైనా రాజమౌళినో, దిల్ రాజునో అడిగితే చెబుతారు..!!
Share this Article