అపరిమిత అధికారాల్ని అనుభవించే ఐఏఎస్ అధికారుల పనితీరు ఎప్పుడూ పరిశీలనార్హమే… ఢిల్లీ స్టేడియంలో కుక్కతోపాటు వాకింగు చేయడానికి, అథ్లెట్లందరినీ బయటికి తరిమేసే… చివరకు తనే అరుణాచల్ ప్రదేశ్‌కు తరిమేయబడిన లేడీ ఐఏఎస్ ఆఫీసర్ రింకూ దుగ్గా కథ చదివాం కదా… గతంలో రాణివారు వస్తుంటే, వీథుల్ని ఖాళీచేయించేవాళ్లు సైనికులు… అదొక దర్పం… తలకెక్కిన అధికారం…
తమ మంచి పనితీరుతో, ప్రజల పట్ల బాధ్యతతో పనిచేసి మంచిపేరు తెచ్చుకున్న లేడీ ఐఏఎస్ అధికార్లు ఎందరో ఉన్నారు… అదేసమయంలో అవినీతి, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలతో ఛీత్కరింపబడినవారూ ఉన్నారు… ఎటొచ్చీ… కీలకమైన బాధ్యతల్లో ఉన్నవాళ్ల మాటతీరు, పనితీరు, ప్రవర్తన తీరు మీద పర్యవేక్షణ ఉంటున్నదా అనేదే పెద్ద ప్రశ్న… ఇదెందుకు హఠాత్తుగా గుర్తొచ్చిందీ అంటే…
ఎక్కడో అస్సోంలో మారుమూల… దేశసరిహద్దుల్లో… గుట్టల్లో, అడవుల్లో, డొంకల్లో, ప్రవాహాల్లో, వరద బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ… జనం బాధలతో మమేకమై దేశమంతా ప్రశంసలు పొందుతున్న మన హైదరాబాదీ జల్లి కీర్తి గురించి సెర్చ్ చేస్తుంటే… జమీన్ రైతు పత్రికలో ఈ వార్త కనిపించింది… ఇది పూర్తిగా కంట్రాస్టు వార్త… చదువుతుంటేనే అదోరకం ఫీలింగ్… ఈ వార్త కథనం నిజమో, అబద్ధమో ఆ జిల్లా అధికార యంత్రాంగమే చెప్పాలిక…
Ads
గత నెల రోజులుగా రెండు కుక్కలు నెల్లూరు మునిసిపల్ కమిషనర్ ఛాంబర్‌లో కనిపిస్తున్నాయట… అధికార నివాసంలో కూడా… అవేమీ ఆషామాషీ కుక్కలు కావు… కోడెదూడల ఎత్తుతో, పెద్ద గొంతుతో, రక్కసి చూపులతో భీకరంగా ఉంటాయి… వాటినేమీ కట్టేసి ఉంచరు… స్వేచ్ఛగానే తిరుగుతూ ఉంటయ్… వాటికి భయపడి అధికారులు, మేయర్ సహా కార్పొరేటర్లు, సిబ్బంది ఆ ఛాంబర్ వైపు వెళ్లడానికే భయపడుతున్నారట… మరీ తప్పనిసరి పరిస్థితి ఏర్పడితే, కమిషనర్‌కు ముందుగా వాట్సప్ మెసేజ్ పెడితే, ఫలానా ఫైల్ విషయం అని చెబితే… ఆమె సమ్మతిస్తే, అప్పుడు గానీ ఆ గదిలోకి ఎంట్రీ ఉండదు…
ఆ కొద్దిసేపు మాత్రం ఆ కుక్కలను గొలుసులతో కట్టేస్తారు… ఇది అనాగరికమా..? అహమా..? అధికార దర్పమా..? దీన్నేమనాలి..? నగరంలోని ప్రజా సౌకర్యాల కల్పన, పర్యవేక్షణ ఆమె బాధ్యత… పది మందీ వస్తారు, సమస్యలు చెప్పుకుంటారు, వినాలి… గ్రీవెన్స్ వినడం, పరిష్కరించడం కమిషనర్ విధి… వీథుల్లో తిరగాలి… పదుగురితో మాట్లాడాలి… అలా కాదని, నా దగ్గరకు ఎవరూ రావద్దు అన్నట్టుగా బంధించుకుని, కుక్కల కాపలా పెట్టుకుంటే ఎలా..? అయ్యా, కలెక్టర్ గారూ, మీకు కనిపించడం లేదా ఇదంతా…?!……. ఇదండీ సదరు జమీన్ రైతు పత్రికలో వచ్చిన వార్త సారాంశం… ఆ పత్రికకు చాలా ఏళ్ల చరిత్ర, పునాది ఉంది… నెల్లూరు టౌన్‌లో చాలామంది చదువుతారు, నమ్ముతారు… మరి పాలనా యంత్రాంగం ఏమంటుందో..!!
Share this Article