నిజానికి ముందుగా చెప్పుకోవాల్సింది వేరు… మామూలుగా టీవీల్లో వచ్చే మ్యూజిక్ షోలలో మీకు ఆర్కెస్ట్రాయే ఎప్పుడూ కనిపించదు… ఎక్కువగా ట్రాకులు ఉపయోగించి కథ నడిపించేస్తుంటారు… ఒకవేళ నామ్‌కేవాస్తే ఆర్కెస్ట్రా చూపించినా కీబోర్డ్, డ్రమ్స్ మాత్రమే ప్రముఖంగా కనిపిస్తాయి… ఇవేకాదు, ఫంక్షన్లలో కూడా అంతే… ట్రాకులు పెట్టి బండి నడిపించడమే… కానీ లైవ్ ఆర్కెస్ట్రా మజాయే వేరు…
వీణ ఎప్పుడో మాయమైంది… వయోలిన్ అక్కడక్కడా కనిపిస్తోంది… సంప్రదాయ వాయిద్యాలు మాయమై పూర్తిగా కీబోర్డు ఆధిపత్యం పెరిగింది… బాలు సారథ్యంలో ఈటీవీలో స్వరాభిషేకం గట్రా ప్రోగ్రాముల్లో ఆర్కెస్ట్రాను వివిధ సందర్భాల్లో ప్రత్యేకంగా చూపించేవాళ్లు… ఐనా ఇప్పుడదంతా లేదుగా… ఆహా ఓటీటీలో వచ్చే తెలుగు ఇండియన్ ఐడల్‌లో నచ్చిందేమిటీ అంటే… తాజా ఎపిసోడ్‌లో… కామాక్షి అనే వయోలిన్ ప్లేయర్‌కు ప్రత్యేకంగా జెప్టో గిఫ్ట్ పార్శిల్ ఇచ్చి గుర్తించి, అభినందించడం…
సబబే… మొదటి నుంచీ ఈ షో చూస్తున్నవాళ్లకు తెలుసు ఎందుకో… టీవీ మ్యూజిక్ షోలలో అట్టహాసాలు, ఆడంబరాలు పెరిగిపోయి, సంగీతం, పోటీ స్పూర్తి మృగ్యమైపోతున్నవేళ… ఇండియన్ ఐడల్ కాస్త డిఫరెంటుగా ఆకర్షిస్తోంది… అదీ చెప్పదలిచింది… అదీ ఎందుకో చెప్పుకుందాం సంక్షిప్తంగా…
Ads
ఆల్‌రెడీ టాప్8లో ఉన్నవాళ్లలో అదితి అనే సింగర్ ఇప్పటికే సినిమాల్లో పాడుతోంది… థమన్ టీంలో కూడా మెంబర్… కల్పన శిష్యురాలు వైష్ణవి కూడా బీమ్లానాయక్‌లో ఓ బిట్ పాడింది… రేణుకుమార్, జయంత్, వాగ్దేవి, శ్రీనివాస్‌లకు తన పాటల్లోనే చాన్సులిస్తానని థమన్ అక్కడే ప్రామిస్ చేశాడు… ఇదీ ఓ మ్యూజికల్ షో సాధించాల్సింది… రేణకుమార్ ఏకంగా బాలయ్య సినిమాలో పాడబోతున్నాడు… నిజానికి ఇవన్నీ కాదు ఆకర్షించింది…
జడ్జిగా వ్యవహరిస్తున్న కార్తీక్, హోస్టుగా ఉన్న శ్రీరాంచంద్ర కలిసి సాగరసంగమంలోని ‘వేదం అణువణువున నాదం’ అనే పాటకు కలిపి పాడటం… ఉన్నదున్నట్టు గాకుండా తమదైన స్టయిల్‌లో, ఆ పాట విశిష్టత చెడిపోకుండా పాడటం… నిజానికి శ్రీరాంచంద్ర ఎప్పుడూ ఈ షోలో గాయకుల పాటల జడ్జిమెంటులో వేలు పెట్టడు… సరదాసరదాగా యాంకరింగ్ చేస్తూ ఉంటాడు… తను ఎప్పుడూ పాటకూడా పాడడు… హమ్ కూడా చేయడు… జస్ట్, ఓ హోస్ట్…
అలాంటిది సాగరసంగమం పాట అనగానే టెంప్టయ్యాడు… కార్తీక్‌ను కూడా పిలిచి, కలిసి పాడాడు… సూపర్బ్… కార్తీక్ అనేక పాటలు పాడాడు… కానీ ఒక షోలో ఇలా అప్పటికప్పుడు, ఇంకాస్త ఇంప్రూవైజ్ చేస్తూ పాడిన తీరు బాగుంది… శ్రీరాంచంద్ర కూడా కార్తీక్‌కు తక్కువ కాదు… అఫ్‌కోర్స్ ఆల్‌రెడీ ఓసారి హిందీ ఇండియన్ ఐడల్ విజేత తను… ఈమధ్య పెద్దగా కనిపించడం లేదు, వినిపించడం లేదు… డబ్బు కోసం ఆ పిచ్చి బిగ్‌బాస్ హౌజులోకి కూడా వెళ్లొచ్చాడు…
కానీ ఆ పాత మెరిట్ అలాగే ఉంది… కార్తీక్ ఆ లేడీ వయోలనిస్టు సహకారంతో ఆ పాటను ఇంకాస్త రక్తికట్టించాడు… నోట్స్, హుక్స్, పిచ్, మన్నూమశానం మనకేల… ఒక శ్రోతగా వీనులవిందుగా అనిపించింది… హిందీ ఇండియన్ ఐడల్ షోతో పోల్చలేం, కానీ ఇతర టీవీ మ్యూజికల్ షోలతో పోలిస్తే చాలా బెటర్ ఈ షో… అన్నట్టు… ఈ షోలో పూర్తి డిఫరెంట్ థమన్ కనిపిస్తున్నాడు..!!
Share this Article