ఆంజనేయుడి జన్మస్థలం మీద వివాదం రగులుతూనే ఉంది… నాసిక్‌లోని అంజనేరిలో పుట్టలేదనీ, కర్నాటకలోకి కిష్కింధలోనే పుట్టాడని ఓ కన్నడ స్వామి వాదిస్తున్నాడు… ఆయన నాసిక్‌లో గురువారం ధర్మసంసద్ భేటీకి కూడా పిలుపునిచ్చాడు… దేశం నలుమూలల నుంచీ వచ్చే సాధుసంతుల అభిప్రాయాలు తీసుకుని, వాళ్ల నిర్ణయాన్ని ఆమోదిస్తామనీ అనికేత్ శాస్త్రి దేశ్‌పాండే అంటున్నాడు… అసలు అంజనేరిలో ఆంజనేయుడు పుట్టినట్టుగా రామాయణంలో వాల్మీకి మహర్షి ఎక్కడా చెప్పలేదని తన వాదన… కన్నడ మహంత్ గోవింద్ దాస్ కూడా ఇదే అంటాడు…
ఆల్‌రెడీ టీటీడీ కూడా ఈ వివాదంలోకి అడుగుపెట్టి, అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలి అని ప్రకటించిన సంగతి తెలిసిందే… కర్నాటక దాన్ని వ్యతిరేకిస్తోంది… అంతేకాదు, కర్నాటకలోని కొప్పల్ జిల్లా, గంగావతి తాలూకాలోని అంజనాద్రి పర్వతాన్ని వరల్డ్ క్లాస్ టూరిజం సెంటర్ చేయాలనే ఆలోచనలో ఉంది… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..?
ఎవరు ఏం వాదిస్తున్నా పాత పుస్తకాలు, నమ్మకాలు పురాణగాథలే తప్ప ఇంకేమీ ఆధారాలు ఉండవు… అవేమీ ప్రామాణికాలు కావు… ప్రజల విశ్వాసాలను వదిలి.., ఇక్కడే, కాదు, ఇక్కడే అనే తరహా పంచాయితీలు దేనికి..? ఎక్కడి ప్రజలు అక్కడ భక్తిగా కొలుచుకుంటారు, అందులో నష్టమేముంది..? తప్పేముంది..? విశ్వాసమే అసలు దైవం కదా… దేశమంతా హనుమంతుడున్నాడు… లేని ఊరు ఉందా..? ఇలాంటి తగాదాలకు బదులు ఈ సాధువులు, సంతులు ధార్మిక వ్యాప్తికి తమ సమయాన్ని వెచ్చించడం బెటర్ కదా… ఇప్పుడు నాసిక్ వచ్చే సాధువులు ఏ ప్రామాణికాలతో ఏం నిర్ణయిస్తారు..? మెజారిటీ అభిప్రాయం సత్యం ఎలా అవుతుంది..? (ఆమధ్య హనుమంతుడి కులాన్ని కూడా రాజకీయం చేయటానికి ప్రయత్నించారు కొందరు…)
Ads
అసలు దేశంలో అనేక స్థలాలను ఆంజనేయుడి పుట్టిన స్థలాలుగా ప్రజలు పూజిస్తారు… ఆయా ప్రాంతాల ప్రజలు బలంగా విశ్వసిస్తారు… అవేమిటో చూడండి…
ఇది తిరుమల ప్రాంత అంజనాద్రి పర్వతం… ఇక్కడే ఆంజనేయుడు పుట్టినట్టుగా టీటీడీ ప్రకటించింది… మా ప్రకటన సాధికారమే అని చెప్పడానికి ముందుగా ఓ కమిటీ వేసి, ఫలానా పుస్తకాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్టుగా చెప్పింది… ఆ పుస్తకాల్లోని అంశాలు ఆంజనేయుడి పుట్టిన స్థలాన్ని నిర్ధారిస్తున్నట్టుగా ఏమీ లేవు…
ఇది ఆంజనేయ పర్వతం… ఇక్కడ తన పేరిట ఓ గుడి కూడా ఉంది… రామాయణం ప్రకారం కిష్కింధ అంటే అది ప్రస్తుతం తుంగభద్ర ప్రాంతమనీ… ఇప్పటి హంపీయే అప్పటి కిష్కింధ అని జనం విశ్వాసం… రామాయణంలో పేర్కొన్న రుష్యమూక పర్వతం కూడా అక్కడే ఉంది… ఒకప్పుడు ఇదంతా దండకారణ్యమేననీ, రాముడు వింధ్య పర్వతశ్రేణిని దాటి, సీతను అన్వేషిస్తూ కిష్కింధ వైపు వచ్చాడనేది రామాయణ గాథ.,..
ఇదే హంపీలోని గుడి… మెజారిటీ ప్రజల విశ్వాసం మేరకు కిష్కింధ అంటే అది దక్షిణ భారతమే… కానీ దేశంలోని ఇంకా పలుచోట్ల హనుమంతుడి జన్మస్థలాలున్నయ్… అవి ఆయా ప్రాంతాల ప్రజల విశ్వాసం… నిజానికి కిష్కింధ కేవలం వాలి, సుగ్రీవుల రాజ్యం అనీ, హనుమంతుడు పుట్టింది వేరేచోట అనీ, తరువాత కిష్కింధకు చేరి ఉంటాడనీ వాళ్ల నమ్మకం…
ఇది మహారాష్ట్రలోని నాసిక్… త్య్రంబకేశ్వరానికి ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంజనేరి పర్వతమే హనుమంతుడి జన్మస్థలి అని అక్కడి ప్రజల నమ్మిక… ఆ పర్వతంపైనే హనుమంతుడి తల్లి అంజనీదేవి తపస్సు చేసిందని అంటారు… ఇక్కడ కూడా హనుమంతుడికి గుడి ఉంది… సాధువుల భేటీ జరగబోయేది ఇక్కడే…
ఇది గుజరాత్… దంగ్ జిల్లా… ఇక్కడ నవసారి అనే ప్రాంతం… ఒకప్పుడు దీన్ని కూడా దండకారణ్యం అనేవారనీ… ఇక్కడ ఉన్న ఆంజనా పర్వతమే హనుమంతుడి జన్మస్థలి అని ఆ ప్రాంత గిరిజనుల నమ్మకం… అక్కడ అంజనీ గుహ కూడా ఉంది… అందులోనే అంజనీ దేవి హనుమంతుడికి జన్మ ఇచ్చిందనేది స్థలపురాణం…
ఇది జార్ఖండ్… గుమ్లా జిల్లా… ఈ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో అంజన్ అనే ఓ గ్రామం ఉంది… అదే హనుమంతుడు పుట్టిన స్థలమని ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తారు… అంజనీదేవికి కూడా ఓ గుడి ఉంది ఇక్కడ… అసలు వాలి, సుగ్రీవుల రాజ్యం కూడా ఇదేనని ఆ ప్రజల నమ్మకం…
ఇది హర్యానా… కైతల్ పట్టణం… ఒకప్పుడు దీని పేరు కపితల్… క్రమేపీ కైతల్ అయిపోయింది… ఈ ప్రాంతాన్ని కపిరాజు కేసరి పరిపాలించేవాడు… ఇక్కడే అంజనీదేవి హనుమంతుడికి జన్మనిచ్చింది… ఇది అక్కడి స్థలపురాణం… రాజస్థాన్, చురు జిల్లా, సుజన్ గఢ్ సమీపంలోని లక్షక గుట్టలు హనుమంతుడి జన్మస్థలం అని మరో స్థలపురాణం…
Share this Article