టీడీపీకీ భారీ షాక్… కీలకనేత రాజీనామా… నిరుత్సాహంలో పార్టీ శ్రేణులు… అని థంబ్ నెయిల్స్ కనిపిస్తుంటే… అబ్బో, రాజీనామా చేసిన అంత పెద్ద కీలకనేత ఎవరబ్బా అని చూస్తే… దివ్యవాణి రాజీనామా అని కనిపించింది… వాట్సప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో, మీడియాలో ఇదొక హంగామా..? ఆమె అంత పెద్ద కీలకనేతా..? దాంతో టీడీపీ షాక్ తిన్నదా..? నిజంగా ఆమె సాధించగలిగిన వోట్లు ఎన్ని..? పార్టీకి ఆమె ఉపయోగం ఎంత..? అవి చదువుతుంటే నవ్వొచ్చింది… కాదు, రాజీనామా తరువాత గంట సేపటికే ఉపసంహరణ వార్తలొచ్చి పడ్డయ్… అవి చదువుతుంటే ఇక నవ్వు ఆగలేదు… ఎందుకంటే..?
ఓ కళాకారుడు స్థాపించిన పార్టీలో కళాకారిణికి అన్యాయమా..? అవమానమా..? ఈమాత్రం గుర్తింపులేదా..? ఓ ఫైర్ బ్రాండ్‌గా కష్టపడుతున్నాను… నన్ను మాట్లాడనివ్వరా..? ఛఫో, ఈ బేమాన్ పార్టీలో ఉండటం వేస్టు, నేను వెళ్లిపోతున్నా అన్నట్టుగా… మస్తు బాధపడుతూ మాట్లాడిన వీడియో కూడా ఒకటి కనిపించింది… రాజీనామా ప్రకటన తరువాత గంటసేపటికే రాజీనామా ఉపసంహరణ అట… ఈ గంట సేపట్లో అవమానం ఎటుపోయింది..? మళ్లీ పార్టీ ధగధగ వెలుగుతూ ఎలా కనిపించింది..? ఇంతకీ ఆమెకు ఏం కావాలి..? ఎవరేం హామీ ఇచ్చారు..?
(ఆమె రాజీనామా చేస్తున్నట్టుగా ఉన్న ట్వీట్ నిజమేనా అని చెక్ చేస్తే అది కనిపించలేదు, బహుశా డిలిట్ చేశారేమో… నిజానికి ఆ ట్విట్టర్ ఖాతాయే ట్విట్టర్ ధ్రువీకరించిన అఫీషియల్ ఖాతా కాదు… హేమిటో, అంతా అయోమయం, గందరగోళం… పార్టీకి రాజీనామా అంటే ఎంత ఆచితూచి, ఆలోచించి చేయాల్సిన పని… పైగా, కాసేపటికే, తూచ్, అదేమీ లేదుపో అని వెనక్కి తగ్గడం… ప్చ్, ఏమాత్రం దివ్యంగా లేదు వాణీ…)
Ads
నిజానికి దివ్యవాణి ఫస్టూ కాదు, లాస్టూ కాదు… పైగా ఫైర్ బ్రాండ్‌లా కష్టపడటం అంటే ఏమిటో అర్థం కాలేదు… ఎలాగూ ఏపీ పాలిటిక్సు అంటేనే దుర్గంధపూరిత విమర్శలు, తిట్లు ఉంటాయి కాబట్టి… మీడియా ముందుకొచ్చి, నోటికొచ్చినట్టు ఎవరో ఒకరిని టార్గెట్ చేసి తిట్టేయడమా ఫైర్ బ్రాండ్ అంటే..? అసలు నటి జయప్రదతో పోలిస్తే ఈమె ఎంత..? ఆమే దిక్కులేక, ఇక్కడ ఉండలేక ఉత్తరప్రదేశానికి పారిపోయింది… ప్రజలకు సేవ చేయడానికి..!!
పార్టీలోకి అలా వస్తుంటారు, కొన్నాళ్లకు వెళ్లిపోతుంటారు… ఇంకా దివ్యవాణికి తత్వం బోధపడనట్టుంది… ఆమధ్య ఇంకో ఫైర్ బ్రాండ్ కనిపించేది… ఆమె కూడా నటే… కవిత… ఇప్పుడు ఆమె ఏ పార్టీలో ఉందో, ఏమో మరి… ఆ తరువాత మరో మెరుపు కనిపించింది… వానపాటల వాణివిశ్వనాథ్… మెరుపులాగే మాయమైంది… అంతకుముందు యామిని శర్మ కొంతకాలం ఫుల్లు ఫైర్‌తో కనిపించేది… ఆమె కూడా ఇప్పుడు పార్టీలో లేదు… మొన్న ఎవరో మహిళా నాయకురాలు తొడకొడుతూ, భీకరంగా అరుస్తూ కనిపించింది… ఆమె మామూలు ఫైర్ కాదు, కార్చిచ్చు… కాకపోతే ఆ భాషేమిటో… ఆ నటన ఏమిటో… భయమేసింది…
అంతెందుకు..? రోజా కూడా ఫైర్ బ్రాండే కదా… ఆమె కూడా తెలుగుదేశంలో ఉండీ ఉండీ, జగన్‌ను తిట్టీ తిట్టీ… తరువాత తత్వం, కర్తవ్యం బాగా అర్థమైపోయి… అదే జగన్ క్యాంపులోకి దూకేసింది… ఇప్పుడామె ఏకంగా మంత్రి అయిపోయింది… అసలు వీళ్లే కాదు… అందరూ ఇలాగే కనిపిస్తున్నారు… 18 ఏళ్లుగా పార్టీ సేవ చేస్తున్నాను, వాటీజ్ దిస్, వేరీజ్ మై రాజ్యసభ సీట్ అని కాంగ్రెస్ మీద నగ్మా ఫైర్ అయిపోతోంది… విజయశాంతి కూడా బీజేపీలో అసంతృప్తితోనే ఉందట… కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్‌గా చేసిన కన్నడ నటి దివ్య స్పందన ఇప్పుడు అసంతృప్తితో ఎటుపోయిందో, ఏమైపోయిందో ఎవరికీ తెలియదు… హేమిటో…
Share this Article