పాన్ ఇండియా సినిమా అంటే… ఖచ్చితంగా ఆ కథ ఇతర భాషల ప్రేక్షకులతో కనెక్ట్ కావాలనేమీ లేదు… కావాలని తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాల నుంచి కొందరు నటీనటుల్ని తీసుకుని పాన్ ఇండియా లుక్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు… కేజీఎఫ్‌లో అలాంటి పోకడలేమీ లేవు… ధనాధన్… ఫటాఫట్… తెర నిండా బుల్లెట్ గాయాలే… అయితేనేం, ప్రేక్షకులు ఇరగబడ్డారు…
ఆర్ఆర్ఆర్‌లో ప్రధాన కేరక్టర్లు ప్యూర్ తెలుగు… కాకపోతే రాజమౌళి రకరకాల మసాలాలు, ఆలియా, మరో ఇంగ్లిష్ నటి గట్రా యాడ్ చేసేసరికి కాస్త పాన్ ఇండియా లుక్కు వచ్చింది… అదీ జనం బాగానే చూశారు… బాహుబలి తాలూకు ముద్ర కూడా కాస్త ఉంది కాబట్టి సరిపోయింది… పుష్ప ఓ కలప స్మగ్లర్ కథ… కానీ సాంగ్స్, ఆ లుక్కు జనాన్ని పిచ్చెక్కించింది… అనూహ్యమైన వసూళ్లు… కానీ పాన్ ఇండియా హీరోగా పేరున్నా సరే రాధేశ్యామ్ ఓ ఢమాల్…
తమిళ, మలయాళ హీరోల సినిమాలు కూడా ఫట్‌మన్నాయి… సో, పాన్ ఇండియా సినిమా అంటే ప్రత్యేకమైన లక్షణాలేమీ ఉండవు… సగటు ప్రేక్షకుడు హిమాచల్‌ప్రదేశ్‌లో ఎలా ఉంటాడో, ఆంధ్రప్రదేశ్‌లోనూ అలాగే ఉంటాడు… కాకపోతే నార్త్ ఇండియాలో సరైన బయ్యర్లను పట్టుకోవాలి… ప్రమోట్ చేసుకోవాలి… ఆ ట్యూన్లలో పిచ్చి పిచ్చి పదాలు నింపకుండా, కాస్త ఒరిజినల్ సాంగ్స్‌లా ధ్వనించాలి… డైలాగ్స్ మీద శ్రద్ధ పెట్టాలి… పుష్ప హిందీ పాటలు కూడా హిట్… ఆ పాటలతోనే సినిమా హిందీలోనూ హిట్… నిజానికి ఆ సినిమాలో బన్నీ మార్క్ స్టన్నింగ్ స్టెప్స్ ఏమీ లేవు… ఐనా క్లిక్కయ్యాయి పాటలు…
Ads
కాకపోతే హిందీ ప్రేక్షకులను కూడా కనెక్ట్ చేసే కథ ఉంటే మాత్రం… మార్కెటింగ్ ఈజీ… ఓటీటీ, టీవీ రైట్స్ డబ్బులు అదనం… సౌత్ ఇండియా భాషలు సరేసరి… అడవి శేషు సినిమా మేజర్ విషయం తీసుకుంటే… ఈ కథ దేశవ్యాప్తంగా కనెక్ట్ కాగలదు, తెలుగు సరేసరి, సందీప్ ఉన్నికృష్ణన్ మలయాళీ కాబట్టి కేరళ ప్రేక్షకులకూ కనెక్టవుతుందని అంచనా వేశారు… అందుకని తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ చేస్తున్నారు… మినీ పాన్ ఇండియా మూవీ అనాలేమో…
హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా తన కొత్త సినిమా విషయంలో ఇలాగే భలే ఆలోచించాడు… ఏడెనిమిదేళ్ల క్రితం కార్తికేయ సినిమా వచ్చింది కదా… అది కాస్త బాగానే ఆడింది… అప్పటికి పాన్ ఇండియా, పలు భాషల్లో ఏకకాలంలో డబ్బింగ్… ఎడాపెడా మార్కెటింగ్ ఇంత ఊపందుకోలేదు… నేనేంటి, పాన్ ఇండియా స్టారేంటి అని వెనుకంజ వేయలేదు… అయిదు భాషల కార్తికేయ-2 సీక్వెల్‌తో పాన్ ఇండియా స్టార్ అయిపోతున్నాడు… కాకపోతే కాస్త ఇకమత్ చేస్తున్నారు…
మహేష్ సర్కారువారి పాట, వెంకటేష్ ఎఫ్-3 పాన్ ఇండియా తరహాలో వేర్వేరు భాషల్లో ఎందుకు రిలీజ్ కాలేదు..? ఆ కథలు పెద్దగా దేశవ్యాప్తంగా కనెక్ట్ కావు… మహేష్ తమిళంలో కాస్త పరిచయమేమో గానీ హిందీలో పరిచయం లేడు… వెంకటేష్ సరేసరి… పైగా ఎఫ్-3 మరీ నాసిరకం జబర్దస్త్ తరహా కామెడీ… అది హిందీ వాళ్లకు ఎక్కదు… జీర్ణం కాదు… మనకే వెగటు వాసన… అందుకే నిఖిల్, దర్శకుడు చందూ ఓ ఆలోచన చేశారు… దేశం మొత్తానికి కనెక్టయ్యేలా కథ రాయించారు…
అది ద్వారక… ఆ మిస్టరీ బేస్ చేసుకున్నారు… కృష్ణుడు, ద్వారక అన్నాక కనెక్ట్ కానివారెవ్వరు… మోషన్ పోస్టర్ చూశారా..? అనుపమ పరమేశ్వరన్… తను తమిళ, మలయాళ ప్రేక్షకులకు కూడా పరిచయమే… ఇక హిందీ కోసం అనుపమ్ ఖేర్… ఈ ఇద్దరు అనుపమలు ఇతర భాషల కోసం… అనుపమ్ ఈమధ్య కాశ్మీరీ ఫైల్స్‌తో మళ్లీ బలంగా తెరమీదకు వచ్చాడు… ఓ షిప్‌లో సముద్రంలో వెళ్తున్న సీన్… ఎక్కడికి..? ద్వారకకు..! అదే సినిమా కథ… గతంలో వెంకటేష్ హీరోగా దేవీపుత్రుడు సినిమా వచ్చింది కదా… కాకపోతే ఎందుకో గానీ జనానికి నచ్చలేదు అది… మంచి గ్రాఫిక్స్, ద్వారక మిస్టరీ కథను గనుక గ్రిప్పింగ్ కథనంతో చెప్పగలిగితే… నిఖిల్ పాన్ ఇండియా ఆలోచన క్లిక్ కావచ్చు… హీరో, దర్శకుడి ఆలోచనలైతే సరైన దిశలోనే ఉన్నాయ్…
Share this Article