ఎవడో ఓ దిక్కుమాలిన సినిమా తీయడం… ఎవడో ఒక ఓటీటీ వాడు అడ్డగోలు రేటుకు దానికి కొనేయడం… ఇష్టమున్నవాడు చూస్తే చూస్తాడు, లేకపోతే లేదు… ఇప్పటిదాకా ఇదేకదా జరుగుతోంది…!! కానీ ఆ రోజులు ఇక పోయినట్టే… ఓటీటీ దందా మారిపోతోంది… మారిపోయింది… ఒక్కసారి ప్రముఖ ఓటీటీలు చూడండి… ప్రతి కొత్త మూవీకి రేట్లు పెట్టేస్తున్నారు… తమ సబ్‌స్క్రిప్షన్‌తో లింక్ పెడుతున్నారు… దాని పేరు రెంట్ ది మూవీ… అంటే సింపుల్‌గా ఓటీటీ వీక్షణానికీ టికెట్ పెడుతున్నారు… అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు…
కొన్నిరోజుల వేలిడిటీ ఉంటుంది… ఒకసారి సినిమా చూడ్డం స్టార్ట్ చేస్తే 48 గంటల్లోపు చూసేయాలి… అంతే… మీ హోం థియేటర్‌లో ఎన్నిసార్లయినా చూసుకొండి… చెత్తా పాటలు స్కిప్ చేయొచ్చు… మంచి సీన్లను మళ్లీ మళ్లీ చూడొచ్చు… క్యాంటీన్ పాప్‌కార్న్ దందాకు, పార్కింగ్ దందాకు వేలు తగలేసే పనేమీ లేదు… ఎంచక్కా స్మార్ట్ ఫోన్‌లో లాగించొచ్చు… అందుకని ఓటీటీ వాడు రేట్లు పెట్టినా చూసేవాడు చూస్తాడు…
అందుకే ప్రాథమికంగా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సరే, ప్రముఖ ఓటీటీలు పెద్దగా సందేహించడం లేదు… ఒకటీరెండు తెలుగు సినిమాల విషయంలో ‘‘పే ఫర్ వ్యూ’’ పద్ధతిని తీసేసి, అందరికీ ఫ్రీ అని ప్రకటించారు గానీ… రాను రాను పెద్ద సినిమాలన్నింటికీ ఇక రేట్లు తప్పవు… తాజాగా మహేష్ బాబు సినిమా సర్కారువారిపాటకు 199 రూపాయల బాటా ధర ఫిక్స్ చేశారు…
Ads
కేజీఎఫ్-2 సినిమాకు రేటు పెట్టగానే పైరేటెడ్ హెచ్‌డీ ప్రింట్స్ వచ్చేశాయి… ఇప్పుడు మహేష్ బాబు సినిమా కూడా పైరేటెడ్ మూవీ సైట్లలో ప్రత్యక్షమైంది… ఇక ఇదెప్పుడూ ఉంటుంది… ఇనీషియల్‌గా కొన్నిరోజులు రేటు… తరువాత ఫ్రీ… ప్రస్తుతానికి ఇదే ధోరణి… ఇన్నాళ్లూ పెట్టుబడి పెడుతూ పోయాయి ఓటీటీలు… ఇప్పుడిక రెవిన్యూ మోడ్‌లోకి వచ్చేశాయి… ఫారిన్ కంట్రీస్‌లో ఎప్పటి నుంచే ఉన్నదే… పే ఫర్ వ్యూ, వీడియో ఆన్ డిమాండ్ పద్దతులు అవే…
అడ్డగోలు రేట్లు పెట్టి సినిమా కొనడంకన్నా ఇప్పుడు ఓటీటీలు కూడా ఎగ్జిబిటర్, థియేటర్ మోడ్‌లోకి వచ్చేస్తాయి… వచ్చేస్తున్నాయి… అంటే వచ్చిన రెవిన్యూలో నీకు ఎంత..? నాకు ఎంత..? సినిమా క్లిక్కయితే ఓటీటీకి లాభం, నిర్మాతకూ లాభం… లేదంటే ఓటీటీ వాడికి పోయేదేమీ లేదు… సో, రాను రాను ఇక ఈ మోడ్‌కే ప్రాధాన్యం ఇస్తారు… అంటే సినిమా తీసిపడేద్దాం… టీవీ, ఓటీటీ రైట్స్ డబ్బు బాగా వస్తోంది అనుకునే నిర్మాతలు ఇక ఒకటికి పదిసార్లు ఆలోచించాలి…
టీవీలు కూడా తప్పుడు అంచనాలతో ఎక్కువ రేట్లకు సినిమాలు కొని రేటింగ్స్‌లో దెబ్బతిన్న ఉదంతాలు బోలెడు… తొలిసారి ప్రసారం సమయంలో ఏదో యాడ్స్ వచ్చినా… సినిమా రేటింగ్స్ లేకపోతే తరువాత ఎన్నిసార్లు ప్రసారం చేసినా ఇక ఆ యాడ్స్ కూడా రావు… సో, మెల్లిమెల్లిగా టీవీలు కూడా థియేటర్ మోడ్‌లోకి రావడం తథ్యం… ఇప్పటికే డీటీహెచ్ కంపెనీలు వీడియో ఆన్ డిమాండ్‌ను బలంగా ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నాయి… నో యాడ్స్, నో డిస్టర్బెన్స్, గుడ్ క్వాలిటీ… ఇక టీవీ చానెళ్లదే తరువాయి…!!
Share this Article