అదే సంగీత దర్శకుడు… టాప్ త్రీలో ఉండే కంపోజర్… సేమ్ హీరోయిన్… సేమ్ ట్యూన్… అచ్చంగా మళ్లీ దింపేశాడు… అంటే ఏమిటి అర్థం…? ఇంకేముంది..? సదరు సంగీత దర్శకుడిలో క్రియేవిటీ అడుగంటింది… లేదా జారిపోతున్న పాపులారిటీతో ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నాడు అని అర్థం… కాదంటే తెలుగు ప్రేక్షకులు హౌలాగాళ్లు, వాళ్లకేం తెలుస్తుందిలే అనే తేలికభావన… సదరు సంగీత దర్శకుడికే కాదు… నిర్మాతకు, దర్శకుడికి కూడా..!
ది వారియర్ అని ఓ సినిమా వస్తోంది… పోతినేని రాముడు హీరో… చాన్నాళ్లయింది తనకు హిట్ లేక… తన సినిమా ఏదీ లేక… డెస్పరేటుగా ఉన్నాడు ఓ హిట్ కావాలని… లింగుస్వామిని అనబడే ఓ తమిళ దర్శకుడిని పట్టుకున్నాడు… సినిమాలో కృతిశెట్టి హీరోయిన్… నదియా ఉంది, భారతీరాజా కూడా ఉన్నాడు… ఆది పినిశెట్టిని పెట్టారు… మరో నటి అక్షర గౌడను తీసుకొచ్చారు… బుర్రా సాయిమాధవ్ డైలాగులు… ఇంకేం కావాలి..?
కానీ ఇక్కడే ఓ దరిద్రం… ఉన్నవే రెండు పాటలు… కాస్త మనసుపెట్టి కొత్త ట్యూన్లు ఏమైనా ఆలోచించొచ్చుగా…. లేదు… దేవిశ్రీప్రసాద్ పని అయిపోయింది అన్నట్టుగా దడదడ అనే పాట కోసం గతంలో తను కంపోజ్ చేసిన ఉప్పెన జలజల పాట ట్యూన్ కాపీ కొట్టి, అచ్చంగా దింపేశాడు…
Ads
మొన్నటికిమొన్న పుష్ప సినిమా పాటలతో దేశవ్యాప్తంగా దుమ్మురేపాడుగా… మళ్లీ ఇప్పటికిప్పుడు ఏమైంది..? ఈ ప్రశ్నకు జవాబు లేదు…
కానీ… ఇండస్ట్రీలో థమన్, డీఎస్పీ నడుమ మస్తు పోటీ ఉంది… మొన్నమొన్నటివరకూ డీఎస్పీ అంటే నంబర్ వన్… కానీ ఇప్పుడది లేదు… ఆ స్పార్క్ లోపిస్తోంది… థమన్ మెల్లిమెల్లిగా నంబర్ వన్ ప్లేసులోకి వెళ్లిపోతున్నాడు,.. కాపీ కొట్టడంలో ఎవరూ తక్కువ కాదు… కానీ ఎవరు ఎక్కువ హిట్లు కొడతారో వాళ్లదే ఇండస్ట్రీ… ఇవ్వాళారేపు సినిమా సక్సెస్ కావాలంటే పాటలు, బీజీఎం ఓ రేంజులో ఉండాలి… ఇదుగో అసలు పోటీ ఇక్కడ స్టార్టయ్యేసరికి డీఎస్పీ గాడితప్పిపోయాడు…
ఒక్కసారి ది వారియర్ సినిమాలో ఈ పాట వినండి… తాజాగా రిలీజ్ చేశారు… మంచి ట్యూనే… పెద్దగా సాహిత్యం మన్నూమశానం ఏమీ లేదు… గానంలో మెరుపులు కూడా ఏమీ లేవు… సూపర్ సింగర్ జూనియర్స్ కంటెస్టెంట్లు కూడా పాడగలరు ఈ పాటను… ఆ సాహిత్యం అనబడే పదాలు, వాక్యాల జోలికి పోవడం లేదు… జస్ట్ ట్యూన్… వినండి…
అయిపోయిందా..? ఇప్పుడిక అదే సంగీత దర్శకుడు ఉప్పెన సినిమా కోసం చేసిన పాట వినండి ఓసారి… బాగా హిట్… అదే హీరోయిన్… మంచి చిత్రీకరణ… మంచి అని కూడా కాదు, దర్శకుడు కృతి అందాల్ని వెన్నెల సముద్రంలో ఆడేసుకున్నాడు… మరి అదే ట్యూన్‌ను అచ్చు గుద్దడం దేనికి దేవిశ్రీ…? థమన్‌తో పోటీ ఫ్రస్ట్రేషన్ వైపు తీసుకుపోతోందా..? పోనీ, దీన్ని నిర్మాత, దర్శకుడు ఎలా అంగీకరించారు..? ఏమీలేదు… ప్రేక్షకులు పిచ్చోళ్లు అనే భావనకు బలంగా కట్టుబడి ఉండటమే…!!
Share this Article