ఒక వార్త… హైదరాబాద్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ పబ్ మీద దాడిచేసి కొన్ని అరెస్టులు చేశారు… విషయం ఏందయ్యా అంటే..? ఆ పబ్బులో అమ్మాయిలు అశ్లీల నృత్యాలు చేస్తున్నారట… కస్టమర్లను ఆకర్షిస్తున్నారట… అవసరమైతే శృంగారసేవల్ని ఆఫర్ చేస్తున్నారట… అయితే ఇక్కడ కొన్ని సందేహాలు… సిటీలో లా అండ్ ఆర్డర్ ఓ దశ, ఓ దిశ లేకుండా కొట్టుకుపోతున్నందున సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవచ్చు… ఎందుకంటే..?
- డీజే ఆపరేటర్ అరెస్టు… ఇక్కడ డీజే ఆపరేటర్ చేసిన నేరమేమిటి..? తన డ్యూటీ తను చేస్తున్నాడు…
- నాలుగు రోజుల క్రితం ఇంకేదో పబ్బులో సెక్యూరిటీ ఇన్‌చార్జి అరెస్టు… ఇక్కడ తన నేరం ఏమిటి..? అశ్లీల నృత్యాలకు తను బాధ్యుడు ఎలా అవుతాడు..?
- టైమ్ దాటాక పబ్బు నడుస్తోందనే ఆరోపణ… అలాంటప్పుడు పబ్బు అనుమతి రద్దు చేయాలి, అంతేతప్ప మేనేజర్లు, డీజే ఆపరేటర్లు, స్టివార్డులు, సెక్యూరిటీ ఇన్‌చార్జులు ఎలా నేరగాళ్లు అవుతారు..?
- శృంగార సర్వీసులకు అడ్డాగా మారిందని ఆరోపణ… సో, పబ్బు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా అయితే పబ్బు పర్మిషన్ రద్దు చేయాలి కదా…
- కస్టమర్ల అరెస్టు… అశ్లీల నృత్యాలు చూసే కస్టమర్లు నేరగాళ్లు ఎలా అవుతారు..? అది పర్మిటెడ్ పబ్బు…
- నృత్యాలు చేసే ఆర్టిస్టుల అరెస్టు… వాళ్లు శృంగార సేవల్ని ఆఫర్ చేస్తున్నారు కాబట్టి తప్పు అంటారు పోలీసులు… సోవాట్..?
వ్యభిచారం కోసమే అవన్నీ చేస్తున్నారని అనుకుందాం… అసలు వ్యభిచారం వృత్తి తప్ప నేరం కాదని సుప్రీంకోర్టే చెప్పింది, వేధించకూడదని మొన్న అసాధారణ అధికారాల సెక్షన్ ఉపయోగించుకుని మరీ చెప్పింది… మళ్లీ ఇదేమిటి..? కస్టమర్ల మీద నేరారోపణ వద్దని కూడా కోర్టులు చెబుతున్నాయి… మరి పోలీసులు ఎందుకు అరెస్టులు చేస్తున్నారు..?
Ads
ఆమధ్య రేడిసన్ పబ్ వ్యవహారంలో కూడా అంతే కాదా… అనేకమంది విదేశీయులు సహా ఠాణాకు రప్పించారు, అర్ధరాత్రి ఆగమాగం చేశారు… తీరా చూస్తే అది 24 గంటల పర్మిషన్ తీసుకున్న పబ్… మరి అక్కడికి వెళ్లే ప్రతివాడూ నేరస్థులు ఎలా అవుతారు..? ఓ విశ్వనగరం అన్నాక ఏ అర్ధరాత్రో ఎవరైనా చిల్ కావడానికి అక్కడికి వెళ్తే అది నేరం ఎలా అవుతుంది..? ఇంతకీ ఆ కేసు ఏమైంది..? ఎంతమంది డ్రగ్ పెడిలర్స్‌ను పట్టుకున్నారు..? పోలీసులు చేయాల్సింది డ్రగ్ మాఫియా మూలాల్ని నరికేయడం కదా… ఈ చిల్లర కేసులతో ఒరిగేదేముంది..?
అసలు అశ్లీలనృత్యానికి నిర్వచనం ఏమిటి..? అసభ్య, అశ్లీల, చిల్లర నృత్యమే నేరమైతే… ఈటీవీ అధినేత రామోజీరావును అరెస్టు చేస్తారా..? ఈటీవీ ఢీ షోలో నృత్యాలన్నీ అవే కదా… చిరంజీవిని అరెస్టు చేస్తారా..? అమ్మడూ కుమ్ముడూ కన్నా అశ్లీలనృత్యం ఏముంటుంది..? వోకే, పబ్బులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలు అయ్యాయనే అనుకుందాం… మరి పబ్బుల్ని కూడా మూసేయాల్సింది…
ఓటీటీల్లో వెబ్ సీరీస్ అన్నీ ఫుల్లు అడల్ట్ కంటెంటు… ప్రతి సినిమాలోనూ పాటలు, డాన్సులు అవే… సీన్లు అవే… ఎందరు నిర్మాతల్ని, దర్శకుల్ని అరెస్టు చేద్దాం… థమన్, డీఎస్పీ సహా శేఖర్, జానీ మాస్టర్లను, హీరోయిన్లను…. ముందుగా ఊ అంటావా అని ఊగిపోయిన సమంతను, పక్కన ఉన్న బన్నీని అరెస్టు చేద్దామా..? చేయగలమా..? పుష్ప సినిమాలో హీరోయిన్ ఛాతీ మీద హీరో చేతుల సీన్ ఒక్కటి చాలదా…? మరెందుకీ పిచ్చి కేసులు..? అరెస్టులు… తీరాచూస్తే, వాటికి స్టేషన్ బెయిల్ ఇచ్చి, ఎక్సయిజ్ వాళ్లకు అప్పగిస్తారట… మరెందుకు మీ ఓవరాక్షన్… సిటీ ఎక్సయిజు వాళ్లకు తెలియకుండానే జరుగుతున్నాయా ఇవన్నీ..? ముందుగా వాళ్ల మీద కేసులు పెట్టి, అరెస్టు చేయాలి, చేస్తారా..? అసలు సిటీ శివార్లలోని రిసార్టుల్లో జరిగే రేవ్ పార్టీల మాటేమిటి..?
పేకాట క్లబ్బులు ఉండొద్దు… వేరే సిటీల్లో నడవొచ్చు… పబ్బులు అరగంట లేటయితే నేరం, మరి కల్లీకల్లు అడ్డాలుగా ఉన్న కల్లు షాపుల మాటేమిటి..? చేతనైతే డ్రగ్స్ మూలాల్ని పెకిలించాలి… అప్పుడెప్పుడో అకున్ సబర్వాల్ స్టార్ట్ చేసిన హంగామాకు ఈరోజుకూ ఫుల్ స్టాప్ లేదు… అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిటీ లా అండ్ ఆర్డర్ మీద ఓ డైరెక్షన్ ఉందా..?! ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కొలువు కోసం వస్తున్న నగరం ఇది… వాళ్లకు ఏం సందేశం ఇస్తున్నది ప్రభుత్వం..!!
కాబోయే ప్రధాని కాబట్టి… దేశాన్ని ఉద్దరించే పనిలో చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రికి తీరిక లేదు… కనీసం కాబోయే ముఖ్యమంత్రి కేటీయార్ అయినా సమీక్షించుకోవాలి ఓసారి సీరియస్‌గా… విశ్వనగరానికి కావల్సింది ఏమిటో… సిటీ పోలీసుల ధోరణితో విశ్వనగరానికి అప్రతిష్ట ఏమిటో…!!
Share this Article